Skip to main content

Successors in Achieving Goals: పేద కుటుంబాల్నించి వ‌చ్చి గొప్ప విజ‌యాన్ని సాధించారు ఈ యువ‌కులు

త‌మ ల‌క్ష్యాన్ని మ‌రువ‌లేదు. కుటుంబ బాధ్య‌త‌ల‌ను వీడ‌లేదు. అన్నింటినీ స‌మ‌కూర్చుకుంటూనే త‌మ ల‌క్ష్య ప్ర‌యాణాన్ని కొన‌సాగించి, త‌గిన విద్య‌ను పొంది, త‌మ గ‌మ్యాన్ని చేరిన వారే వీరంతా..
Civil SI achievement by students
Civil SI achievement by students

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎస్సై ఉద్యోగం సాధించాడు సుల్తానాబాద్‌ మండలం సాంబయ్యపల్లి గ్రామానికి చెందిన లంకదాసరి శ్రీకాంత్‌. తండ్రి కొండయ్య ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్‌ క్లర్క్‌గా, తల్లి అంగన్‌వాడీ హెల్పర్‌గా పనిచేస్తుంది. ప్రస్తుతం శ్రీకాంత్‌ ఉస్మానియా యూనివర్సిటీలో లా మూడో సంవత్సరం చదువుతూనే ఎస్సైకి ప్రిపేర్‌ అయి ఉద్యోగం సాధించాడు. ఇతడి అన్న హైకోర్టులో న్యాయవాది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ను గ్రామస్తులు అభినందించారు.

civil SI

పేదింటి పిల్లలు ఖాకీ కొలువులు సాధించారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో కాల్వశ్రీరాంపూర్‌ మండలం గంగారం గ్రామపంచాయతీ పరిధి ఊశన్నపల్లె గ్రామానికి చెందిన మేడిద సాయికృష్ణ ఎస్సైగా ఎంపికయ్యాడు. సాయికృష్ణ తండ్రి మధు అనారోగ్యంతో మృతిచెందగా, తల్లి సంగీత కొడుకుతోపాటు కూతురు అంజలిని పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులు చదివించింది. ఈసందర్భంగా సాయికృష్ణ మాట్లాడుతూ, అన్నీ తానై విద్యాబుద్ధులు నేర్పించిన తల్లికి రుణపడి ఉంటానని, శిక్షణ పూర్తిచేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. సాయికృష్ణను ఐడీసీ మాజీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, సర్పంచు కొనకటి మల్లారెడ్డి, ఎంపీటీసీ కదురు మానస, న్యాయవా దులు సరోత్తంరెడ్డి, సతీష్‌, మాజీ సర్పంచు సత్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీలు బాలె మల్లీశ్వరి, ఈద రాజమ్మ, గ్రామస్తులు అభినందించారు.

Civil SI

 

సత్తాచాటిన తాపీమేస్త్రీ కూతురు

manasa SI

పట్టుదల ఉంటే పేదరికాన్ని జయించి ఉద్యోగం సాధించవచ్చని నిరూపించింది మౌటం మానస. ఓదెల మండలం శానగొండ గ్రామానికి చెందిన మౌటం మానస ఎస్సై ఉద్యోగం సాధించింది. మౌటం సారయ్య, సారమ్మ తాపీమేస్త్రీ పనులు చేస్తూ చదివించారు. పదో తరగతి వరకు పొత్కపల్లి హైస్కూలు, ఇంటర్‌ ఓదెల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, డిగ్రీ జమ్మికుంట గాయిత్రి కళాశాల, బీఈడీ హన్మకొండలో పూర్తి చేసింది. ఈ సందర్భంగా మానస మాట్లాడుతూ, తన తల్లిదండ్రులకు, చదువునేర్పిన ఉపాధ్యాయులకు రుణపడి ఉంటానని, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తానని పేర్కొంది.

సివిల్‌ ఎస్‌ఐగా అమూల్య

Amulya

స్థానిక బాపూజీనగర్‌లో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన గైక్వాడ్‌ అమూల్య సివిల్‌ ఎస్‌ఐగా ఎంపికైంది. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో 235 మార్కులు సాధించింది. అమూల్య తల్లి సివిల్‌ఆసుపత్రిలోని శానిటేషన్‌ విభాగంలో కాంట్రాక్ట్‌ కార్మికురాలిగా, తండ్రి కూరగాయల మార్కెట్‌లో పనిచేస్తున్నారు. ఈసందర్భంగా అమూల్యను పలువురు అభినందించారు. బీటెక్‌ ఈఈఈ పూర్తి చేసిన తర్వాత ఎస్‌ఐ ఉద్యోగం కోసం కొద్ది రోజుల పాటు హైదరాబాద్‌లోని శిక్షణ పొందినట్లు అమూల్య తెలిపారు.

వ్యవసాయం చేస్తూనే ప్రిపరేషన్‌..

srinivas

మంథని మండలం కన్నాల గ్రామపంచాయతీ పరిధి వేంపాడు గ్రామానికి చెందిన అడువాల శ్రీనివాస్‌ అగ్నిమాపక విభాగంలో ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు అడువాల మధునమ్మ–రాజేశంతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్తూనే గ్రూప్స్‌కు ప్రిపేరయ్యాడు. ఈ క్రమంలోనే ఎస్‌ఐ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. మంచి ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలనే ఆకాంక్ష తనదని శ్రీనివాస్‌ తెలిపాడు.

Published date : 25 Sep 2023 01:11PM

Photo Stories