Skip to main content

ప్రాథమిక హక్కులు - ముఖ్య వివాదాలు

ప్రాథమిక హక్కులకు సంబంధించిను ముఖ్య వివాదాలపై సుప్రీంకోర్టు అనేక తీర్పులను వెలువరించింది. వాటిలో నూతన అర్థాలు, భాష్యాలు, సూత్రాలను వివరించింది. వాటిలో ముఖ్యమైనవి..

ఎ.కె. గోపాలన్ V/s మద్రాస్ స్టేట్ (1950): 1950లో చేసిన నివారక నిర్బంధ చట్టం (ప్రివెన్షివ్ డిటెన్షన్ యాక్ట్)లోని సెక్షన్ 4 న్యాయ సమీక్షాధికారానికి విరుద్ధంగా ఉన్నందున అది చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ చట్టం కింద ముందస్తు అరెస్టు సమంజసమేనని పేర్కొంది.

శంకరి ప్రసాద్ V/s యూనియన్ ఆఫ్ ఇండియా (1951): మొట్టమొదటి రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాన్ని ఈ వివాదంలో సుప్రీంకోర్టు పరిశీలించింది. ఈ సవరణ రాజ్యాంగబద్ధమేనని తీర్పు చెప్పింది. ఈ కేసులోనే సుప్రీంకోర్టు మొదటిసారిగా న్యాయ సమీక్షాధికారాన్ని వినియోగించింది.

బేలా బెనర్జీ V/s పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం (1953): ప్రజల ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు మార్కెట్ విలువతో కూడిన నష్టపరిహారాన్ని చెల్లించాలని తీర్పు చెప్పింది.

సజ్జన్ సింగ్ V/s రాజస్థాన్ (1964): ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణ అధికారానికి సంబంధించిన వివాదాన్ని పరిశీలించింది. ఆస్తి హక్కుకు సంబంధించి చేసిన 17వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్ధమేనని ప్రకటించింది.

గోలక్‌నాథ్ V/s పంజాబ్ ప్రభుత్వం (1967): పంజాబ్ ప్రభుత్వం రూపొందించిన భూ సంస్కరణల చట్టాన్ని ఈ కేసులో సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని కోర్టు తీర్పు చెప్పింది. ప్రాథమిక హక్కులను సవరించాలంటే ‘ప్రత్యేక రాజ్యాంగ పరిషత్’ ఏర్పాటు చేయాలని ప్రకటించింది.

కేశవానంద భారతి V/s కేరళ ప్రభుత్వం (1973): ప్రాథమిక హక్కులను సవరించడానికి ఉద్దేశించిన 24, 25వ రాజ్యాంగ సవరణలను సుప్రీంకోర్టులో ప్రశ్నించారు. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని, అయితే మౌలిక స్వరూపం మార్చకూడదని గోలక్‌నాథ్ కేసులో చెప్పిన తీర్పుకు విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మౌలిక స్వరూపం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఈ సందర్భంలోనే ప్రయోగించింది.

మినర్వా మిల్స్ V/s యూనియన్ ఆఫ్ ఇండియా (1980): 42వ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టులో ప్రశ్నించారు. ప్రాథమిక హక్కులు రాజ్యాంగ స్వరూపంలో భాగమని, వాటిని తగ్గించడం లేదా రద్దుచేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని నిర్వచించింది.

ఇందిరా సాహ్ని V/s యూనియన్ ఆఫ్ ఇండియా (1992): వెనుకబడిన తరగతులకు 27% రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని ఈ కేసులో ప్రశ్నించారు.

ఉన్నికృష్ణన్ V/s ఆంధ్రప్రదేశ్ (1993), మోహిని జైన్ V/s కర్ణాటక: ప్రాథమిక హక్కుల్లో విద్యాహక్కు లేకపోతే జీవించే హక్కుకు, వ్యక్తి గౌరవానికి అర్థం లేదని, ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

మాదిరి ప్రశ్నలు

1. ప్రాథమిక హక్కులు అనేవి?
1) నిరపేక్షమైనవి
2) ప్రభుత్వ అధికారాలపై పరిమితులు
3) సవరణకు అతీతం
4) న్యాయ సమీక్షకు గురికావు

Published date : 06 Feb 2017 12:20PM

Photo Stories