Open School: ఉన్నతంగా ఎదిగేందుకు ‘ఓపెన్ స్కూల్’
చిత్తూరు కలెక్టరేట్ : ఉన్నత చదువువులు, ఉద్యోగోన్నతులతో ఎదిగేందుకు ఓపెన్ స్కూల్ ఉపయోగపడుతుందని రాష్ట్ర ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ రవీంద్రనాథ్ తెలిపారు. శనివారం డీఈఓ కార్యాలయంలో ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ కో–ఆర్డినేటర్‌లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ విధానంలో ప్రభుత్వం అనేక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. డీ సెంటర్‌లతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా అడ్మిషన్ తీసుకునే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. అభ్యర్థుల ఇళ్ల వద్దకే పాఠ్యపుస్తకాలు, సర్టిఫికెట్లు అందజేసే ప్రక్రియను ప్రారంభించినట్లు వివరించారు. ఆయా సర్టిఫికెట్లను ఆధార్‌తో లింక్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ విద్యాసంవత్సరంలో పది, ఇంటర్ అడ్మిషన్‌లకు ఈ నెల 31 వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. జిల్లా ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ గురుస్వామిరెడ్డి మాట్లాడుతూ అభ్యర్థుల దరఖాస్తులను పూర్తి చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రాలు సేకరించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయం సూపరింటెండెంట్ రేణుక, స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ గుణశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
చదవండి: Admissions in Sainik School: బాలికల సైనిక్ స్కూల్లో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..