Skip to main content

విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్స్‌ పొందడం ఎలా..?

విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ఎప్పటి నుంచి సన్నద్ధమవ్వాలి. ఆ దేశాల్లో అడ్మిషన్స్ సైకిల్ ఎలా ఉంటుంది.
అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లోని ఇన్‌స్టిట్యూట్స్ ఏ సీజన్‌లో విద్యార్థులను ఎక్కువగా చేర్చుకుంటున్నాయి. భారత విద్యాసంస్థల మాదిరిగా కాకుండా..విదేశీ విశ్వవిద్యాలయాలు ఏడాదిలో ఎన్నిసార్లు అడ్మిషన్‌లు కల్పిస్తాయి.. మొదటిసారి ప్రవేశం లభించకపోతే.. మరోఏడాదిపాటు నిరీక్షించాల్సిందేనా?! ఇలాంటి సందేహాల నివృత్తి కోసం అందిస్తున్న ప్రత్యేక కథనం...

భారతీయ విద్యాసంస్థలు మే/జూన్‌లో ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహించి.. ప్రవేశ ప్రక్రియ చేపడతాయి. ఒకసారి సీటు దక్కకపోతే మళ్లీ సమ్మర్ వచ్చేవరకు అంటే ఏడాది కాలం ఎదురు చూడాల్సిందే. కానీ విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశ ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. సీటు పొందడానికి పలు దఫాల్లో ప్రయత్నించవచ్చు. మొదటిసారి అడ్మిషన్ దక్కకపోయినా.. అదే ఏడాది కొన్ని నెలల వ్యవధిలోనే మరోసారి ప్రయత్నించే వెసులుబాటు ఉంటుంది. విదేశీ యూనివర్సిటీలు ఏటా ఫాల్, స్ప్రింగ్, సమ్మర్, వింటర్.. ఇలా పలు దశల్లో ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తాయి. తాజాగా విదేశీ యూనివర్సిటీలు అడ్మిషన్స్‌కు సంబంధించి ప్రకటనలు విడుదల చేస్తున్నాయి.

ఫాల్‌లోనే ఎక్కువ..
విదేశీ యూనివర్సిటీలు ఫాల్, స్ప్రింగ్, సమ్మర్ అనే మూడు ప్రధాన సీజన్లల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. వీటిలో ఫాల్, స్ప్రింగ్ సీజన్‌లలోనే అత్యధిక యూనివర్సిటీలు దరఖాస్తులు కోరుతాయి. మరీ ముఖ్యంగా ఫాల్ సీజన్‌కు డిమాండ్ కాస్త ఎక్కువ. పేరొందిన యూనివర్సిటీలు చాలావరకు ఫాల్‌లోనే అడ్మిషన్లు నిర్వహిస్తాయి. ప్రముఖ యూనివర్సిటీలు అందించే ముఖ్యమైన కోర్సులు సైతం ఫాల్ సీజన్‌లో మాత్రమే ఉంటాయి. మిగతా సీజన్‌లలో డిమాండ్ ఉన్న కోర్సులు తక్కువే అని చెప్పొచ్చు. యాక్సెప్టెన్సీ రేటు ఫాల్ సీజన్‌లో ఎక్కువగా ఉంటుంది. ఇందుకు కారణం.. ఎక్కువ సంఖ్యలో సీట్లు అందుబాటులో ఉండటమే. ఇక, వీసా సక్సెస్ రేటులో యూనివర్సిటీలది ప్రధాన పాత్ర. కాబట్టి పేరున్న కాలేజీలో ఫాల్‌లో చేరితే వీసా లభించడం కూడా సులువు అవుతుంది. మన విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపే అమెరికాకు ఫాల్, స్ప్రింగ్ సీజన్‌లలో వెళుతున్నారు. సమ్మర్‌లో తక్కువగా ప్రవేశాలు జరుగుతున్నాయి. అమెరికా క్యాలెండర్ ప్రకారం-ఫాల్ సీజన్‌ను అకడెమిక్ ప్రారంభ ఇయర్‌గా పేర్కొనొచ్చు. అందుకే ఆ సీజన్‌లో ఎక్కువగా అడ్మిషన్స్ కల్పిస్తున్నారు.

ఆగస్టు చివరి నుంచి..
 • అమెరికా, యూకే, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా యూనివర్సిటీలు ఆగస్టు నెల చివరల్లో అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభిస్తాయి. ఫిబ్రవరి లేదా జూన్ చివరి కల్లా దరఖాస్తులు స్వీకరించడం పూర్తి చేస్తాయి. స్కాలర్‌షిప్స్ కోరుకునే ఇంటర్నేషనల్ విద్యార్థులు నవంబర్ చివరి వారం/డిసెంబర్ మొదటి వారంలోగా తమ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఇంటర్నేషనల్ విద్యార్థులు సెప్టెంబర్‌లో దరఖాస్తు చేసుకోవడం ప్రారంభించినప్పటికీ.. అసలైన ప్రక్రియ అంతకంటే ముందుగానే మొదలవుతుంది. యూనివర్సిటీల గురించి తెలుసుకోవడం, దరఖాస్తు విధానంపై అవగాహన తదితరాలకు సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది.
ఫాల్ అడ్మిషన్.. టైమ్‌లైన్
 • జూన్: ఏ దేశం, ఏ యూనివర్సిటీ, ఏ కోర్సులో చేరాలో నిర్ణయించుకోవాలి.
 • జూలై: ప్రవేశ పరీక్షలకు నమోదు చేసుకోవాలి. పరీక్షలు రాయాలి.
 • ఆగస్టు: అప్లికేషన్ ప్యాకేజీలకు సన్నద్ధమవ్వాలి. టెస్ట్ స్కోరు పొందాలి.
 • సెప్టెంబర్: దరఖాస్తు చేసుకోవడం ప్రారంభించాలి.
 • నవంబర్-డిసెంబర్-జనవరి: దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
 • ఫిబ్రవరి- మార్చి: దరఖాస్తులకు కాలేజీలు రిప్లై ఇస్తాయి.
 • ఏప్రిల్ - మే: స్కాలర్‌షిప్స్ కోసం అన్వేషించడం, ఎడ్యుకేషన్ రుణా నికి దరఖాస్తు తదితర ఆర్థిక విషయాలు చూసుకోవాలి.
 • జూలై: డిపార్చర్ సన్నాహకాలు.
 • ఆగస్టు: సెషన్ ప్రారంభమవుతుంది.

15 నెలల ముందే..!
విదేశాల్లో ఉన్నత విద్యకు ప్రణాళికలు వేసుకునే వారు కనీసం 15 నెలల ముందే తమ సన్నద్ధతను ప్రారంభించాలి. అంటే.. ఉదాహరణకు 2020 ఫాల్‌కు కాలేజీలో చేరాలనుకుంటే.. 2019 ప్రారంభంలోనే ప్రక్రియ మొదలుపెట్టాలి. యూనివర్సిటీ ఎంపిక, లాంగ్వేజ్ టెస్టు(ఐఈఎల్‌టీఎస్ /పీటీఈ/టోఫెల్ వంటివి), జేఆర్‌ఈ, జీమ్యాట్ వంటి టెస్టులు రాయాల్సి ఉంటుంది. అలానే స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్, లెటర్ ఆఫ్ రికమండేషన్, అకడమిక్ ట్రాన్‌స్క్రిప్ట్స్, ఫీజు చెల్లించడానికి ఆర్థిక వనరులు, కాలేజీ ఆన్‌లైన్ దరఖాస్తు మొదలైన ప్రక్రియ ఉంటుంది. దీనికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ముందుగానే సన్నద్ధత మొదలుపెట్టాలి.

స్ప్రింగ్ అడ్మిషన్స్..
స్ప్రింగ్‌కు కూడా విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. అయితే అన్ని యూనివర్సిటీలు స్ప్రింగ్‌కు ప్రత్యేకంగా దరఖాస్తులు స్వీకరించవు. ఫాల్‌కు దరఖాస్తు చేసుకొని.. అడ్మిషన్ పొందలేని వారికి.. స్ప్రింగ్‌కు ఆహ్వానం అందే వీలుంటుంది. ఫాల్‌లోని కొన్ని ప్రోగ్రామ్‌లు స్ప్రింగ్‌కు అందుబాటులో ఉండవు. అమెరికాలో కార్నెల్, యూఐయూసీ, పర్డ్యూ, సీఎంయూ, యూనివర్సిటీ ఆఫ్ విష్‌కాన్‌సిన్, మేడిసన్, యూఎస్‌సీ, ఎన్‌వైయూ లాంటి విద్యాసంస్థలు స్ప్రింగ్‌లోనూ అడ్మిషన్లు కల్పిస్తున్నాయి.

ప్రవేశం ఇలా..
ఔత్సాహిక విద్యార్థులు ఆయా ఇన్‌స్టిట్యూట్‌లకు నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతోపాటు నిర్దేశిత పత్రాలు (విద్యార్హతల సర్టిఫికెట్లు; ఫీజు, నివాస వ్యయానికి సరిపడే విధంగా ఆర్థిక వనరుల రుజువు పత్రాలు, స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్, రికమండేషన్ లెటర్స్ తదితర) అందించాలి. వీటిని పరిశీలించి ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు ఆఫర్ లెటర్ ఇస్తాయి. దీన్నే ఐ-20 ఫామ్‌గా పిలుస్తారు. దీని ఆధారంగా స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. అమెరికా వీసా ప్రక్రియ కాస్త క్లిష్టంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తాము చేరదలచుకున్న కోర్సు, ఇన్‌స్టిట్యూట్ విషయంలో అడ్మిషన్ సెషన్ ప్రారంభానికి కనీసం ఏడాది లేదా ఏడాదిన్నర ముందు నుంచే కసరత్తు ప్రారంభించాలి.

అవసరమైన పత్రాలు..
 • విద్యార్హతల సర్టిఫికెట్లు, స్టాండర్ట్ టెస్ట్ స్కోర్లు తప్పనిసరి.
 • కోర్సు ట్యూషన్ ఫీజు, కోర్సు వ్యవధిలో అమెరికాలో నివాసం ఉండేందుకు అవసరమయ్యే వ్యయాలకు సరిపోయే ఆర్థిక వనరులున్నాయనే రుజువులు జతచేయాలి.
 • స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్(ఎస్‌ఓపీ):
చాలా యూనివర్సిటీలు ప్రవేశాలు కల్పించడానికి ఎస్‌ఓపీని కోరుతున్నాయి. అభ్యర్థులు ఎస్‌ఓపీలో తాము కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి గల కారణాలు, జీవితంలో తన లక్ష్యాలను పేర్కొనాల్సి ఉంటుంది. సాధారణంగా యూనివర్సిటీ/డిపార్ట్‌మెంట్ ఎస్‌ఓపీకి 500 లేదా అంతకంటే తక్కువ పదాలు పరిమితిగా పేర్కొంటాయి.
 • లెటర్ ఆఫ్ రికమండేషన్:
ఇది అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తూ.. థర్డ్ పర్సన్ ఇచ్చే ధృవీకరణ వంటిది. ఇక్కడ థర్డ్ పర్సన్ ప్రొఫెసర్ లేదా ఎంప్లాయర్ కావచ్చు. చాలా యూనివర్సిటీలు కనీసం రెండు లేదా మూడు రికమండేషన్ లెటర్స్ అడుగుతాయి.

వీసా :
విద్యార్థులు అమెరికాను ఎంచుకుంటే.. వారికి వీసా ఇంటర్వ్యూ ఉంటుంది. ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాలకు ఇంటర్వ్యూలు లేకుండానే వీసా పొందే వెసులుబాటు లభిస్తుంది. అమెరికా ఔత్సాహిక అభ్యర్థులు ఐ-20 పొందిన తర్వాత దాని ఆధారంగా ఎఫ్-1 వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ వీసా దరఖాస్తును పరిశీలించిన అధికారులు.. నిర్దేశిత తేదీలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోర్సు పూర్తయ్యాక స్వదేశానికి తిరిగొస్తామని స్పష్టంగా చెప్పాలి. ఇంటర్వ్యూ సందర్భంగా అభ్యర్థి ఇచ్చిన సమాధానాలకు సంతృప్తి చెందితే ఎఫ్-1 వీసా ఖరారవుతుంది.

విదేశీ విద్య... ప్రామాణిక పరీక్షలు :
అంతర్జాతీయ యూనివర్సిటీల్లో చదవాలనుకునే అభ్యర్థులు కనీసం ఒక ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ (ఐఈఎల్‌టీఎస్/టోఫెల్)తోపాటు ఒక ప్రామాణికమైన పరీక్ష రాయాల్సి ఉంటుంది. జీఆర్‌ఈ, జీమ్యాట్, సాట్ లాంటి ప్రామాణికమైన పరీక్షలకు హాజరుకావాలి. అభ్యర్థులు ఎంచుకునే కోర్సు, దేశాలకు అనుగుణంగా ఆయా పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలి.

ఐఈఎల్‌టీఎస్ :
ది ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్.. ఐఈఎల్‌టీఎస్. ఇది ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, అమెరికా, ఇతర యూరోపియన్ దేశాల్లోని దాదాపు అన్ని యూనివర్సిటీలు/ కాలేజీలు ఈ స్కోరును ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. దీన్ని బ్రిటిష్ కౌన్సిల్, ఐడీపీ ఆస్ట్రేలియా, కేంబ్రిడ్జ్ ఇంగ్లిష్ నిర్వహిస్తాయి. ఐఈఎల్‌టీఎస్ స్కోరును బాండ్లలో తెలుపుతారు. ఐఈఎల్‌టీఎస్ స్కోరు 0 నుంచి 9 బాండ్‌ల వరకు ఉంటుంది.

టోఫెల్ :
టెస్ట్ ఇన్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్.. టోఫెల్. ఈ స్కోరును యూఎస్, కెనడా యూనివర్సిటీలు ఎక్కువగా కోరుతున్నాయి.

పియర్‌సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ (పీటీఈ):
టోఫెల్, ఐఈఎల్‌టీఎస్‌లాగే పీటీఈ అకడమిక్ కూడా ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్ట్.

జీఆర్‌ఈ :
గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్స్.. జీఆర్‌ఈ. విదేశాల్లో ఉన్నత విద్యలో చేరాలంటే..ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌తోపాటు ఏదైనా ఒక ప్రామాణిక పరీక్ష స్కోరు అవసరం (కొన్ని కాలేజీలకు, దేశాలకు మినహాయింపు). జీఆర్‌ఈ ప్రామాణిక ఎగ్జామ్స్‌లో ముందు వరుసలో ఉంటుంది. ఈ స్కోరు ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది గ్రాడ్యుయేట్ స్కూల్స్, బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశాలు పొందుతున్నారు.

జీమ్యాట్ :
గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్.. జీమ్యాట్. అంతర్జాతీయంగా ఉన్న టాప్ బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశాలకు ఈ స్కోరు ఉపయోగపడుతుంది.

సాట్ (స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్) :
అంతర్జాతీయంగా గ్రాడ్యుయేట్ లెవల్ కోర్సుల్లో ప్రవేశాలకు వీలుకల్పించే టెస్ట్ ఇది.
Published date : 24 Oct 2019 02:56PM

Photo Stories