Skip to main content

యూకే, కెనడాల వైపు భారతీయుల చూపు..!

వర్క్‌ అబ్రాడ్‌.. స్టడీ అబ్రాడ్‌.. మన విద్యార్థుల్లో ఎక్కువ మంది లక్ష్యమిదే! విదేశాల్లో ఉన్నత విద్య, ఉద్యోగం అనగానే అందరికీ గుర్తొచ్చే దేశం అమెరికా. ఎందుకంటే.. ఒకసారి అక్కడ అడుగుపెడితే భవిష్యత్తు బంగారుమయం అనే ఆలోచన! కానీ.. ట్రంప్‌ ప్రభావంతో.. అమెరికాలో కొలువుకు వీలుకల్పించే హెచ్‌1బి వీసాలపై అనేక ఆంక్షలు.

హెచ్‌1బి వీసా అందుకోవాలంటే.. సవాలక్ష సమస్యలు! అందుకే ఇటీవల కాలంలో భారతీయుల గమ్యం మారుతోంది. అమెరికాకు బదులుగా మన వాళ్లు యూకే, కెనడావైపు చూస్తున్నారు! ఈ రెండు దేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న భారతీయులు పెరుగుతున్నట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.

ఆగస్ట్‌–2016 నుంచి జూలై 2018 మధ్య కాలంలో.. అమెరికాలో ఉద్యోగాన్వేషణ సాగిస్తున్న భారతీయులు పది శాతం తగ్గారు. అదే సమయంలో కెనడాలో కొలువుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్న భారత అభ్యర్థులు ఆరు నుంచి 13 శాతానికి పెరిగారు. బ్రెగ్జిట్‌ తర్వాత కాలంలో యూకేలో ఉద్యోగాల కోసం అన్వేషణ సాగిస్తున్న విదేశీయులు 8 శాతం నుంచి పది శాతానికి పెరిగారు. ఇందుకు ఇండీడ్‌ తాజా నివేదికే నిదర్శనం! ముఖ్యంగా భారతీయులు యూకే, కెనడాలవైపు మొగ్గు చూపడానికి ఆ రెండు దేశాల్లో ఇటీవల కాలంలో వర్క్‌ వీసా నిబంధనల్లో సడలింపులే కారణమంటున్నారు.

కెనడాలో ఉద్యోగాలు..వీసా విధానాలు :
కెనడాలో ఉద్యోగ ప్రయత్నాలు సాగిస్తున్న భారతీయ అభ్యర్థులు..
1. బిజినెస్‌ అనలిస్ట్‌
2. మెకానికల్‌ ఇంజనీర్‌
3. సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌
4. ప్రాజెక్ట్‌ మేనేజర్‌
5. వెబ్‌ డెవలపర్‌
6. డేటా సైంటిస్ట్‌
7. జావా డెవలపర్‌
8. సివిల్‌ ఇంజనీర్‌
9. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌
10. డేటా అనలిస్ట్‌ తదితర జాబ్‌ ప్రొఫైల్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ స్కీమ్‌ :
దేశీయంగా నిపుణుల కొరతను ఎదుర్కొంటున్న కెనడా.. ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ పేరుతో విదేశీ నిపుణులను నియమించుకునేందుకు వీసా నిబంధనలను సడలించింది. దరఖాస్తు చేసుకున్న ఆరు నెలల్లోపు ప్రక్రియను పూర్తిచేయడమే లక్ష్యంగా ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ స్కీమ్‌ను ప్రవేశ పెట్టింది. ఇదే ఇప్పుడు భారతీయులకు వరంగా మారిందని చెప్పొచ్చు. కెనడా ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ స్కీమ్‌లో.. స్పాన్సర్‌షిప్‌ లెటర్‌ లేకున్నా కూడా పర్మనెంట్‌ రెసిడెన్సీకి దరఖాస్తు చేసుకొని వీసా పొందొచ్చు. ఆ తర్వాత ఉద్యోగాన్వేషణ సాగించి.. అక్కడే కొలువుదీరొచ్చు.
ఈ స్కీమ్‌ను కెనడా ప్రభుత్వం.. ఫెడరల్‌ స్కిల్డ్‌ వర్కర్‌ ప్రోగ్రామ్, ఫెడరల్‌ స్కిల్‌ ట్రేడ్స్‌ ప్రోగ్రామ్, కెనడియన్‌ ఎక్స్‌ప్రెస్‌ క్లాస్‌.. అంటూ మూడు విభాగాలుగా వర్గీకరించింది.
ఫెడరల్‌ స్కిల్డ్‌ వర్కర్స్‌ ప్రోగ్రామ్‌: పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయి కోర్సులు పూర్తి చేసుకుని కెనడాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఉద్దేశించిన ప్రోగ్రామ్‌ ఇది. దీని ప్రకారం.. కెనడాలో లేదా ఇతర దేశాల్లో సంబంధిత విభాగంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌తోపాటు ఒక ఏడాది పని అనుభవం ఉన్న వారికి కెనడా కంపెనీల్లో పని చేసే అవకాశం లభిస్తే వీసా సులువుగా మంజూరు చేస్తారు.
ఫెడరల్‌ స్కిల్డ్‌ ట్రేడ్స్‌ ప్రోగ్రామ్‌: ఈ ప్రోగ్రామ్‌ ప్రకారం పలు వృత్తులకు సంబంధించిన నైపుణ్యాలు సొంతం చేసుకుని వాటికి సంబంధించి కెనడాలోని పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు వీసా మంజూరు చేస్తారు.
కెనడియన్‌ ఎక్స్‌పీరియన్స్‌ క్లాస్‌: ఇప్పటికే కెనడాలో నివసించి కనీసం ఏడాది పని అనుభవం గడించి స్వదేశాలకు తిరిగి వెళ్లిన వారిని ఆకర్షించే ప్రోగ్రామ్‌.. కెనడియన్‌ ఎక్స్‌పీరియన్స్‌ క్లాస్‌.

దరఖాస్తు కూడా సులువే..
కెనడా ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ స్కీమ్‌ ప్రకారం– అభ్యర్థులు పర్మనెంట్‌ రెసిడెన్సీకి దరఖాస్తు చేసుకోవడం నుంచి ఉద్యోగం లభించాక వీసా మంజూరు వరకు అంతా ఆన్‌లైన్‌లోనే! ఇందుకోసం కెనడా ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌లింక్‌ను అందుబాటులో ఉంచింది.

జాబ్‌ బ్యాంక్‌ అకౌంట్‌ :
కెనడా ఇమిగ్రేషన్‌ వెబ్‌సైట్‌లో తమ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకుంటే.. అభ్యర్థుల అర్హతలు, అనుభవం ఆధారంగా వారికి సరిపడే కంపెనీలకు సదరు అభ్యర్థుల ప్రొఫైల్‌ తెలుస్తుంది. అభ్యర్థి ప్రొఫైల్‌ నచ్చితే సదరు సంస్థ కెనడా ఇమిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌కు తెలియజేస్తుంది. ఆ వెంటనే వీసా మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మూడు వారాల్లోపు వీసా లభిస్తుంది. ఎలాంటి ఉద్యోగ ఆఫర్‌ లేకుండా పీఆర్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. అది మంజూరైన ఏడాదిలోపు అక్కడ ఉద్యోగం సొంతం చేసుకొని స్పాన్సర్‌షిప్‌ లెటర్‌ ఆధారంగా వర్క్‌ వీసాకు దరఖాస్తు చేసుకోవాలి.

యూకేలో కొలువులు.. వీసా తీరుతెన్నులు :
యూకేలో ఉద్యోగాన్వేషణ సాగిస్తున్న భారతీయులు..
1. రీసెర్చ్‌ ఫెలో
2. ఎస్‌ఏపీ కన్సల్టెంట్‌
3. ఐఓఎస్‌ డెవలపర్‌
4. ఆండ్రాయిడ్‌ డెవలపర్‌
5. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ అనలిస్ట్‌
6. రీసెర్చ్‌ అసోసియేట్‌
7. జావాడెవలపర్‌
8. ఫిజిషియన్‌
9. ఆర్కిటెక్ట్‌ వంటి జాబ్‌ ప్రొఫైల్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు.
యూకేలో ఇలా..
కొన్నేళ్ల క్రితం వరకు విదేశీయులకు ఉద్యోగ వీసాల మంజూరులో కఠినంగా వ్యవహరించిన యూకే కూడా ఇటీవల కాలంలో నిబంధనలను సరళీకృతం చేస్తోంది. విదేశీ ఉద్యోగ ఔత్సాహికులకు సులభంగా వర్క్‌ వీసాలు మంజూరు చేసే విధంగా ఆ దేశ ఇమిగ్రేషన్‌ విభాగం పనిచేస్తోంది. వీసా నిబంధనల సరళీకరణకు బ్రెగ్జిట్‌ అనంతర పరిణామాలే కారణమని చెబుతున్నారు.

టైర్‌–2 వీసాలు :
యూకేలో అడుగుపెట్టే విదేశీయులకు.. మంజూరు చేసే వీసాలను టైర్‌–1 నుంచి టైర్‌–6 వరకు వర్గీకరించారు. ఉద్యోగాల కోసం టైర్‌–2 వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
యూకేలో ఉద్యోగం దిశగా.. అందుబాటులో ఉన్న ప్రధాన మార్గం.. టైర్‌–2 వీసాలు. ఇందులో టైర్‌–2 జనరల్, టైర్‌–2 ఐసీటీ (ఇంట్రా కంపెనీ ట్రాన్స్‌ఫర్‌) అని రెండు రకాలు ఉన్నాయి.

టైర్‌–2 జనరల్‌.. ఇలా :
టైర్‌–2 జనరల్‌ వీసా ప్రకారం సంస్థలు నిపుణుల కొరత ఉన్న విభాగాల్లో విదేశీ ఉద్యోగులను నియమించుకోవచ్చు. కనీసం 30 వేల పౌండ్ల వేతనం చెల్లించాలి. ఇటీవల కాలంలో యూకే, భారత్‌ మధ్య పెరుగుతున్న వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో భారత్‌ నుంచి ఉద్యోగ ఔత్సాహికులకు అక్కడి సంస్థలు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ విభాగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.

వీసా ‘క్యాప్‌’ :
విదేశీ ఉద్యోగులకు ఇచ్చే వీసా ‘క్యాప్‌’(వీసా పరిమితి)ని ఎత్తివేయాలనే దిశగా యూకే అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సంవత్సరానికి గరిష్టంగా 20,700 వీసాలను మంజూరు చేస్తున్నారు. 2021 నాటికి ఈ వీసా పరిమితిని తొలగించాలనే ప్రతిపాదనను పార్లమెంటు ముందుంచారు. ఇప్పటికే యూకేలో పనిచేస్తున్న విదేశీయుల్లో 55 శాతం మంది భారతీయులే ఉన్నట్లు అంచనా! వీసా క్యాప్‌ కూడా తొలగిస్తే.. ఈ సంఖ్య 80 శాతానికి చేరే అవకాశముందంటున్నారు.
Published date : 25 Jan 2019 06:25PM

Photo Stories