Skip to main content

ఉన్నత విద్యకి అమెరికాకు దీటైన ప్రత్యామ్నాయ దేశాలెన్నో...!

విదేశాల్లో ఉన్నతవిద్యలో చేరాలి, అక్కడే ఉద్యోగాలూ సొంతం చేసుకోవాలన్నది దేశంలోని లక్షల మంది విద్యార్థుల లక్ష్యం. ఇంతకాలంగా మన విద్యార్థులకు అమెరికా డాలర్ డ్రీమ్స్ ముఖ్య గమ్యం. కానీ, అక్కడ ట్రంప్ అధికారంలోకి వచ్చాక స్టడీ, పోస్ట్ స్టడీ వర్క్ వీసాల పరంగా సవాలక్ష ఆంక్షలు. ఏదో రకంగా అమెరికా యూనివర్సిటీలో కాలుమోపినా.. అడుగడుగునా నిబంధనల భయం! అందుకే ఇటీవల కాలంలో మన విద్యార్థులు ప్రత్యామ్నాయ దేశాలవైపు దృష్టిసారిస్తున్నారు. ఫీజులు, కోర్సులు, ఉద్యోగాల పరంగా సానుకూల విధానాలు అనుసరిస్తున్న కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ, జపాన్‌లకు పయనమవుతన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాకు దీటైన ప్రత్యామ్నాయలుగా నిలుస్తున్న దేశాలు, అందిస్తున్న కోర్సులు, పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలపై కథనం...
ఫ్రాన్స్ ప్రత్యేక విధానాలు :
ఫ్రాన్స్ కూడా మన విద్యార్థుల స్టడీ అబ్రాడ్ దేశాల జాబితాలో నిలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఆ దేశ ప్రభుత్వం సైతం భారతీయవిద్యార్థులను ఆకర్షించేందుకు ప్రత్యేక విధానాలను అమలు చేస్తోంది. 2020 నాటికి పది వేల మంది భారత విద్యార్థులకు స్టూడెంట్ వీసాలు మంజూరు చేయాలని ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా ఫ్రాన్స్ ఇన్‌స్టిట్యూట్‌లకు దరఖాస్తు చేసుకుంటే వీసా సులువుగా మంజూరవుతోంది. 2017లో ఫ్రాన్స్ స్టూడెంట్ వీసాలు పొందిన భారతీయ విద్యార్థుల సంఖ్య 4,500 కాగా.. ఆ సంఖ్య 2018లో ఎనిమిది వేలకు పైగా ఉంది. అకడమిక్స్ పరంగా చూస్తే.. హ్యుమానిటీస్, ఆర్ట్స్ కోర్సులకు ఫ్రాన్స్ ప్రత్యేకంగా నిలుస్తోంది. మన దేశ విద్యార్థుల్లో అధిక శాతం మంది మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్ కోర్సుల్లోనే చేరుతున్నట్లు గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. పోస్ట్ స్టడీ వర్క్ విషయంలో రెండేళ్ల మాస్టర్ కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థులు రెండేళ్ల పాటు అక్కడే కొనసాగి ఉద్యోగాన్వేషణ చేయొచ్చు. ఈ సమయంలో ఉద్యోగం లభిస్తే స్పాన్సర్‌షిప్ లెటర్ ఆధారంగా తొలుత రెండేళ్ల కాల పరిమితితో వర్క్ పర్మిట్ మంజూరు చేస్తారు. ఆ తర్వాత దాన్ని పొడిగించుకునే అవకాశం కూడా ఉంది.
వివరాలకు వెబ్‌సైట్: www.inde.campusfrance.org

ఆస్ట్రేలియా.. అవకాశాలెన్నో!
భారత విద్యార్థులకు మరో ప్రధాన ప్రత్యామ్నాయ గమ్యం.. ఆస్ట్రేలియా. గతేడాది ఆ దేశానికి వెళ్లిన భారత విద్యార్థుల సంఖ్య 60వేలకు పైగా ఉంది. 2017తో పోల్చితే 2018లో ఆ సంఖ్యలో 14 శాతం వృద్ధి నమోదైంది. అకడమిక్ కోర్సులతోపాటు పోస్ట్ స్టడీ వర్క్ పరంగా ఆస్ట్రేలియా అనుసరిస్తున్న సరళీకృత విధానాలే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీతోపాటు మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ కోర్సులను అందించడంలో ఆస్ట్రేలియాలోని ఇన్‌స్టిట్యూట్‌లకు మంచి పేరుంది. రెండేళ్ల వ్యవధి గల కోర్సులు పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులకు పోస్ట్ స్టడీ వర్క్ వీసాలను సులువుగా మంజూరు చేస్తోంది. ఆ క్రమంలో టెంపరరీ గ్రాడ్యుయేట్ వర్క్ స్ట్రీమ్ ప్రోగ్రామ్‌ను ప్రత్యేకంగా అమలు చేస్తోంది. దీని ప్రకారం రెండేళ్ల వ్యవధిలో గల కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి.. సంబంధిత రంగంలో ఉద్యోగం సొంతం చేసుకుంటే.. తొలుత ఏడాదిన్నర (18 నెలల) కాల పరిమితి ఉండే వర్క్ వీసా మంజూరు చేస్తారు. మరోవైపు పోస్ట్ స్టడీ వర్క్ స్ట్రీమ్‌లో భాగంగా కనిష్టంగా రెండేళ్లు, గరిష్టంగా నాలుగేళ్లు ఆస్ట్రేలియాలోనే పనిచేసే అవకాశం ఉంది.
వెబ్‌సైట్: www.border.gov.au

సింగపూర్ సానుకూల గమ్యం:
విదేశీ విద్య ఔత్సాహికులకు అన్ని రకాలుగా సానుకూల గమ్యంగా సింగపూర్‌ను పేర్కొనొచ్చు. ఇక్కడి యూనివర్సిటీలకు అంతర్జాతీయ ఇన్‌స్టిట్యూట్‌లతో ఉన్న ఒప్పందాల ఫలితంగా డ్యూయల్ డిగ్రీ, జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు చేసే అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం ఏటా 35వేల మంది విదేశీ విద్యార్థులు సింగపూర్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందుతున్నారు. వీరిలో భారత విద్యార్థుల సంఖ్య 15 శాతం నుంచి 20 శాతం ఉంటోంది. ముఖ్యంగా ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సుల్లోనే అధిక శాతం విద్యార్థులు చేరుతున్నారు. కోర్సు పూర్తయ్యాక ఏడాదిపాటు పోస్ట్ స్టడీ వర్క్ పేరుతో అక్కడే పనిచేసే అవకాశముంది. ఆ తర్వాత కూడా ఎంప్లాయర్ స్పాన్సర్‌షిప్ లెటర్ ఆధారంగా పొడిగించుకోవచ్చు.
పూర్తి వివరాలకు: www.singaporeedu.gov.sg

జపాన్ టెక్నాలజీకి పెట్టింది పేరు:
సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులకు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందిన దేశం.. జపాన్. ప్రధానంగా సైన్స్, ఇంజనీరింగ్ కోర్సులకు నెలవు ఇక్కడి ఇన్‌స్టిట్యూట్‌లు. గతేడాది దాదాపు 10 వేల మంది భారతీయ విద్యార్థులు జపాన్ విద్యా సంస్థల్లో అడుగుపెట్టారు. జపాన్‌లో పోస్ట్ స్టడీ వర్క్ సరళీకృత విధానాలు అమలవుతున్నాయి. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేందుకు ఆరు నెలలు ఇక్కడే నివసించే అవకాశముంది. ఆ సమయంలో ఉద్యోగం లభిస్తే స్పాన్సర్‌షిప్ లెటర్ ఆధారంగా తొలుత మూడేళ్ల వ్యవధికి వర్క్ వీసా మంజూరు చేస్తారు.
పూర్తి వివరాలకు: www.jasso.go.jp

యూకే.. ఉద్యోగాన్వేషణకు వీలు
విదేశీ విద్య పరంగా యూకే వైపు మొగ్గుచూపుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఆంక్షలు, కెనడాలో ఖర్చుల దృష్ట్యా.. మన విద్యార్థులు యూకే బాటపడుతున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 21,165 మంది భారతీయ విద్యార్థులు యూకే స్టూడెంట్ వీసాలు సొంతం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. అంతకుముందు ఏడాదితో పోల్చితే ఈ సంఖ్య 40 శాతం పెరగడం గమనార్హం. బ్రెగ్జిట్ తదనంతర పరిణామాలతో యూకేలో పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు మెరుగవుతున్నాయి. యూజీ, పీజీ విద్యార్థులు కోర్సు ఉత్తీర్ణత తర్వాత ఆరు నెలలు; పీహెచ్‌డీ పూర్తిచేసుకున్నాక ఏడాది పాటు అక్కడే ఉండి ఉద్యోగాన్వేషణ చేయొచ్చు. ఈ సమయంలో ఉద్యోగం లభిస్తే టైర్-2 వర్క్ వీసా సులువుగా మంజూరవుతోంది. దీనిద్వారా గరిష్టంగా అయిదేళ్లు యూకేలో నివశించొచ్చు. టైర్-5 విధానంలో అక్కడే ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేసేందుకు అనుమతి లభిస్తుంది.
వివరాలకు వెబ్‌సైట్: www.gov.uk

మలేషియా..యూకే తరహా బోధన
మలేషియా అకడమిక్ కరిక్యులం పరంగా యూకే తరహా బోధన విధానాన్ని అనుసరిస్తోంది. గతేడాది మలేషియా యూనివర్సిటీల్లో చేరిన విదేశీ విద్యార్థుల సంఖ్య లక్షన్నర. ఇది అక్కడి ఇన్‌స్టిట్యూట్‌ల పట్ల పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం. ఇక్కడ పీజీ కోర్సుల వ్యవధి ఏడాదిన్నర. వీటిని పూర్తిచేసుకున్న అభ్యర్థులకు కేటగిరీ-1, 2, 3 పేరుతో మూడు రకాల పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ల విధానం అమల్లో ఉంది. కేటగిరీ-1లో నెలకు కనిష్టంగా 5 వేల రింగిట్‌ల జీతం సొంతం చేసుకున్న వారికి అయిదేళ్ల ఎంప్లాయ్‌మెంట్ పాస్ లభిస్తుంది. నెలకు అయిదు వేల లోపు రింగిట్‌ల వేతనంతో రెండేళ్ల కాంట్రాక్ట్ ఉద్యోగం పొందిన వారికి కేటగిరీ-2 ఎంప్లాయ్‌మెంట్ పాస్ లభిస్తుంది. ఉద్యోగ కాల పరిమితి ఏడాది లోపు, వేతనం 2,500-4,999 రింగిట్లు ఉంటే కేటగిరీ-3 ఎంప్లాయ్‌మెంట్ పాస్ మంజూరవుతుంది.
వివరాలకు వెబ్‌సైట్: https://educationmalaysia.gov.my

నెదర్లాండ్స్.. స్టడీ, పోస్ట్ స్టడీ వర్క్ :
స్టడీ, పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాల పరంగా అంతర్జాతీయంగా విద్యార్థులను ఆకర్షిస్తున్న మరో దేశం.. నెదర్లాండ్స్. 2017-18 విద్యా సంవత్సరంలో 81,392 మంది విదేశీ విద్యార్థులు నెదర్లాండ్స్‌లోని ఇన్‌స్టిట్యూట్‌లలో అడుగుపెట్టారు. వీరిలో ఎనిమిది వేల మంది భారత విద్యార్థులు. అకడమిక్‌గా చూస్తే.. కోర్సుల వ్యవధి కనిష్టంగా ఏడాది, గరిష్టంగా రెండేళ్లు ఉంటుంది. వీటిని పూర్తిచేసుకున్న వారికి పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. కోర్సు పూర్తిచేసుకున్న తర్వాత ఏడాది పాటు ఉద్యోగాన్వేషణ సాగించొచ్చు. ఆ సమయంలో ఉద్యోగం సొంతం చేసుకుంటే.. తొలుత మూడేళ్ల కాల పరిమితితో వర్క్ పర్మిట్ లభిస్తుంది.
వెబ్‌సైట్: www.studyinholland.nl

కెనడా తొలి ఎంపిక :
ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో వీసా ఆంక్షలు పెరిగాయి. ఇలాంటి పరిస్థితిలో మన దేశ విద్యార్థులకు తొలి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న దేశం కెనడా. అధికారిక గణాంకాల ప్రకారం 2018లో 1,07,795 మంది భారత విద్యార్థులు కెనడాలోని యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందడమే ఇందుకు నిదర్శనం. కెనడాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య తొలి స్థానంలో ఉండటం విశేషం. మన విద్యార్థులు కెనడాను ప్రత్యామ్నాయంగా చేసుకోవడానికి పలు కారణాలున్నాయి. అకడమిక్ పరంగా చూస్తే రీసెర్చ్ ఆధారిత విద్యా విధానంతోపాటు.. అక్కడి యూనివర్సిటీల మధ్య అకడమిక్ ఎక్స్ఛేంజ్ విధానాల వల్ల విద్యార్థులకు వివిధ అంశాల్లో నైపుణ్యం లభిస్తోంది. అంతేకాకుండా పోస్ట్ స్టడీ వర్క్ పరంగా ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్’ విధానాన్ని కెనడా ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనివల్ల కెనడాలోని యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు ఉద్యోగ ఆఫర్ లేకపోయినా.. మూడేళ్లపాటు కెనడాలోనే ఉండి.. ఏదో ఒక ఉద్యోగం చేసుకునే వెసులుబాటు లభిస్తోంది. కనిష్టంగా ఎనిమిది నెలలు వ్యవధి గల కోర్సు పూర్తిచేసుకుంటే చాలు.. ఆ ఎనిమిది నెలల వ్యవధికి సరిపడే కాల పరిమితితో పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్‌ను కూడా కెనడా ప్రభుత్వం మంజూరు చేస్తోంది.
వివరాలకు వెబ్‌సైట్: www.cig.gc.ca

జర్మనీ! రీసెర్చ్‌కు కేరాఫ్
మన దేశ విద్యార్థులకు మరో మంచి ప్రత్యామ్నాయం.. జర్మనీ. ఇంజనీరింగ్, సైన్స్ విభాగాల్లో రీసెర్చ్‌కు జర్మనీ కేరాఫ్‌గా నిలుస్తోంది. అంతేకాకుండా అక్కడి యూనివర్సిటీల్లో విద్యాబోధన, ఫీజులు, పోస్ట్ స్టడీ వర్క్ విధానాలు భారతీయ విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. జర్మన్ ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఫీజులు సెమిస్టర్‌కు 500 నుంచి 700 యూరోల మధ్య ఉండటం మన విద్యార్థులకు సానుకూలం. అందుకే గత కొంతకాలంగా జర్మనీకి వెళుతున్న భారత విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. 2017-18 వింటర్ సెమిస్టర్‌లో గణాంకాల ప్రకారం-17,570 మంది భారతీయ విద్యార్థులు జర్మనీలోని ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశాలు పొందారు. అంతకుముందు ఏడాదితో పోల్చితే ఈ సంఖ్య 13 శాతం అధికం. భారతీయ విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల్లో ఎక్కువగా చేరుతున్నారు. మరోవైపు ఎలాంటి కాలపరిమితి ఆంక్షలులేని విధంగా పోస్ట్ స్టడీ వర్క్ వీసా సదుపాయం అందుబాటులో ఉండటం మన విద్యార్థులకు కలిసొస్తోంది. కోర్సు పూర్తిచేసుకున్న తర్వాత 18 నెలలపాటు జర్మనీలోనే ఉండి ఉద్యోగాన్వేషణ సాగించొచ్చు. ఈ సమయంలో ఉద్యోగం ఖరారు చేసుకుంటే.. స్పాన్సర్ లెటర్ ఆధారంగా వర్క్ వీసా లభిస్తుంది.
వివరాలకు వెబ్‌సైట్: www.daad.de

న్యూజిలాండ్ సరికొత్త గమ్యం :
ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల పరంగా సరికొత్త గమ్యం.. న్యూజిలాండ్. ఇది మన విద్యార్థులకు అకడమిక్ కోర్సులు, పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాల పరంగా మరో ఉత్తమ ప్రత్యామ్నాయం. గతేడాది దాదాపు 25 వేల మంది భారతీయ విద్యార్థులు న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీల్లో అడుగుపెట్టారు. వీరిలో అధిక శాతం మంది మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు న్యూజిలాండ్.. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్ట్రాటజీ 2018-30 అనే కొత్త విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం-విదేశీ విద్యార్థుల సంఖ్యను 2030 నాటికి రెట్టింపు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. అందుకోసం విదేశీ విద్యార్థులకు పలు ప్రోత్సాహకాలు సైతం అందిస్తోంది. పోస్ట్ స్టడీ వర్క్ పరంగా.. కోర్సు పూర్తిచేసుకున్న తర్వాత జాబ్ సెర్చ్ వీసా ద్వారా ఏడాది పాటు ఆ దేశంలోనే ఉండి ఉద్యోగాన్వేషణ సాగించొచ్చు. ఆ సమయంలో ఉద్యోగం లభిస్తే గరిష్టంగా మూడేళ్లు అక్కడే కొలువుదీరొచ్చు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.immigration.govt.nz

ప్రత్యామ్నాయ దేశాలు.. ముఖ్యాంశాలు
  • కెనడాకు అధికంగా వెళుతున్న భారత విద్యార్థులు.
  • ప్రతి దేశంలోనూ పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు.
  • యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పీజీ కోర్సుల వ్యవధి ఏడాది.
  • జర్మనీ, జపాన్‌లో నామ మాత్రపు ఫీజులతో కోర్సులు పూర్తిచేసుకోవచ్చు.
  • న్యూజిలాండ్, మలేషియా, సింగపూర్‌లపైనా భారత విద్యార్థుల ఆసక్తి.
  • స్ప్రింగ్, ఫాల్ సెషన్స్ పేరుతో ఏటా రెండుసార్లు ప్రవేశాల ప్రక్రియ.

విదేశీ విద్య.. అవసరమైన పత్రాలు
  1. అకడమిక్ సర్టిఫికెట్స్
  2. అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్
  3. లెటర్ ఆఫ్ రికమండేషన్
  4. స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్
  5. ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్
  6. స్పాన్సర్‌షిప్ లెటర్
  7. స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్
  8. పాస్‌పోర్ట్
Published date : 30 Jul 2019 03:15PM

Photo Stories