Skip to main content

కాకతీయానంతర యుగం

కాకతీయుల అనంతరం ఓరుగల్లు ఢిల్లీ సామ్రాజ్యంలో భాగమైంది. అదే సమయంలో మధుర కూడా ఢిల్లీ సుల్తానుల వశమైంది. ఆంధ్రనగరిగా పేరొందిన ఓరుగల్లు సుల్తాన్‌పూర్‌గా మారింది. జలాలుద్దీన్ హసన్‌షా మధురకు రాజుకాగా, ఓరుగల్లు ప్రాంతం దేవగిరి వజీరయిన మాలిక్ బుర్హన్‌ఉద్దీన్ పాలనలోకి వచ్చింది. ఇతడికి సహాయంగా ఓరుగల్లులో మాలిక్ మక్బూల్ వజీర్ అయ్యాడు. ప్రతాపరుద్రుడి సేనానిగా పనిచేసిన నాగయగన్నయ మతం మార్చుకొని మాలిక్ మక్బూల్ అయ్యాడు. ఢిల్లీ సుల్తాన్ మహ్మద్‌బిన్ తుగ్లక్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఇందులో భాగంగా ఆంధ్రదేశంలోనూ స్వతంత్ర రాజ్య స్థాపన కోసం తిరుగుబాట్లు జరిగాయి.
ప్రతాపరుద్రుడి మరో సేనాని రేచర్ల సింగమనాయకుడు స్వతంత్రించి దక్షిణ తెలంగాణలో పద్మనాయక రాజ్యాన్ని స్థాపించాడు. ప్రోలయ ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి ముస్లింలను పారదోలి రేకపల్లి రాజధానిగా స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. దక్షిణ తీరాంధ్రలో 1325 నాటికే ప్రోలయ వేమారెడ్డి స్వతంత్రించాడు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అరవీటి వంశానికి చెందిన సోమదేవరాజు స్వతంత్రించాడు. అనంతరం కంపిలిలో హరిహరరాయలు, బుక్కరాయలు స్వతంత్రరాజ్యాన్ని స్థాపించారు. నుస్రత్‌ఖాన్ బీదర్ సమీపంలో స్వతంత్ర రాజ్యస్థాపనకు యత్నించి విఫలమయ్యాడు. ఈ విధంగా కాకతీయ సామ్రాజ్య శిథిలాల నుంచి కంపిలి (విజయనగర), రెడ్డి, వెలమ, నాయక అనే నాలుగు స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించాయి. ఈ రాజ్యాల స్థాపనతో ఆంధ్ర దేశంలో ముస్లింల అధికారం అంతమైంది. వీటిలో తెలంగాణతో సంబంధమున్న రాజ్యాల గురించి  తెలుసుకుందాం.
 
ముసునూరి నాయకులు
ముసునూరు గ్రామం కృష్ణాజిల్లా ఉయ్యూరు తాలూకాలో ఉంది. నెల్లూరు జిల్లాలోనూ ఈ పేరుతో ఓ గ్రామం ఉంది. కానీ కృష్ణా జిల్లాలోని ముసునూరులో కోటశిథిలాలు ఉండటాన్ని బట్టి వీరి జన్మస్థలం ఇదే కావచ్చు. కమ్మ సామాజిక వర్గంలో ముసునూరి వారు ఉండటాన్ని బట్టి ముసునూరు నాయకులు కమ్మ కులస్థులు లేదా వారి పూర్వీకులై ఉంటారు. కాకతీయుల పతనానంతరం ముస్లింల వశమైన ఆంధ్రదేశంలో అసంతృప్తి చెలరేగింది. దీన్ని అవకాశంగా తీసుకొని ఈ వంశానికి చెందిన ప్రోలయ నాయకుడు భద్రాచలం ప్రాంతంలోని రేకపల్లి కేంద్రంగా ముస్లింలతో పోరాడాడు. ప్రోలయ నాయకుడికి అతడి పినతండ్రి కుమారుడైన కాపయనాయకుడు, వేంగి పాలకుడైన వేంగభూపాలుడు, రుద్రదేవుడు, అన్నమంత్రి సహకరించారు. ప్రోలయ ముస్లింలను పారదోలి  రేకపల్లి రాజధానిగా స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు.
ప్రోలయకు సంతానం లేనందువల్ల అతడి మరణం తర్వాత కాపయనాయకుడు రాజయ్యాడు. సింగమనీడు, వేమారెడ్డిల సహకారంతో ముస్లింలపై పోరాటం కొనసాగించి 1336లో ఓరుగల్లు కోటను ఆక్రమించాడు. మాలిక్ మక్బూల్ పారిపోయాడు. ఓరుగల్లు రాజధానిగా ఉత్తర తెలంగాణను, కృష్ణానది నుంచి గోదావరి వరకు ఉన్న తీరాంధ్రను పాలించాడు. విస్తరణ కాంక్షతో రేచర్ల సింగమనేని రాజ్య భాగాలైన పిల్లలమర్రి, ఆమనగల్లు, వాడపల్లి ప్రాంతాలను ఆక్రమించి వాటి పాలకుడిగా  ఎరబోతు లెంకను నియమించాడు. తీరాంధ్రను పాలించేందుకు ప్రతినిధులను నియమించాడు. కోడుకొండ్ల ప్రాంతంలో తన ప్రతినిధిగా కూన నాయకుడిని నియమించాడు. సబ్బినాడు (కరీంనగర్)కు ముప్పభూపాలుడిని రాజప్రతినిధిగా నియమించాడు. ఇతడు మడికి సింగనకు ఆశ్రయం కల్పించాడు. కాపయ నాయకుడు తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకుంటున్న సమయంలో హసన్ గంగూ(జాఫర్ ఖాన్) మహ్మద్‌బిన్ తుగ్లక్‌పై తిరుగుబాటు చేశాడు. అలాఉద్దీన్ బహమన్ షా అనే బిరుదుతో 1341లో గుల్బర్గా రాజధానిగా బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు. ఈ తిరుగుబాటు సమయంలో కాపయ నాయకుడు హసన్ గంగూకు సహాయం చేశాడు. కానీ హసన్ గంగూ కొంత కాలం తర్వాత ఓరుగల్లు మీద దాడి చేశాడు. కాపయ కౌలాస్ (నిజామాబాద్) దుర్గాన్ని వదులుకున్నాడు. హసన్ గంగూ 1356-57లో మరోసారి దండెత్తాడు. కాపయ ఈసారి భువనగిరి దుర్గాన్ని కోల్పోయాడు. నాటి నుంచి కొంత కాలం బహమనీ సుల్తాన్లకు భువనగిరి తూర్పు సరిహద్దుగా మారింది. విజయనగర బుక్కరాయల సాయంతో కాపయ నాయకుడు బహమనీ సుల్తాన్‌ను అరికట్టడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం సఫలం కాకపోగా కుమారుడైన వినాయక దేవుణ్ణి కోల్పోయాడు.  కాపయ నాయకుడి చర్యకు ఆగ్రహించిన బహమనీ సుల్తాన్ హుమాయున్ గోల్కొండ పైకి తన సేనానిని, ఓరుగల్లుపై సఫదర్‌ఖాన్‌ను దండయాత్రకు పంపాడు. కాపయ ఈసారి గోల్కొండ దుర్గం సహా పరిసర ప్రాంతాల్ని కొల్పోయాడు. 1364-65లో బహమనీ సుల్తాన్‌తో సంధి చేసుకొని పై ప్రాంతంతో పాటు 300 ఏనుగులను, 2000 గుర్రాలను, 3 లక్షల రూపాయలను యుద్ధ నష్టపరిహారంగా చెల్లించాడు.
కాయప నాయకుడి వరుస పరాజయాలను అదనుగా తీసుకొని తీరాంధ్ర పాలకులు స్వతంత్రం ప్రకటించుకున్నారు. ఉత్తర తీరాంధ్ర రెడ్ల ఆధీనంలోకి వెళ్లింది. తీరాంధ్ర చేజారే సమయంలోనే దక్షిణ తెలంగాణలో ఆమనగల్లు, పిల్లలమర్రి ప్రాంతాలను పాలిస్తున్న రేచర్ల సింగమనాయకుడు విజృంభించి కృష్ణా నదివరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడు. తుంగభద్ర, అంతర్వేది ప్రాంతాలను కూడా అతడు ఆక్రమించాడు. దీనికి ఆగ్రహించిన కాపయ నాయకుడు సింగమనాయకుడిని హతమార్చాడు.
సింగమనాయకుని తర్వాత రాజైన అనపోతానాయకుడు తన తండ్రి మరణానికి కారణమైన కాపయ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఓరుగల్లు మీద దండయాత్ర చేశాడు. 1366 (1367-68 అని మల్లంపల్లి సోమశేఖర శర్మ అభిప్రాయం)లో కాపయను సంహరించి ఓరుగల్లు, భువనగిరి తదితర దుర్గాలను స్వాధీనం చేసుకున్నాడు. ఇంతటితో ముసూనూరి వంశం అంతరించింది. ఈ చరిత్రను బట్టి 30 ఏళ్లపాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలు ముసునూరి వంశ  పాలనలో ఉన్నాయని తెలుస్తోంది.
 
పద్మనాయకులు (1326-1482)
పద్మనాయక వంశానికి మూలం రేచర్ల రెడ్లు. రేచర్ల నామిరెడ్డి మేనల్లుడైన చెవ్విరెడ్డి (భేతాళరెడ్డి /భేతాళనాయకుడు) పద్మనాయక వంశానికి మూల పురుషుడు. బేతిరెడ్డి, చెవ్విరెడ్డి మొదలైన పేర్లు వీరిని రెడ్డి తెగకు చెందినవారని సూచిస్తుండగా, సేనా నాయకత్వాన్ని సూచించే నాయుడు బిరుదును కూడా పద్మనాయకులు ధరించడాన్ని బట్టి వీరు రెడ్లు కాకపోవచ్చని భావించారు. కానీ వీరికి రెడ్లతో దగ్గర సంబంధం ఉందని చరిత్రకారుల అభిప్రాయం. సురవరం ప్రతాపరెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చెవ్విరెడ్డి వంశీయులే వైష్ణవమతాన్ని స్వీకరించి సంస్కరణ మార్గంలో పయనించి వెలమలై రేచర్ల పద్మనాయకులయ్యారు. పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు, వెంకటగిరి సంస్థానాధిపతులు ఈ తెగకు చెందిన వారే. కాకతీయుల సామంత మాండలికుల్లో రేచర్ల పద్మనాయకులు చివరి వరకూ అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్నారు. వీరు నల్లగొండ జిల్లాలోని పిల్లలమర్రి, నాగులపాడు ప్రాంతాలను మహాసామంతులుగా పాలించారు.
కాకతీయ సామ్రాజ్య పతనానంతరం రేచర్ల పద్మనాయకులు ఢిల్లీ సుల్తాన్లను, బహమనీ సుల్తాన్లను అరికట్టి తెలంగాణను పాలించారు. వీరు తెలంగాణేతర ప్రాంతాలను జయించినా.. కొంత కాలం తర్వాత వాటిని కోల్పోయేవారు. అదే విధంగా ఇతరులు తెలంగాణ ప్రాంతాలను ఆక్రమించినా వీరు తిరిగి పొందగలిగేవారు. మిర్యాలగూడ తాలూకాలోని ఆమనగల్లు వీరి జన్మస్థలం. వీరికి ముందు ఆమనగల్లు రాజధానిగా రేచర్ల రెడ్లు, కందూరి చోడులు పరిపాలించారు. పద్మనాయక వంశానికి మూలపురుషుడైన భేతాళనాయకుడిని గణపతిదేవుడు ఆమనగంటి పాలకుడిగా నియమించాడు.

 ప్రసాదిత్య నాయకుడి కుమారుడు వెన్నమనాయకుడు ప్రతాపరుద్రుడి సేనానిగా ప్రసిద్ధుడు. 1303లో అల్లాఉద్దీన్ ఖిల్జీ కాకతీయ రాజ్యంపై చేసిన దండయాత్రను తిప్పికొట్టిన వారిలో ఇతడు ప్రముఖుడు. వెన్నమ నాయకుడి కుమారుడు ఎరదాచానాయకుడు, సబ్బినాయకుడి కుమారుడు(ప్రసాదిత్య నాయకుడి మనవడు) నలదాచానాయకుడు కూడా ప్రతాపరుద్రుడి సేనానులే. కాకతీయులకు పాండ్య రాజుల (1316)తో, హోయసాల రాజులతో జరిగిన యుద్ధాల్లో ఎరదాచానాయకుడు కీలక పాత్ర పోషించాడు. ప్రతాపరుద్రుడు ఇతడి పరాక్రమానికి మెచ్చి పంచ పాండ్యదళ విభాళ, పాండ్య గజకేసరి అనే బిరుదులిచ్చాడు.
 ఎరదాచానాయకుడికి ముగ్గురు కుమారులు. వారు ఒకటో సింగమనాయకుడు, వెన్నమనాయకుడు, ఏచమనాయకుడు. నలదాచానేనికి మాధవనాయకుడు, దామానేడు అనే ఇద్దరు కుమారులున్నారు. వీరిలో సింగమనాయకుడు (1326-1361) ప్రసిద్ధుడు. తండ్రితోపాటు పాండ్య యుద్ధంలో పాల్గొని చిన్నతనంలోనే పరాక్రమం చూపాడు. కంపిలి రాజ్యంతో జరిగిన యుద్ధం (1320)లో కూడా విజయం సాధించి ప్రతాపరుద్రుడి ప్రశంసకు పాత్రుడయ్యాడు. ఢిల్లీ సుల్తాన్ల దాడిలో ప్రతాపరుద్రుడు బందీ అయ్యాక మహ్మద్ బిన్ తుగ్లక్ మాలిక్‌ను ఓరుగల్లు పాలకుడిగా నియమించాడు. ముసునూరి ప్రోలయ నాయకుడు, సింగమనాయకుడు, వేమారెడ్డి ముస్లింలను ఎదిరించి స్వతంత్ర రాజ్యస్థాపనకు పూనుకున్నారు. ముసునూరి ప్రోలయనాయకుడు తీరాంధ్ర నుంచి తురుష్కులను వెళ్లగొట్టాడు. ఇతడి తర్వాత పినతండ్రి కుమారుడు కాపయనాయకుడు రాజయ్యాడు. కాపయనాయకుడి నాయకత్వంలో సింగమనాయకుడు, వేమారెడ్డి తదితరులు ఏకమై 1336లో ఓరుగల్లును ఆక్రమించారు. కాపయ ఓరుగల్లు పాలకుడయ్యాడు. సింగమనాయకుడు వారసత్వంగా వచ్చిన ఆమనగల్లు రాజ్యంలో స్వతంత్రించాడు. అంతేగాక ఈ సమయంలో సింగమనాయకుడు తన కుమారులతో కలిసి మహబూబ్‌నగర్ ప్రాంతాన్ని, కృష్ణా, తుంగభద్ర మధ్య ప్రాంతాన్ని జయించి తన రాజ్యంలో కలుపుకున్నాడు.
 
 రెడ్డి, వెలమ రాజ్యాల వైరం
 చక్రవర్తి కావాలనుకున్న కాపయనాయకుడు సింగమనీడు పాలిస్తున్న ఆమనగంటి రాజ్యాన్ని ఆక్రమించి తన ప్రతినిధిగా ఎరబోతు లెంకను నియమించాడు. కాపయ ఆక్రమించిన ఆమనగల్లు, పిల్లలమర్రి ప్రాంతాన్ని సింగమనీడు 1360 ప్రాంతంలో తిరిగి జయించాడు. ఈ చర్యకు ఆగ్రహించిన కాపయ సామంతులు, స్నేహితులైన క్షత్రియులు సింగమనేని బావమరిదైన చింతపల్లి సింగమ నాయుడిని ఓరుగల్లు మండలంలోని జల్లపల్లి కోటలో బంధించారు. సింగమనీడు ఈ కోటను ముట్టడించాడు. క్షత్రియులు సంధి పేరుతో తంబళ్ల బ్రహ్మజీని రాయబారిగా పంపి సింగమను హత్య చేయించారు. అతడి కుమారులు అనపోతానాయకుడు, మాదానాయుడు రాజులై జల్లిపల్లి, ఇనుగుర్తి కోటలను ముట్టడించి క్షత్రియులను చంపి పగతీర్చుకున్నారు. కొందరు క్షత్రియులు హుజూరాబాద్, మొలంగూరు కోటల్లో దాచుకున్నారు. కరీంనగర్ జిల్లా మొలంగూరు సమీపంలోని చెంజర్ల వద్ద దాక్కొన్న సోమవంశ క్షత్రియులనందరినీ 1361లో సంహరించారు.
 ఈ సమయంలో కాపయ ప్రోత్సాహంతో క్షత్రియులకు సహాయంగా వచ్చిన రెడ్డి రాజులను మాదానాయకుడు, నాగానేడు చేజెర్ల, మొగళ్లూరు ప్రాంతం నుంచి  తరిమి వేశారు. శ్రీశైలం ప్రాంతమంతటినీ  జయించి తమ రాజ్యంలో కలుపుకున్నారు. తర్వాత రెడ్డి రాజ్యభాగమైన ధరణికోటను ముట్టడించి అనపోతారెడ్డిని ఓడించారు. ఈ యుద్ధం 1361లో చెంజర్ల యుద్ధం తర్వాత జరిగింది. ఈ యుద్ధంతో మొదలైన రెడ్డి, వెలమ రాజ్యాల వైరం ఈ రాజ్యాల పతనం దాకా కొనసాగింది. క్షత్రియుల్లో కొందరు భువనగిరి ప్రాంతం చేరి అనపోతనాయకుడి శత్రువులను కలుపుకొని యుద్ధానికి సిద్ధమయ్యారు. అనపోతానాయకుడు భువనగిరి సమీపంలో మూసీనది తీరంలో ఇంద్య్రాల వద్ద వీరిని జయించాడు. ఈ యుద్ధం  కూడా 1361లోనే జరిగింది. భువనగిరి కోట అనపోతనాయకుడి వశమైంది.
 
 పద్మనాయకుల పైచేయి
 ఈ విజయాల అనంతరం అనపోతనాయకుడు రాజధానిని ఆమనగంటి నుంచి రాచకొండకు మార్చాడు. రాచకొండ దుర్గానికి రాజాద్రి, రాజగిరి, రాజా చలమనే పేర్లున్నాయి. దట్టమైన అడవులు, పర్వత పంక్తుల మధ్య ఉన్న ఈ దుర్గం అభేద్యం. అక్కడి శాసనాల్ని బట్టి 1365కి ముందే రాజధానిని మార్చినట్లు   తెలుస్తోంది. రాజధానిని పటిష్టం చేసుకున్న తర్వాత అనపోతనాయకుడు 1368లో ఓరుగల్లును ముట్టడించాడు. అనుమకొండ సమీపంలోని భీమవరం వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అతడు కాపయనాయకుడిని సంహరించాడు. ఇరు రాజ్యాల ఆధిపత్య పోరే ఈ యుద్ధానికి కారణం. ఆంధ్ర దేశాధీశ్వరులమని ఇరువురూ చెప్పుకోవడం అందుకు నిదర్శనం. ఈ యుద్ధం 1369లో ముగిసింది. ఓరుగల్లు ప్రాంతం పద్మనాయకుల వశమైంది. ముసునూరి వంశం అంతమైంది. ఓరుగల్లు, భువనగిరి, సింగవరం మొదలైన ప్రాంతాలను అనపోతానాయకుడు స్వాధీనం చేసుకున్నాడు.
 ఓరుగల్లు స్వాధీనమయ్యాక ఆంధ్రదేశమంతటినీ  జయించాలనే ఉద్దేశంతో అనపోతా నాయకుడు కళింగ మీద దండెత్తాడు. వీర నరసింహదేవుడు యుద్ధంలో ఓడిపోయి తన కుమార్తె కనక లక్ష్మీదేవిని అనపోతనాయకుడి మనవడైన రెండో అనపోతనకిచ్చి సంధి చేసుకున్నాడు. ఇది 1380కి ముందు జరిగింది. అప్పటికి పద్మనాయక రాజ్యానికి ఉత్తరాన గోదావరి, దక్షిణాన శ్రీశైలం, తూర్పున కొండవీటి రాజ్యం, పశ్చిమాన బహమనీ రాజ్యం సరిహద్దులు. అంటే తెలంగాణ ప్రాంతమంతా పద్మనాయకుల పాలనలోకి వచ్చింది. అప్పటి నుంచి ఒక శతాబ్దం వరకూ పద్మనాయకుల చరిత్రే తెలంగాణ చరిత్ర అని చరిత్రకారులు చెప్పిన  మాట వాస్తవం.
 
 దాయాదుల పాలన
 పై విజయాలు పూర్తయ్యాక రాజ్యవిస్తీర్ణం, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా దేవరకొండ ప్రాంతానికి తన సోదరుడైన మాదానాయకుడిని అధిపతిగా నియమించాడు. అప్పట్నుంచి రాచకొండ రాజ్యంలోని దక్షిణభాగాన్ని మాదానాయకుడి సంతతి పరిపాలించింది. రెండు రాజ్యకేంద్రాలు ఏర్పడినప్పటికీ ఇరు కుటుంబాల మధ్య ఎన్నడూ పొరపొచ్చాలు రాకపోవడం చరిత్రలో అరుదైన అంశం. అనపోతానాయకుడి కుమారులు రెండో సింగభూపాలుడు, ధర్మానాయకుడు. మాదానాయకుడి కుమారుడు వేదగిరి నాయకుడు.
 అనపోతానాయకుడి తర్వాత రెండో సింగభూపాలుడు 1384లో రాచకొండలో సింహాసనం అధిష్టించాడు. అదే సంవత్సరం దేవరకొండలో పెదవేదగిరి నాయకుడు అధికారంలోకి వచ్చాడు. సింగభూపాలుడి రాజ్య ఆరంభకాలంలో విజయనగరరాజు రెండో హరిహరరాయలు రాచకొండ రాజ్యంలోని కొత్త కొండ (మహబూబ్‌నగర్)పై దండెత్తాడు. సింగ భూపాలుడు విజయనగర సైన్యాలను ఓడించాడు. తాను యువరాజుగా ఉన్నప్పుడే కల్యాణి (గుల్బర్గా) దుర్గాన్ని ఆక్రమించిన అనుభవం ఈ యుద్ధంలో ఉపయోగపడింది. ఈ యుద్ధం తర్వాత సింగ భూపాలుడు కళింగ దేశాన్ని జయించడానికి వెళ్లి గోదావరి జిల్లాలోని బెండపూడి, వేములకొండ ప్రాంతాల్ని జయించి 1387లో సింహాచల క్షేత్రంలో శాసనం వేయించాడు.
 1397లో రెండో బుక్కరాయలు పాత పగతో మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ తాలూకాలోని పానుగల్లు కోటను రెండు సంవత్సరాల యుద్ధానంతరం స్వాధీనం చేసుకున్నాడు. ఈ సమయంలోనే రెండో బుక్కరాయలు దేవరకొండ మీద దండెత్తగా, పెద వేదగిరినాయకుడు తన కుమారుడైన మూడో మాదానీడును పంపి ఓడించాడు. ఇతడు విజయనగర సైన్యాధ్యక్షుడైన గుండదండాధీశుడిని సంహరించి ఓరుగల్లును ఆక్రమించాడని వెలుగోటి వంశావళి తెలుపుతోంది.  రెండో సింగభూపాలుడికి ఆరుగురు కుమారులు. వారిలో పెద్దవాడైన రెండో అనపోతానాయకుడు (1400-1420), సింగభూపాలుడి అనంతరం రాజ్యానికి వచ్చాడు. అధికారం చేపట్టగానే మెదక్ దుర్గాన్ని ఆక్రమించిన విజయనగర సైన్యాలను తరిమేశాడు.
 
విజయనగర రాజులతో మైత్రి
రెండో హరిహరరాయల మరణానంతరం వారసుల మధ్య విభేదాలు తలెత్తాయి. కొండవీటి రెడ్డి రాజ్యంలో కుమారగిరి రెడ్డి పెద కోమటి వేమారెడ్డి మధ్య వైరం మొదలైంది. ఇదే అదనుగా భావించిన అనపోతానాయుడు విజయనగర రాజ్యంపై దండెత్తి చెన్నపట్నం వరకు ఉన్న భూభాగాలను ఆక్రమించాడు. కొండవీటి రెడ్ల ఆధీనంలోని వాడపల్లి, చిలుకూరు, వేదాద్రులను జయించాడు. దీంతో కొండవీటి రాజులు, బహమనీ ఫిరోజ్ షాలు ఒక్కటయ్యారు. దీంతో అనపోతానాయకుడు విజయనగర రాజులతో మైత్రి చేసి, వారి సాయంతో పానగల్లు (మహబూబ్‌నగర్) మీద దాడిచేసిన ఫిరోజ్‌షా సైన్యాలను ఓడించి తమ పూర్వరాజ్య భాగమైన పానగల్లును వశపరచుకున్నాడు.
 ఇదే సమయంలో కొండవీటి రాజు పెద కోమటి వేమారెడ్డి దేవరకొండ రాజ్యంపై దండెత్తి పినవేదగిరిని సంహరించాడు. దీంతో అనపోతానాయుడు విజయనగర రాజుల సహాయంతో కొండవీడును ముట్టడించి వేమారెడ్డిని సంహరించాడు. కొండవీడు రాజ్యాన్ని పద్మనాయకులు, విజయనగరాధీశులు, గజపతులు ఆక్రమించారు (మిగిలిన కొద్ది భాగాన్ని పాలించిన రాచవేమారెడ్డితో కొండవీటి రాజ్యం అంతరించింది.) పద్మనాయకుల ప్రతిష్ఠను ఇనుమడింపజేసిన గొప్ప పరాక్రమవంతుడు అనపోతానాయుడు. ఇతడు విజయనగర రాజులతో మైత్రి చేసినందువల్ల బహమనీయులు శత్రుభావం పెంచుకున్నారు. అందువల్ల పద్మనాయక రాజ్యానికి ముప్పు తలెత్తింది.
 రెండో అనపోతానాయుడి తర్వాత అతడి  కుమారులు చిన్న వారు కావడం వల్ల అతడి  చిన్నతమ్ముడు రావు మాదానాయుడు రాజయ్యాడు. దేవరకొండ రాజ్యంలో అంతకు ముందే పెదవేదగిరి మూడో మనవడూ, మూడో మాదానీ చిన్న కుమారుడూ అయిన లింగమనీడు రాజ్యానికొచ్చాడు. బహమనీ ఫిరోజ్‌షా కుమారుడు అహ్మద్‌షా పానగల్లు యుద్ధంలో జరిగిన అవమానానికి ప్రతీకారంగా విజయనగరంపై దండెత్తాడు. విజయనగర రాజులతో మైత్రి ఉండటం వల్ల మాదానీడు, లింగమనీడు విజయనగరం పక్షాన యుద్ధం చేశారు. ఇరు సైన్యాల ధాటికి తట్టుకోలేక అహ్మద్‌షా లొంగిపోయి 1422లో  విజయనగరంతో సంధి చేసుకున్నాడు.
 ఈ యుద్ధంలో మాదానీడు విజయనగర పక్షం వహించడం వల్ల బహనీయులు (అహ్మద్ షా) పద్మనాయకులపై పగ పెంచుకున్నారు. తమ ఇరువురి మధ్య జరిగిన సంధి వల్ల విజయనగర రాజులు పద్మనాయకులకు దూరమయ్యారు. దీంతో పద్మనాయకుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఇదే అదనుగా అహ్మద్‌షా ఓరుగల్లు మీద దాడి చేశాడు. మూడో సింగభూపాలుడు తన పినతండ్రి రావు మాదానీడు, లింగమనేనిల సహాయంతో అజిమ్‌ఖాన్‌లాంటి సర్దారులను ఓడించి 1425లో ఓరుగల్లును స్వాధీనం చేసుకున్నాడు. రెండో అనపోతానేని కుమారుడైన సింగభూపాలుడు సింహాసనాన్ని అధిష్టించాడు. సింగమనాయకుడు పదేళ్లపాటు ఏ ఇబ్బంది లేకుండా రాజ్యాన్ని పాలించాడు. ఇతడు  పోతనను, శ్రీనాథుడిని ఆదరించి కవి పండిత పోషకుడిగా పేరొందాడు. 
 
బహమనీల దాడి
మాళవ, గుజరాత్ దేశాలతో పోరాడుతున్న అహ్మద్‌షా వారితో సంధి చేసుకొని తిరిగి ఓరుగల్లుపై దండెత్తాడు. కళాపోషకుడైన సింగమనాయకుడు సహజంగానే యుద్ధ విముఖుడు కాబట్టి అహ్మద్‌షాను ఎదుర్కొనకుండానే సంధి చేసుకొని భువనగిరిని వదులుకున్నాడు. పైకి సంధికి అంగీకరించిన అహ్మద్‌షా భువనగిరిలో సంజర్‌ఖాన్‌ను నియమించి వెళ్లాడు. కానీ తెలంగాణ మొత్తాన్నీ జయించమని సంజర్‌ఖాన్‌ను ఆదేశించాడు. సంజర్‌ఖాన్ 1436లో ఓరుగల్లును ఆక్రమించాడు. దేవరకొండ మినహా తెలంగాణ అంతా బహమనీయుల వశమైంది. బహమనీ రాకుమారుడు దాసూర్‌ఖాన్ రాచకొండ ప్రతినిధి అయ్యాడు. ఆ తర్వాత సింగమనాయకుడి చరిత్ర, పద్మనాయక చరిత్ర లింగమనీడు చరిత్రతో కలిసిపోయింది. 1420లో దేవరకొండ శాఖలో రాజ్యానికొచ్చిన లింగమనీడు పద్మనాయక రాజుల్లో మరో గొప్ప పరాక్రమవంతుడు లింగమనీడు ఏకధాటిగా 32 దుర్గాలను జయించడం అందుకు నిదర్శనం. ఇతడు సింగమనాయకుడితో కలిసి అహ్మద్‌షా ఆక్రమించిన ఓరుగల్లును 1425లో జయించాడు. తర్వాత 1428 నాటికి తూర్పు దండయాత్రల్లో అల్లయ వేమారెడ్డిని, వీరభద్రారెడ్డిని ఓడించి రాజమండ్రి, సింహాచలాన్ని జయించాడు.
 తర్వాత వేములకొండ, మామిడాల, సప్తమాడియాలు, ఆవంచ, గంగవరాలను ఆక్రమించాడు. ఈ సమయంలోనే కళింగ గంగరాజైన నాలుగో భానుదేవుణ్ణి తొలగించి కపిలేశ్వర గజపతి కళింగ సింహాసనాన్ని అధిష్టించాడు. అధికారంలోకి రాగానే రెడ్డి రాజ్యభాగాల్లో ప్రవేశించాడు. ఈ ఆక్రమణను, లింగమనీడు విజృంభణనూ సహించని విజయనగర దేవరాయలు తెలుంగ రాయలను సింహాచలంపైకి పంపాడు. దీంతో గజపతులు, లింగమనీడు వెనక్కి మరలాల్సి వచ్చింది. ఈ పరిస్థితి వీరిద్దరూ చేయికలపడానికి దారితీసింది. అలా కపిలేశ్వర గజపతి సహాయంతో లింగమనీడు మెదట కొండవీడు ప్రాంతాలను జయించాడు. శ్రీశైలాన్ని ఆక్రమించాడు.

భాష-సాహిత్యం
దేవగిరి యాదవులు, కాకతీయులపై ఢిల్లీ సుల్తాన్ల దండయాత్ర సమయంలో ఉర్దూ భాష దక్కన్ ప్రాంతంలో ప్రవేశించింది. ఉర్దూ భాష ఈ ప్రాంతంలో దక్కనీ ఉర్దూగా మారింది. తెలంగాణ భాషా సాహిత్యాలపై తనదైన ముద్ర వేసింది. పద్మనాయకుల రాజ్యంలో సంస్కృతంతోపాటు, తెలుగు భాషా సాహిత్యాలు ఆదరణ పొందాయి. సర్వజ్ఞ సింగభూపాలుడు రచించిన సారంగధరచరిత్రను తొలి యక్షగానంగా భావించవచ్చు. ఇతణ్నే ఒకటో సింగ భూపాలుడిగా పిలుస్తారు. అతడి కుమారుడైన అనపోతానాయకుడు రాచకొండ రాజ్యాన్ని విస్తరించాడు. అన పోతానాయకుడు కవి పండిత పోషకుడు. ఇతడు ‘అభిరామ రాఘవమ’నే నాటకాన్ని రాశాడు.
 విశ్వేశ్వరుడు చమత్కార చంద్రిక అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. దీన్ని సంస్కృత లక్షణ గ్రంథాలైన ధ్వన్యాలోకం, కావ్య ప్రకాశంతో పోల్చవచ్చు. ప్రతాపరుద్ర యశోభూషణం తరహాలోనే ఈ గ్రంథంలోని శ్లోకాలు కూడా సింగ భూపాలుడి ప్రశంసతో ఉన్నాయి. ఈ గ్రంథం నాటి చారిత్రక విషయాలను తెలుపుతోంది. వీరభద్ర విజృంభణం(డిమం), కరుణాకందళం(అంకం) ఇతడి ఇతర రచనలు. విశ్వేశ్వరుడు.. అనపోతానాయకుడి, రెండో సింగ భూపాలుడి ఆస్థానాల్లోనూ స్థానం పొందాడు. అనపోతనాయకుడి మరో ఆస్థానకవి పశుపతి నాగనాథ కవి. ఇతడు విశ్వేశ్వరుడి శిష్యుడు. ఇతడు మదన విలాసం(సంస్కృతం), విష్ణుపురాణం అనే గ్రంథాలను రచించాడు. మదన విలాసంలో పద్మనాయకుల చరిత్ర విశేషాలు కనిపిస్తాయి. ధర్మపురికి చెందిన  గొప్ప పండితుడు నరసింహసూరి. ఇతడు విద్యారణ్య స్వామి సమకాలికుడు. ఇతడు ప్రయోగపారిజాతం అనే స్మృతి గ్రంథాన్ని రచించాడు.
 అనపోతానాయకుడి కుమారుడైన రెండో సింగ భూపాలుడు బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి.  ఇతడికి సంగీతం, నాటకం, నాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది. విశ్వేశ్వరుడు, నాగనాథుడు, బొమ్మకంటి అప్పయాచార్యుడు, శాకల్య మల్ల భట్టు తదితర కవి పండితులను పోషించాడు.  రెండో సింగభూపాలుడు రసార్ణవ సుధాకరమనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. ఇతడి మరో ప్రసిద్ధ గ్రంథం సంగీత సుధాకరం. కందర్ప సంభవం అనే డిమం (నాటక భేదం)ను, కువలయావళి అనే నాటికను ఇతడు రచించాడు.
 రాచకొండకు చెందిన మరో కవి మాధవ భూపాలుడు(రావుమాదానీడు).  ఇతడు రామాయణానికి రాఘవీయ వ్యాఖ్య రాశాడు. ఇతడే 1376లో శ్రీశైల ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర బృహత్ శిలా మండపం కట్టించాడు. మాయిభట్టు దీనికి శాసనం రాశాడు. ఈ శాసన కావ్యంలో 28 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో మాధవ నాయకుడి శౌర్య పరాక్రమాలను  వర్ణించారు. మాధవ భూపాలుడి భార్య నాగాంబిక. ఈమె ఒక తటాకాన్ని నిర్మించింది. దాని కోసం 1429లో నాగారం శాసనాన్ని వేయించింది. ఈ శాసన రచయిత శంభునాథ కవి.
పద్మనాయకులతో సంబంధం లేకపోయినా ఈ యుగానికి చెందినవాడు కందనామాత్యుడు. ఇతడు సబ్బినాడు(కరీంనగర్, వరంగల్) పాలకుడైన ముప్ప భూపాలుడి మంత్రి. పద్మపురాణం, భాగవత దశమ స్కంధాలను  మడికి సింగన, కందనామాత్యుడికి అంకితమిచ్చాడు. కందనామ్యాతుడు రచించిన నీతితారావళి ద్వారా ఆ కాలం నాటి వ్యక్తుల ప్రవర్తనను తెలుసుకోవచ్చు. మడికి సింగన రచించిన ‘సకలనీతి సమ్మతం’ తెలుగులో తొలి సంకలన గ్రంథం. కాలగర్భంలో కలిసిపోయిన చాలామంది కవులపేర్లు ఈ గ్రంథం ద్వారా తెలుస్తున్నాయి. 21 గ్రంథాల నుంచి లోక, రాజనీతులను సంపుటీకరించిన గ్రంథమిది. ఇతడు పద్మపురాణోత్తర ఖండం, భాగవత దశమ స్కంధం, జ్ఞానవాసిష్ట రామాయణం తదితర రచనలు చేశాడు.
 
తొలి కవయిత్రి గంగాదేవి
ఈ యుగానికి చెందిన తొలి కవయిత్రి గంగాదేవి. కాకతీయుల ఆడపడచు అయిన గంగాదేవి విజయనగర రాజైన బుక్కరాయల కోడలు. కంపరాయల భార్య. ఈమె సంస్కృతంలో ‘మధురావిజయ’మనే కావ్యాన్ని రచించింది. నాగేంద్రకవి తొలి శతకాల్లో ఒకటిగా పేర్కొనదగిన రమాధీశ్వర శతకాన్ని రచించాడు. ఇతడు భువనగిరికి చెందినవాడు. కవి భల్లటుడు గణమంజరి, పదమంజరి, శూద్రక రాజ చరిత్ర, భేతాళ పంచవింశతి, విక్రమార్క చరిత్ర (తెలుగు) అనే కావ్యాలను రాశాడు.
 పోతన కొంత కాలం మూడో సింగభూపాలుడి ఆస్థానంలో ఉన్నాడు. పోతనను ఒంటిమిట్ట నుంచి ఓరుగల్లు తీసుకురావడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. దేశీఛందస్సును పాల్కురికి ప్రవేశపెట్టాడు. పోతన దీన్ని స్వీకరించలేదు. కానీ దేశీ కవిత్వంలోని సరళత్వం ఇతడి కవిత్వంలో కనిపిస్తుంది. పోతన భోగీనీ దండకంలో నాటి రాజుల భోగలాలసత్వాన్ని వర్ణించాడు. ఇతడు రాజాశ్రయాన్ని తిరస్కరించి ప్రత్యామ్నాయ సంస్కృతికి పట్టం కట్టాడు. మూడో సర్వజ్ఞ సింగభూపాలుడు స్వయంగా గొప్ప పండితుడు. వెలుగోటి వంశావళిలో పేర్కొన్న శ్రీనాథుడి పద్యం ద్వారా ఈ విషయం తెలుస్తోంది. మల్లినాథసూరి మెదక్ జిల్లా కొలిచెలిమకు చెందినవాడు. ఇతడు రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం, కిరాతార్జునీయం, శిశుపాలవధకు వ్యాఖ్యానాలు రాశాడు. మల్లినాథసూరి తమ్ముడైన పెద్దిభట్టు సంస్కృతంలో గొప్ప పండితుడు. పెద్దిభట్టు కుమారుడైన కొలిచెలిమ కుమారస్వామి సోమపీథి(సోమయాజి) కూడా గొప్ప వ్యాఖ్యాత. ఇతడు ప్రతాపరుద్రీయానికి రత్నాపణం అనే వ్యాఖ్యానం రాశాడు. రాచకొండకు చెందిన బొమ్మకంటి హరిహరుడు అనర్గరాఘవానికి వ్యాఖ్య రాశాడు.
 
నాథ సంప్రదాయం
రాచకొండ మంత్రుల వంశానికి చెందిన గౌరన ఈ యుగానికి చెందిన మరో గొప్పకవి. పాల్కురికి ‘ద్విపద’ను స్వీకరించి హరిశ్చంద్రోపాఖ్యానం, నవనాథ చరిత్రలను రచించాడు.  ఇతడు తెలుగు సాహిత్యంలో తొలిసారిగా నాథ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. అది తెలంగాణ, రాయలసీమల్లో విశేష ప్రాచుర్యం పొందింది. నాథ సంప్రదాయం విగ్రహారాధన, కులతత్త్వాన్ని నిరసించింది. దేవరకొండకు చెందిన సూరన తొలి కల్పిత కావ్యమైన ధనాభిరామాన్ని రచించాడు. గౌరన కుమారుడైన భైరవకవి తెలంగాణలో బంధకవిత్వ ప్రక్రియకు ఆద్యుడు. ఇతడు శ్రీ రంగమహాత్మ్యం, రత్నపరీక్ష, కవి గజాంకుశం (ఛందోగ్రంథం)ను రచించాడు.
 అనంతామాత్యుడు భోజరాజీయ కావ్యం, ఛందోదర్పణం, రసాభరణం అనే గ్రంథాలను రచించాడు. ఏర్చూరి సింగన భాగవత షష్ఠమస్కంధాన్ని రాశాడు. ఇతడు నల్లగొండ జిల్లాలోని ఏరూర్చుకు చెందినవాడు. ఇతడి మరో రచన కువలయాశ్వ చరిత్ర. బొప్పరాజు గంగన  పంచమస్కంధను రచించాడు.
రేచర్ల రెడ్డి వంశస్థుల రాజధాని పిల్లలమర్రి. ఇది పిన వీరభద్రుడి జన్మస్థలం. ‘వాణి నా రాణి’ అని సగర్వంగా చెప్పుకున్న మహాకవి పిల్లలమర్రి పినవీరభద్రుడు. ఇతడు అవతారదర్పణం, నారదీయ పురాణం, మాఘమహాత్మ్యం, మానసోల్లాససారం, శృంగార శాకుంతలం, జైమినీ భారతం  అనే గ్రంథాలను రచించాడు. ప్రబంధాల్లో కనిపించే అనేక వర్ణనలకు, పద్యాల ఎత్తుగడలకూ ఒరవడి సృష్టించిన మార్గదర్శి పినవీరభద్రుడు.
కొలని గణపతి దేవుడు శివయోగసారం, మనోబోధ రచించాడు. కాకతీయ సామ్రాజ్య చరిత్రలో కొన్ని ఘట్టాలకు శివయోగసారం ఆధారం. భాగవతంలోని షష్ట, ఏకాదశ, ద్వాదశ స్కంధాలను పోతన అనువదించలేదు. వీటిని హరిభట్టు అనువదించాడు. రతి రహస్యం, వరాహపురాణం, మత్స్యపురాణం, నారసింహపురాణం ఇతడి ఇతర రచనలు. త్రిలోకభేది సకల ధర్మసారం రాశాడు. ఇతడు గౌరన మనవడు.
రాజుల మొప్పు కోసం కవులు.. అవధానం, సమస్య పూరణం, గర్భ, గోప్య, బంధ, అక్షరచ్యుత, మాత్రాచ్యుత, ఏక, ద్విసంధాదారణ ప్రక్రియలను అనుసరించడం ఈ కాలం నుంచే మొదలైంది.
 
ఏకామ్రనాథుడు
కాకతీయ రాజుల చరిత్ర, వంశావళి, వారి పూర్వీకుల క్రమాభివృద్ధి తదితరాలను తెలిపేందుకు ఏకామ్రనాథుడు ప్రయత్నించాడు. ఇతడు తొలి తెలుగు చరిత్రకారుడు. ఓరుగల్లుకు చెందిన ఇతడు ప్రతాపరుద్ర చరిత్రం, ద్వాత్రింశత్సాలభంజికల కథలు అనే గ్రంథాలను రచించాడని తెలుస్తోంది. ప్రతాపరుద్ర చరిత్రం తెలుగులో తొలి వచన రచన. తొలి చారిత్రక గ్రంథం. కాకతీయుల వివరాలతో పాటు నాటి మతాలు, మత వైషమ్యాలు, సంప్రదాయాలు, సాంఘిక ఆచారాలు, సంప్రదాయాలను ఇందులో పేర్కొన్నారు. ప్రతాపరుద్రుడి దినచర్య, వ్యక్తిత్వాన్ని గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. ఓరుగల్లు సమీపంలోని వివిధ వర్ణాల, వృత్తుల వారి సంఖ్య తదితర విషయాలను ఈ గ్రంథం తెలుపుతోంది. ప్రతాపరుద్ర చరిత్రం ఆనాటి సాంఘిక చరిత్ర.
 
కొరవి గోపరాజు
పాల్కురికి రచనల తర్వాత తెలంగాణ సాంఘిక జీవితాన్ని విస్తృతంగా వర్ణించిన కావ్యం ‘సింహాసన ద్వాత్రింశిక’. దీని రచయిత కొరవి గోపరాజు. ఇతడు నిజామాబాద్ జిల్లా వేముగల్లు (భీమగల్లు)కు చెందినవాడు. ఇతడి పూర్వీకులు రాచకొండలో మంత్రులుగా పనిచేశారు. సింహాసన ద్వాత్రింశికకు విక్రమార్క చరిత్ర అనే సంస్కృత కావ్యం మూలం. కానీ గోపరాజు అనేక కల్పనలు చేసి దీన్ని స్వతంత్ర కావ్యంగా రూపొందించాడు. అందుకే ఈ గ్రంథంలో నాటి సాంఘిక జీవితాన్ని చిత్రించడం సాధ్యమైంది. గోపరాజు సింహాసన ద్వాత్రింశికలో పేద, ధనిక తారతమ్యాలను చక్కగా వర్ణించాడు. మనసు లోతుల్ని విశ్లేషించిన తొలి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తగా ఫ్రాయిడ్‌ను పేర్కొంటారు. కానీ శతాబ్దాల ముందే కొరవి గోపరాజు మనసు లోతుల్ని, కలల్ని విశ్లేషించాడు. సింహాసన ద్వాత్రింశిక తెలంగాణ గొప్ప కావ్యాల్లో ఒకటిగా నిలిచిపోయింది.
పిడుపర్తి కవులు పాల్కురికి మార్గంలో శైవ సాహిత్యాన్ని విరివిగా రాశారు. ఓరుగల్లుకు చెందిన పిడుపర్తి ఒకటో బసవకవి పిల్లనైనారుకథ, బ్రహ్మాత్తర ఖండంతోపాటు గురుదీక్షాబోధను రచించాడు. ఇతడి పెద తండ్రి కుమారుడైన పిడుపర్తి నిమ్మనాథుడు ‘నిజ లింగ చిక్కయ్య కథ’ అనే యక్షగానాన్ని రచించాడు.  రెండో సోమనాథుడు పాల్కురికి సోమనాథుడి పండితారాధ్య చరిత్రను పద్య ప్రబంధంగా రచించాడు. ఇతడు ఒకటో బసవకవి కుమారుడు. ఇతడే ‘ప్రభులింగలీలలు’ అనే ద్విపద కావ్యాన్ని కూడా రచించాడు.  పిడుపర్తి రెండో బసవ కవి దీన్నే పద్యకావ్యంగా కూర్చాడు. ఇతడు ఒకటో బసవకవి మనవడు. 
 
మత పరిస్థితులు
ఈ యుగంలో శైవమత ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. వైష్ణవ మతం కూడా ప్రాచుర్యం పొందింది. ఈ రెండు మతాల మధ్య వివాదాలు తలెత్తేవి. పద్మనాయకుల ఆస్థానంలోని శాకల్య భట్టు, పరాశర భట్టు మధ్య జరిగిన వివాదమే అందుకు నిదర్శనం. పద్మనాయకులు తాము శివ దేవతాపారాయణులమని చెప్పుకున్నారు. ఒకటో అనపోతానాయకుడు శైవమతాభిమాని. ఆయన ఉమామహేశ్వరం వద్ద శ్రీశైల ఉత్తర ద్వార మండపాన్ని నిర్మించాడు. అనేక శివాలయాలు, శ్రీ పర్వత శిఖరానికి సోపానాలు నిర్మించాడు. తొలి పద్మనాయకులు  శైవమతాన్ని ఆదరించారు. కానీ రెండో సింగభూపాలుడి కాలం నుంచి వైష్ణవ మత ప్రాధాన్యం పెరిగింది. రెండో అనపోతానాయకుడు రామాలయం నిర్మించాడు. రావు మాదానీడు రాఘవీయ వ్యాఖ్య రాశాడు, శ్రీ రంగనాథుడికి దానాలిచ్చాడు. మూడో సింగ భూపాలుడు  బెల్లంకొండ, తిరుపతి శాసనాలు వేయించాడు. వసంత నాయకుడు కంజీవర శాసనాన్ని, ధర్మానాయకుడు శాయంపేట శాసనాన్ని వేయించాడు. ఇవన్నీ వైష్ణవ మత ఉన్నతిని సూచిస్తున్నాయి.
వేదాంత దేశికులు వైష్ణవ మత వ్యాప్తికి తోడ్పడ్డారు. వీరు సుభాషిత నీతి, తత్త్వ సందేశ, రహస్య సందేశ గ్రంథాలను రచించారు. వైష్ణవం వడగల్, తెంగల్ అనే శాఖలుగా చీలిపోయింది. వేదాంత దేశికులు వడగల్ శాఖను ప్రచారం చేశారు.  ఈ శాఖకు చెందిన వారు వైదిక ఆచార వ్యవహారాలను పాటించేవారు. ఈ శాఖ తెలంగాణ అంతటా వ్యాపించింది. మత ప్రచారం కోసం మఠాలను నిర్మించేవారు. వైదిక, పురాణ దేవతలతోపాటు కట్టమైసమ్మ, రేణుక, ముత్యాలమ్మ, మైసమ్మ, మారెమ్మ, ఏకవీర దేవతలకు కూడా ఆలయాలు నిర్మించేవారు. యక్షగానాలు, భాగోతుల ప్రాచుర్యం కూడా వైష్ణవ మత వ్యాప్తిని సూచిస్తున్నాయి. బహమనీ సుల్తాన్‌లు మత అసహనాన్ని ప్రదర్శించారు. హుమాయూన్ జలీం షా పిల్లలమర్రి దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. బహమనీ సుల్తాన్ల చర్యలకు మత కారణాలే కాక రాజకీయ, ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి. వీరి దాడుల నుంచి ప్రాణాలను రక్షించుకోవడానికి లక్షలాది మంది ప్రజలు ఇస్లాం మతాన్ని స్వీకరించారు. దీన్నిబట్టి తెలుగు ప్రజల ఇస్లామీకరణ ఈ కాలం నుంచే మొదలైందని తెలుస్తోంది.
 
వాస్తు, శిల్పకళ
పద్మనాయకులు కాకతీయుల శిల్పకళను అనుసరించారు. వీరి నిర్మాణాల్లో రాచకొండ, దేవరకొండ దుర్గాలు ప్రముఖమైనవి.
Published date : 06 Nov 2015 02:56PM

Photo Stories