Skip to main content

లోక్‌సభ, రాజ్యసభ నిర్మాణం

లోక్‌సభ సభ్యుడిగా పోటీ చేయడానికి అర్హతలు
 • భారతీయ పౌరసత్వం ఉండాలి.
 • 25 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండకూడదు.
 • ఆదాయం వచ్చే ప్రభుత్వ పదవిలో ఉండకూడదు.
 • నేరారోపణ రుజువై ఉండకూడదు.
 • దివాళా తీసి ఉండకూడదు.
 • శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి.
 • దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.

షరతులు
 • పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రంతో పాటు రూ.25,000 ధరావతు చెల్లించాలి. (ఎస్సీ, ఎస్టీలకు రూ.12,500).
 • అభ్యర్థి తన ఆస్తులు, అప్పులు, ఇతర వివరాలను తప్పనిసరిగా అఫిడవిట్ రూపంలో తెలియజేయాలి.

పదవీ కాలం
ప్రకరణ 83(2) ప్రకారం లోక్‌సభ సాధారణ కాల వ్యవధి 5 ఏళ్లు. జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు ఏడాది వరకు పొడిగించొచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి రద్దయిన తర్వాత ఆరు నెలల కంటే ఎక్కువ కాలం పొడిగించడానికి వీల్లేదు. అలాగే రాజకీయ అనిశ్చితి నెలకొన్నప్పుడు ప్రకరణ 85 ప్రకారం 5 ఏళ్ల కంటే ముందే లోక్‌సభను రద్దు చేయొచ్చు.
ప్రత్యేక వివరణ:
1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభ పదవీ కాలాన్ని ఆరేళ్లకు పొడిగించారు. అయితే 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని తిరిగి ఐదేళ్లకు పునరుద్ధరించారు.

రాజ్యసభ-నిర్మాణం-ఎన్నిక
దేశంలో మొదట కేంద్ర ఎగువసభను 1919లో ఏర్పాటు చేశారు. ఇది 1921 నుంచి అమల్లోకొచ్చింది. 1954, ఆగస్టు 23న ఎగువసభకు రాజ్యసభగా నామకరణం చేశారు. అప్పటి రాజ్యసభ అధ్యక్షులు సర్వేపల్లి రాధాకృష్టన్.

రాజ్యసభ నిర్మాణం గురించి ప్రకరణ 80 తెలియజేస్తుంది. రాజ్యసభలో గరిష్టంగా 250 మంది సభ్యులుంటారు. వీరిలో 238 మంది నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో రాష్ర్ట విధాన సభకు ఎన్నికైన శాసన సభ్యుల ద్వారా పరోక్షంగా ఎన్నికవుతారు. కళలు, సాహిత్యం, సంఘసేవ, శాస్త్ర, సాంకేతికం తదితర రంగాల్లో నిష్ణాతులైన 12 మందిని రాష్ర్టపతి నామినేట్ చేస్తారు.

- ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులున్నారు. వీరిలో 229 మంది రాష్ట్రాల నుంచి, నలుగురు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికవుతారు. ఆయా రాష్ట్రాల జనాభా మేరకు రాజ్యసభ సభ్యుల సంఖ్యను నిర్ణయిస్తారు.

రాజ్యసభలో అత్యధిక స్థానాలున్న రాష్ట్రాలు

రాష్ర్టం

సభ్యులు

1. ఉత్తరప్రదేశ్

31

2. మహారాష్ర్ట

19

3. తమిళనాడు

18

4. పశ్చిమ బెంగాల్

16

5. బిహార్

16

6. కర్ణాటక

12

7. ఆంధ్రప్రదేశ్

11

8. మధ్యప్రదేశ్

11

9. గుజరాత్

11


రాజ్యసభలో ఒకే సభ్యుడున్న రాష్ట్రాలు
 • అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, గోవా, మేఘాలయ, సిక్కిం, త్రిపుర.
 • కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో కూడా రాజ్యసభ స్థానం ఒకటి. అలాగే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (డీఎల్)కి రాజ్యసభలో 3 స్థానాలున్నాయి.
 • రాజ్యసభలో తెలంగాణ, అసోం, పంజాబ్‌లకు 7 స్థానాలున్నాయి.
 • రాజ్యసభ సభ్యులు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. వీరి ఎన్నిక నియోజకవర్గాల ప్రాతిపదికన జరగదు. అందుకే రాజ్యసభను రాష్ట్రాల మండలి (Council of States) అంటారు.

రాజ్యసభ సభ్యుల అర్హతలు
 • భారత పౌరుడై ఉండాలి.
  • 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండకూడదు.
  • పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు కూడా ఉండాలి.
  • ఇతర షరతులు లోక్‌సభ సభ్యులతో సమానంగా ఉంటాయి.

ప్రత్యేక వివరణ
రాజ్యసభకు ఏ రాష్ర్టం నుంచి పోటీ చేస్తున్నారో ఆ రాష్ట్రంలో సాధారణ ఓటరై ఉండాలి అనే నిబంధన గతంలో ఉండేది. అయితే 2003లో ప్రజాప్రాతినిధ్య చట్టం- 1951ను సవరించి, దేశంలో ఎక్కడ ఓటరుగా నమోదై ఉన్నా పోటీ చేయొచ్చని చట్టం చేశారు. దీన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.

రాజ్యసభ కాల వ్యవధి
అమెరికా ఎగువసభ సెనెట్ తరహాలో రాజ్యసభ కూడా శాశ్వత సభ. లోక్‌సభ మాదిరిగా ఇది రద్దు కాదు. కానీ, సభ్యులు మాత్రం ఆరేళ్ల కాల వ్యవధికి ఎన్నికవుతారు. అయితే, ప్రతి రెండేళ్లకు 1/3 వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు. ఇలా నిరంతరంగా సభ కొనసాగుతుంది. అందుకే దీన్ని శాశ్వత సభ, నిరంతర సభ అని అంటారు.

పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారం (ప్రకరణ 99)
రాష్ర్టపతి లేదా వారి ద్వారా నియమితులైన అధికారి పార్లమెంటు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. దీని గురించి మూడో షెడ్యూల్‌లో ప్రస్తావించారు. పదవీ ప్రమాణ స్వీకారం చేయకుండా సభా కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అలా చేస్తే సభా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి రోజుకు రూ.500 అపరాధ రుసుము చెల్లించాలి.

పార్లమెంటు సభ్యుల రాజీనామా ప్రకరణ101(3)(బి)
పార్లమెంటు సభ్యులు నిర్ణీత విధానంలో తమ రాజీనామా పత్రాన్ని సమర్పించాలి. వీటిని సంబంధిత సభాధ్యక్షులను సంబోధిస్తూ పంపాలి. వారు స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు సభాధ్యక్షులు దాన్ని ధ్రువీకరించుకున్న తర్వాతే రాజీనామాను ఆమోదిస్తారు. ఈ అంశాన్ని 1974లో 33వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.

పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు (ప్రకరణ 106)
పార్లమెంటు సభ్యుల జీతభత్యాలను పార్లమెంటు తొలుత 1954లో, మళ్లీ 2010 ఆగస్టులో కొత్త చట్టం ద్వారా నిర్ణయించింది. 2010లో పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు కింది విధంగా ఉన్నాయి.
వేతనం (నెలకు): రూ.50,000
నియోజకవర్గ అలవెన్సు (నెలకు): రూ.45,000
దినసరి అలవెన్సు: రూ.2,000
ఇతర ఖర్చుల కోసం: రూ.45,000
మొత్తం: రూ.1,42,000

అలాగే వారికి ఉచిత నివాసం, రవాణా, వైద్యం తదితర సౌకర్యాలు కూడా ఉంటాయి. పదవీ కాలం ముగిసిన తర్వాత నెలకు రూ.20,000 పెన్షన్ ఉంటుంది.

పార్లమెంటు - సమావేశాలు
ప్రకరణ 85 ప్రకారం.. పార్లమెంటు ఏడాదికి కనీసం రెండుసార్లు సమావేశమవ్వాలి. అయితే, రెండు సమావేశాల మధ్య కాలం ఆరు నెలలకు మించకూడదు. అవసరమైనప్పుడు, ప్రత్యేక పరిస్థితుల్లో మరికొన్ని సమావేశాలు నిర్వహించొచ్చు. గరిష్ట సమావేశాలపై ఎలాంటి పరిమితి లేదు. ప్రస్తుతం పార్లమెంటు ఏడాదికి మూడుసార్లు సమావేశమవుతోంది. అవి..
 1. బడ్జెట్ సమావేశం: జనవరి - ఏప్రిల్
 2. వర్షాకాల సమావేశం: జూలై - ఆగస్టు
 3. శీతాకాల సమావేశం: నవంబర్-డిసెంబర్

ప్రతి సమావేశాన్ని నిర్దిష్టంగా ఇన్ని రోజులు నిర్వహించాలన్న నియమం లేదు. మూడు సమావేశాలు కలిపి సుమారు 90 నుంచి 110 రోజుల వరకు జరుగుతాయి.

పార్లమెంటు సభ్యుల అనర్హతలు
పార్లమెంటు సభ్యుల అనర్హతకు సంబంధించిన అంశాలను ప్రకరణ 102(1)లో పేర్కొన్నారు. కింది సందర్భాల్లో పార్లమెంటు సభ్యుల సభ్యత్వం రద్దవుతుంది.
లాభదాయక పదవుల్లో కొనసాగినప్పుడు
మానసిక స్థిమితం లేదని కోర్టు ధ్రువీకరించినప్పుడు
దివాళా తీసినప్పుడు
భారత పౌరసత్వాన్ని కోల్పోయినప్పుడు
ఎన్నికల్లో అక్రమాలు రుజువైనప్పుడు
ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్ణీత గడువులోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించనప్పుడు
పదవిని దుర్వినియోగపర్చినప్పుడు.
వరకట్నం, సతీ, అస్పృశ్యత చట్టాల కింద శిక్షకు గురైనప్పుడు
పార్టీ ఫిరాయించినా, పార్టీ విప్‌నకు వ్యతిరేకంగా ఓటు వేసినా, పార్టీకి రాజీనామా చేసినా, పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం సభ్యత్వం రద్దవుతుంది. (ప్రకరణ 102(2))
చివరి కారణం మినహా మిగిలిన అన్ని సందర్భాల్లో కేంద్ర ఎన్నికల సంఘం సలహా మేరకు రాష్ర్టపతి పార్లమెంటు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేస్తారు.

సభ్యుల అనర్హత - వివాదాలు (ప్రకరణ-103)
పార్లమెంటు సభ్యుల అనర్హతకు సంబంధించి తుది నిర్ణయం రాష్ర్టపతిదే. దీనికి సంబంధించి న్యాయస్థానాలు సాధారణంగా జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు.

సుప్రీంకోర్టు తీర్పులు:
2006లో జయాబచ్చన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు చెప్పింది. గౌరవ వేతనం కూడా లాభదాయక పదవి కిందకు వస్తుందని, వేతనం తీసుకోకపోయినా ఆ పదవిలో ఉండే అధికారం, హోదా, గుర్తింపును కూడా లాభంగానే పరిగణించాలని, అలాంటి సందర్భాల్లో వారిని అనర్హులుగా ప్రకటించవచ్చని పేర్కొంది.

గమనిక: లిల్లీ థామస్ Vs స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు.. రెండేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడినవారు వెంటనే అనర్హతకు గురవుతారని పేర్కొంది.
Published date : 06 Feb 2017 12:46PM

Photo Stories