Skip to main content

యూఎస్‌లో ఎంఎస్‌ చేయాలంటే ...!

విదేశాల్లో ఉన్నత చదువులు.. ఆపై డాలర్ల వర్షం కురిపించే అత్యున్నత కొలువులు.. ఇవే ప్రస్తుతం సగటు భారతీయ విద్యార్థి ఆలోచనలు.

ముఖ్యంగా బీటెక్, ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన ఎక్కువ మంది ప్రతిభావంతుల లక్ష్యం యూఎస్‌లో ఎంఎస్‌ చేయడమే. విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను యూఎస్‌లో ఎంఎస్‌ చదివిం చాలని కలలు కంటున్నారు. కానీ, అక్కడి యూనివర్సిటీల్లో ప్రవేశం పొందాలంటే.. ఏడాది ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. తద్వారా ఎలాంటి ఆటంకాలూ లేకుండా అమెరికా చదువు కలను నిజం చేసుకోవచ్చు. ఆ ప్రణాళిక ఏమిటో చూద్దాం..!

ఏడాది ముందు నుంచి..
మన దేశంలో అవసరమైన ప్రవేశ పరీక్ష రాసి, కౌన్సెలింగ్‌కు వెళ్లి నేరుగా కళాశాలలో చేరిపోతాం. కానీ, అమెరికాలోని కాలేజీల్లో చేరాలనుకుంటే.. ఏడాది ముందు నుంచి సన్నద్ధం కావాలి. అలాగే, మన దేశంలో ఏడాదిలో ఒక్కసారే విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. కానీ, అమెరికాలో ఫాల్, స్ప్రింగ్, సమ్మర్‌ రూపంలో ఏడాదికి మూడుసార్లు ప్రవేశాలు జరుగుతాయి. ఎక్కువ కోర్సులు మాత్రం ఫాల్‌ సీజన్‌లోనే ప్రారంభమవుతాయి. మన విద్యార్థులకు అనువైనది కూడా ఈ సీజనే.

డిసెంబర్‌ లోపు దరఖాస్తు!
డిసెంబర్‌లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు అందించే నాటికే రికమండేషన్‌ లెటర్, సంబంధిత ప్రామాణిక పరీక్షలో స్కోర్, అకడమిక్‌ సర్టిఫికెట్లు సిద్ధంగా ఉండాలి. ఏప్రిల్‌/మేలో.. దరఖాస్తు చేసుకున్న యూనివర్సిటీ నుంచి లెటర్‌ వస్తుంది. కోర్సు పూర్తి చేసుకునేందుకు తగిన ఆర్థిక స్తోమత ఉన్నట్లు ఏదైనా ఆధారం/హామీ చూపగలిగితే సదరు యూనివర్సిటీ అడ్మిషన్‌ ప్రక్రియ ప్రారంభిస్తుంది. అన్నీ సవ్యంగా జరిగితే జూన్‌/జూలైలో స్టూడెంట్‌ వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కోర్సుపై స్పష్టత :
యూఎస్‌లో ఎంఎస్‌ చేయాలని నిర్ణయించుకున్నాక.. ఏ కోర్సులో చేరాలనుకుంటున్నారనే దానిపై స్పష్టత ఉండాలి. ఆసక్తి ఉన్న కోర్సుకే ప్రాధాన్యంlఇవ్వడం మేలన్నది నిపుణుల సలహా. వ్యక్తిగత అభిరుచులు, కెరీర్‌ లక్ష్యాలు, స్కిల్స్‌ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఏ కోర్సులో చేరాలో నిర్ణయించుకోవచ్చు.

యూనివర్సిటీ ఎంపిక :
కోర్సుపై ఒక అభిప్రాయానికి వచ్చాక.. ఆ కోర్సు ఏయే యూనివర్సిటీల్లో అందుబాటులో ఉందో తెలుసుకోవాలి. ఆ యూనివర్సిటీలను.. నాణ్యత ప్రమాణాలు, పేరున్న సర్వేల ర్యాంకుల ఆధారంగా వరుస క్రమంలో నోట్‌ చేసుకోవాలి. సీనియర్లు, అనుభవజ్ఞులతో చర్చించి మెరుగైన యూనివర్సిటీకి ప్రాధాన్యమివ్వాలి.

గడువులోగా దరఖాస్తు :
అమెరికాలో ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో గడువు ఉంటుంది. వీటిని గుర్తుపెట్టుకుని దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కో కోర్సుకు ఒక్కో డెడ్‌లైన్‌ ఉంటుంది. దీన్ని గమనిస్తుండాలి.

అర్హతలు...
కోర్సును బట్టి వేర్వేరు అర్హతలు ఉంటాయి. దరఖాస్తు చేసుకోవడానికి ముందే వీటిని పరిశీలించుకోవాలి. యూఎస్‌లో ఎంఎస్‌ చేయాలంటే 16 ఏళ్ల విద్యాభ్యాసం అవసరం. అంటే.. ఇంటర్‌ తర్వాత ఏదైనా నాలుగేళ్ల కోర్సు చదవడం తప్పనిసరి. మూడేళ్ల సాధారణ డిగ్రీ విద్యార్థులు ఎంఎస్‌ కోర్సులకు అనర్హులు. వీరు మరో ఏడాది పాటు ఏదైనా కోర్సు పూర్తిచేస్తేనే అర్హులవుతారు.

దరఖాస్తుతో పాటు..
యూనివర్సిటీ ప్రవేశానికి దరఖాస్తు పూరిస్తే సరిపోదు. ఆ కోర్సు ఎందుకు చదవాలనుకుంటున్నారు? కోర్సు నుంచి ఏం ఆశిస్తున్నారు? భవిష్యత్తు లక్ష్యాలేంటి..? తదితర వివరాలతో.. పరిమిత పదాలతో స్పష్టంగా ‘స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌’ రూపొందించాలి. పలు యూనివర్సిటీలు రికమండేషన్‌ లెటర్‌ను కూడా కోరుతున్నాయి. కనీసం ఇద్దరు లేదా ముగ్గురు ఈ లేఖలు అందించాలి. దీనికోసం ప్రొఫెసర్లు, ఉన్నతోద్యోగుల సాయం కోరవచ్చు. వీటితోపాటు విద్యార్హతలు, పుట్టిన తేదీ తదితర ప్రాథమిక అంశాలతో కూడిన రెజ్యూమెను కూడా జత చేయాల్సి ఉంటుంది.

అవసరమైన పత్రాలు: రికమండేషన్‌ లెటర్‌; జీఆర్‌ఈ/ టోఫెల్‌/ జీమ్యాట్‌/ ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్‌ ప్రూఫ్‌; అకడమిక్‌ సర్టిఫికెట్లు; స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌; ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్స్‌ (ఉంటేనే); పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోలు.

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌(ఐఐఈ) తాజా నివేదికలోని అంశాలు..

  1. భారత్‌ నెం–2: అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా.. భారత్‌ రెండో స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమెరికాలో చదువుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది. గత విద్యా సంవత్సరంలో భారత విద్యార్థుల సంఖ్య 1.65 లక్షలుండగా ఈ ఏడాది ఆ సంఖ్య 1.86 లక్షలకు చేరింది.
  2. విదేశీయులు అధికంగా ఉన్న రాష్ట్రాలు: కాలిఫోర్నియా, న్యూయార్క్, టెక్సాస్, మసాచుసెట్స్, ఇల్లినాయిస్, పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, ఒహియో, మిచిగాన్, ఇండియానా.
  3. విదేశీ విద్యార్థులు అధికంగా ఉన్న వర్సిటీలు (టాప్‌ 3):
    1. న్యూయార్క్‌ విశ్వవిద్యాలయం – 17,326
    2. యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా – 14,327
    3. కొలంబియా విశ్వవిద్యాలయం – 14,096.
    4. ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్న తొలి మూడు విభాగాలు: స్టెమ్‌ ఫీల్డ్స్‌ (25%), బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (21%), సోషల్‌ సైన్సెస్‌ (17%).
    5. భారత్‌లో తగ్గిన యూఎస్‌ విద్యార్థులు: అమెరికాలో మన విద్యార్థుల సంఖ్య పెరుగుతుంటే భారత్‌లో అమెరికన్‌ విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. గతేడాది వీరి సంఖ్య 4438 కాగా ఈ ఏడాది 4181కి తగ్గిపోయింది.
అదే విధంగా అమెరికా విద్యార్థులు అధికంగా యూకే, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ దేశాల్లో అమెరికన్‌ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 4% పెరిగింది.
అమెరికాలో విదేశీ విద్యార్థుల శాతం...
చైనా – 33 %
దక్షిణ కొరియా– 5%
కెనడా– 3%
జపాన్‌ – 2%
భారత్‌ – 17.3 %
సౌదీ అరేబియా – 5%
మెక్సికో – 2%
తైవాన్‌ – 2%
Published date : 17 Nov 2017 05:49PM

Photo Stories