Skip to main content

కోర్సుకు తగ్గ కొలువైతేనే...అమెరికా వీసా!

అమెరికా.. విదేశీ విద్యార్థులకు మరో ఝలక్ ఇచ్చింది. యూఎస్‌లో ఉన్నత విద్యకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థులు పని అనుభవం పొందేందుకు వీలు కల్పించే ఓపీటీ(ఆఫ్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) ప్రక్రియను మరింత జటిలం చేసింది. గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ తమ మేజర్ సబ్జెక్టుకు సంబంధించిన విభాగంలోనే ఓపీటీ చేస్తున్నట్లు సంబంధిత విద్యాసంస్థ అధికారులు ధృవీకరించాలని స్పష్టం చేసింది. ఆ మేరకు సెప్టెంబర్ 27న తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఓపీటీ కొత్త మార్గదర్శకాలు.. భారతీయ విద్యార్థులపై వాటి ప్రభావం గురించి తెలుసుకుందాం...
అమెరికాలో కొత్త ఓపీటీ నిబంధనలు విదేశీ విద్యార్థులకు చుక్కలు చూపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆ దేశంలో వర్క్ వీసా పొందడం సంక్లిష్టంగా మారిందన్న అభిప్రాయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితిలో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు విడుదల చేసిన నూతన మార్గదర్శకాలు విదేశీ విద్యార్థులకు వర్క్‌వీసా ప్రక్రియను మరింత జటిలం చేశాయి. విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉన్నత చదువులకు వెళ్లేందుకు ఎఫ్-1 వీసా పొందుతారు. చదువు పూర్తికాగానే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) ప్రోగ్రాం ద్వారా ఒక ఏడాది పాటు వర్క్ ఎక్స్‌పీరియెన్స్ పొందే అవకాశం ఉంటుంది. స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) కోర్సుల విద్యార్థులకు ఓపీటీని మరో రెండేళ్లపాటు పొడిగించే వీలుంటుంది. తాజా నిబంధనలు స్టెమ్- ఓపీటీ ప్రోగ్రామ్ విద్యార్థులపైనే ఎక్కువగా ప్రభావం చూపే అవకాశముంది. ఎందుకంటే... స్టెమ్ ఓపీటీ విద్యార్థులు రెండేళ్ల పొడిగింపునకు దరఖాస్తు చేసుకునే సమయానికే ఉద్యోగంలో చేరి ఉంటారు. కాబట్టి కాలేజీ అధికారుల ధృవీకరణలో ఏదైనా తేడా వస్తే.. వీరు కష్టపడి సంపాదించుకున్న అవకాశం కోల్పోవాల్సి వస్తుంది. వర్క్ వీసా తిరస్కరణకు గురవుతుంది.
 
 కాలేజీ అధికారులకు బాధ్యత : 
 విదేశీ విద్యార్థుల వర్క్ ఎక్స్‌పీరియెన్స్‌ను లోతు గా పరిశీలించేలా ఇమ్మిగ్రేషన్ అధికారులు కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు. విద్యార్థులు కాలేజీలో మేజర్‌గా ఏ సబ్జెక్టులో పట్టా పొందారో... సదరు విభాగంలోనే పని చేస్తున్నట్లు నిరూపించుకోవాలంటూ.. విధానపరమైన గైడ్‌లైన్స్‌ను ప్రకటించారు. దాంతో ఓపీటీ ప్రోగ్రాంలో భాగంగా డిగ్రీలో చదివిన మేజర్ సబ్జెక్టుకు సంబంధించిన ఉద్యోగమే చేస్తున్నట్లు నిరూపించుకోవాల్సిన బాధ్యత విదేశీ విద్యార్థులపైనే పడింది. తాము చేస్తున్న ఓపీటీ తమ కోర్సుకు సంబంధించినదేనని సదరు విదేశీ విద్యార్థులు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అందుకోసం సరైన వివరణను సెవీస్(స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్-ఎస్‌ఈవీఐఎస్) వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. విద్యార్థి ఇచ్చే ఈ వివరణను డిజిగ్నేటెడ్ స్కూల్ అఫిషియల్స్(డీఎస్‌వో) సమీక్షించి ధృవీకరించాలని కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.
 
 సెవిస్ :
 అమెరికాలో సూడెంట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడూ నమోదు చేసే వెబ్‌సైట్.. సెవీస్(ఎస్‌ఈవీఐఎస్). ఇందులో పేర్కొనే సమాచారమే విద్యార్థి స్టేటస్ గురించి తెలుపుతుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం- విదేశీ విద్యార్థులు లేదా డీఎస్‌వోస్ సెవీస్‌లో వివరాలు నమోదు చేయాలి. ఒకవేళ సెవీస్‌లో స్టూడెంట్ నేరుగా వివరాలు నమోదు చేస్తే.. సదరు సమాచారాన్ని డీఎస్‌వోస్ ధృవీకరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా సంబంధిత ధృవపత్రాలు విద్యార్థి నుంచి తీసుకొని.. స్టూడెంట్ రికార్డులో భద్రపరిచే బాధ్యత డీఎస్‌వోలదేనని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు. ఒకసారి డీఎస్‌వో.. ఓపీటీ లేదా స్టెమ్- ఓపీటీకి సిఫార్సు చేస్తే.. సదరు విద్యార్థి బాధ్యత డీఎస్‌వోదే. ఓపీటీ ప్రోగ్రామ్‌కు ప్రతిపాదించిన విద్యార్థి వివరాలను ఎప్పటికప్పడు సెవీస్‌లో అప్‌డేట్ అయ్యేట్లు చూడాల్సింది డీఎస్‌వోలేనని మార్గదర్శకాలలో పేర్కొన్నారు.
 
 భవిష్యత్తులో తిప్పలు తప్పవు!
 సెవీస్‌లో ఇచ్చే వివరణ వల్ల భవిష్యత్తులో విద్యార్థులకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డీఎస్‌వో.. సెవీస్‌లో నమోదు చేసే జాబ్ టైటిల్ కారణంగా వర్క్‌వీసా హెచ్1బీ తిరస్కరణకు గురయ్యే ఆస్కారముందని చెబుతున్నారు. వాస్తవానికి ఓపీటీ పూర్తయ్యాక సదరు ఉద్యోగిని స్పాన్సర్ చేస్తూ హెచ్1బీ వీసా పొందేలా సంస్థలు సిఫారసు చేస్తాయి. అయితే డీఎస్‌వో.. సెవీస్‌లో నమోదు చేసే వివరాలు, కంపెనీ హెచ్1బీ వీసా దరఖాస్తులో పొందుపర్చే వివరాలు భిన్నంగా ఉంటే.. వర్క్‌వీసా తిరస్కరణకు గురవుతుంది. అంతేకాకుండా స్పెషాలిటీ ఆక్యు పేషన్‌గా లేని జాబ్ టైటిల్ పొందుపర్చినా.. వర్క్‌వీసా పొందే అవకాశం ఉండదని చెబుతున్నారు.
 
 భారతీయులపై ప్రభావం :
 ప్రస్తుతం అమెరికాలో సుమారు 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో స్టెమ్ కోర్సులు చదువుతున్న వారి సంఖ్య అధికం. 2017 గణాంకాల ప్రకారం-దాదాపు 50వేల మంది భారతీయ విద్యార్థులు ఓపీటీ ప్రోగ్రాం చేస్తున్నట్లు అంచనా. తాజా నిర్ణయంతో వీరందరిపైన ప్రభావం పడే అవకాశం ఉంది. కొత్త మార్గదర్శకాల వల్ల అక్కడి విద్యాసంస్థలకు కూడా ఆర్థికంగా భారం తప్పదు!!
Published date : 21 Oct 2019 02:15PM

Photo Stories