Skip to main content

హెచ్1బీ ఆశలు..ఇకగల్లంతేనా..!!

విదేశీ విద్య, ఉద్యోగం.. అనగానే భారతీయులకు ఠక్కున గుర్తుకొచ్చే గమ్యం.. అమెరికా! ప్రతి ఏటా లక్షల మంది యువత ఎలాగైనా యూఎస్‌లో అడుగుపెట్టాలని చేసే కసరత్తు అంతా, ఇంతా కాదు! కానీ.. ఇప్పుడు.. ఆ ఆశలన్నీ అడియాశలయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
అమెరికా కలలు కల్లలుగా మారనున్నాయే ఆందోళన వ్యక్తమవుతోంది. కారణం.. కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులే!! అమెరికాలో ఉద్యోగాలకు అవకాశం కల్పించే.. హెచ్-1బీ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ.. ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. దీనిపై మన దేశంతోపాటు, అమెరికాలోని సంస్థల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికన్స్ ఫస్ట్ నినాదంతో తెచ్చిన ఈ ఉత్తర్వుల కారణంగా హెచ్-1బీ, ఇతర వర్క్ వీసా ఔత్సాహికులే కాకుండా.. ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న వారిలో సైతం ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో..ట్రంప్ తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు.. లాటరీ విధానానికి స్వస్తి.. భారతీయ విద్యార్థులు, ఉద్యోగార్థులపై వాటి ప్రభావం గురించి విశ్లేషణ...

‘అమెరికాలో నిపుణులైన వారు ఉన్నప్పటికీ... ఇక్కడి సంస్థలు తక్కువ వేతనానికి లభించే ఇతర దేశాలకు చెందిన వారిని నియమించుకుంటున్నాయి. ఈ పరిస్థితికి స్వస్తి పలికి.. అమెరికన్లకు ఉద్యోగావకాశాలు కల్పించడమే ఈ ఉత్తర్వుల ముఖ్య ఉద్దేశం’- ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకం చేసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలివి!! ఇప్పటికే విదేశీ వీసాల విషయంలో కొనసాగుతున్న నిషేధాన్ని పొడిగిస్తూ.. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం లక్షల మంది భారతీయులపై ప్రభావం చూపనుంది. అమెరికన్స్ ఫస్ట్ పేరిట హెచ్-1బీ, ఇతర వర్క్ వీసాల పరంగా నిబంధనలు కఠినతరం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు మూడు లక్షల మందిపై ప్రభావం పడే పరిస్థితి కనిపిస్తోంది. వీరంతా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లాల్సిందేనా అనే ఆందోళనతో గడుపుతున్నారు.

కొత్త నిబంధనలు ఇవే..
  • విదేశీయులకు ఇచ్చే కనీస వార్షిక వేతన పరిమితి ఏకంగా 45 శాతానికి పెంపు.
  • {పస్తుతం 65వేల డాలర్ల వేతనంతో వీసా దరఖాస్తుకు అవకాశం ఉంది. తాజా ఉత్తర్వులతో కనీసం లక్షా పది వేల డాలర్ల వేతనం ఉంటేనే వీసా దరఖాస్తుకు అవకాశం లభిస్తుంది.
  • ఒకవేళ ఈ స్థాయి వేతనం పొందుతూ ఉద్యోగం చేస్తున్నా.. వీసా పునరుద్ధరణ కాలపరిమితిలో కుదింపు చేశారు.
  • సంస్థల ఉద్యోగులకు మూడేళ్లపాటు రెన్యువల్‌కు అవకాశం ఉంది.
  • కన్సల్టెన్సీల ద్వారా ఉద్యోగులకైతే ఏడాది కాలపరిమితితోనే వీసా పునరుద్ధరణకు వీలుంటుంది.
  • స్టూడెంట్ వీసాగా పేర్కొనే ఎఫ్-1 వీసా నిబంధనలు కూడా కఠినతరం చేశారు.
  • తాజా ఎఫ్-1 వీసా నిబంధనల ప్రకారం-విద్యార్థులు వారి కోర్సు కాల పరిమితి వరకే అమెరికాలో నివసించేందుకు అవకాశం ఉంటుంది. నాలుగేళ్ల వ్యవధిలోని కోర్సులో చేరితే నాలుగేళ్ల కాలపరిమితితోనే వీసా జారీ చేస్తారు. ఆ తర్వాత అక్కడ ఉండాలనుకుంటే వీసా పునరుద్ధరణకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఇలా విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకూ.. వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా భారతీయుల్లో ఇది కొంత ఎక్కువగా కనిపిస్తోంది.
మూడు లక్షల మంది..
{పస్తుతం హెచ్-1బీ వీసాపై పని చేస్తున్న వారిని పరిగణనలోకి తీసుకుంటే.. ఈ వీసాలు అత్యధికంగా భారతీయులకే జారీ అవుతున్నాయి. ప్రస్తుతం 2.8 లక్షల మంది అమెరికాలోని వివిధ ఐటీ సంస్థల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి వేతనాలు 60వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లలోపే ఉన్నాయి. కాని తాజా ఉత్తర్వుల ప్రకారం-కనీస వేతనం 1.10 లక్షల డాలర్లు ఉంటేనే హెచ్1బీ వీసా జారీ, పునరుద్ధరణకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న వీసా కాలపరిమితి ముగిశాక.. రెన్యువల్ చేసుకోవాలంటే.. 1.10 లక్షల డాలర్లకు వేతనం పెరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై అటు సంస్థలతోపాటు ఇటు ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఎఫ్-1 వీసాదారుల భవితవ్యం?!
ఎఫ్-1 వీసా ఆధారంగా అమెరికాలోని యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లోనూ ఆందోళన కనిపిస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం-2019లో 2,02,014 మంది ఎఫ్-1 వీసాపై ఆయా యూనివర్సిటీల్లో కోర్సులు అభ్యసిస్తున్నారు. తాజా నిబంధనల మేరకు-వారంతా కోర్సుల వ్యవధి ముగియగానే స్వదేశానికి తిరిగొచ్చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇకపై ఎలక్ట్రికల్, మెకానికల్ లేదా సివిల్ ఇంజనీరింగ్ చేసినవారిని ఐటీ ఉద్యోగాలకు అనుమతించరు. ఐటీ కోర్సుల విద్యార్థులకే వీసాలు జారీ చేయనున్నారు. దీంతో అమెరికాలో ఏదో ఒక ఎంఎస్ డిగ్రీ చేసి..ఐటీ ఉద్యోగం దక్కించుకోవాలనే వారి ఆశలు అడియాశలయ్యే పరిస్థితి తలెత్తనుంది. ప్రస్తుతం అమెరికా వర్సిటీల్లో చదువుతున్న భారతీయుల్లో సగం మంది నాన్-ఐటీ కోర్సులే అభ్యసిస్తున్నారు. ఇప్పుడు వీరి భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది.

ఓపీటీ.. హెచ్-1 ఆశలూ గల్లంతు...
వాస్తవానికి అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులు.. తమ కోర్సులు పూర్తయిన తర్వాత ఓపీటీగా పిలిచే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) పేరిట నిర్దిష్ట కాల వ్యవధిలో అక్కడే ఉండి సంస్థల్లో పని చేసే అవకాశం ఉంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత ఏడాది పాటు ఏదైనా సంస్థలో ఓపీటీ చేయొచ్చు. స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) కోర్సుల విద్యార్థులు మరో రెండేళ్లు ఓపీటీ గడువు పొడిగించుకొని.. మొత్తం 36 నెలలు ఏదైనా సంస్థలో పని చేసే వీలు ఉంది. ఆ తర్వాత శాశ్వత కొలువు సొంతం చేసుకుంటే.. సంస్థ యాజమాన్యం సాయంతో హెచ్-1బీ పిటిషన్ ద్వారా వర్క్‌వీసా దక్కించుకునే వెసులుబాటు ఉంది. కానీ తాజా నిబంధనలతో ఈ ఆశలు కూడా గల్లంతవుతాయనే ఆందోళన విద్యార్థుల్లో కనిపిస్తోంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం-2019లో 84,630 మంది భారతీయ విద్యార్థులు ఓపీటీ విధానంలో ఆయా సంస్థల్లో పని చేస్తున్నారు.

అమెరికన్లకు నష్టం నిజమేనా..!
{rంప్ సంతకం చేసిన తాజా ఉత్తర్వుల ప్రధాన ఉద్దేశం.. స్థానిక ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వడం. నిపుణులైన మానవ వనరులు ఉన్నప్పటికీ.. సంస్థలు తక్కువ వేతనానికి లభిస్తున్నారనే కారణంతో విదేశీయులను నియమిస్తున్నాయని.. దానివల్ల అమెరికన్లకు అవకాశాలు తగ్గిపోతున్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ వాస్తవానికి.. అమెరికాలో స్టెమ్ విభాగాల్లో నిపుణుల కొరత 30శాతం మేర కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ కారణంగానే అక్కడి సంస్థలు విదేశీయులను నియమించుకుంటున్నాయి.

లాటరీకి స్వస్తి పలికితే..
{పస్తుతం హెచ్-1బీ వీసా మంజూరు క్రమంలో లాటరీ పద్ధతిని అవలంబిస్తున్నారు. దీని ప్రకారం.. ప్రతీ ఏటా లాటరీ విధానంలో 65 వేలు, మరో 20 వేల వీసాలు అత్యున్నత నైపుణ్యం కలిగిన ఉద్యోగాలకు సంబంధించి.. మొత్తం 85 వేల హెచ్-1బీ వీసాలు మంజూరు చేస్తున్నారు. వీటిలో 70శాతం మేర భారతీయులకే లభిస్తున్నాయి. ఇక నుంచి లాటరీ విధానాన్ని రద్దు చేసి.. ప్రతిభ ఆధారంగా ఇవ్వాలని తాజాగా నిర్ణయించారు. దీంతో కనీస వేతనంగా పేర్కొన్న 1.10 లక్షల డాలర్ల కంటే తక్కువ వేతనం పొందితే హెచ్-1బీ వీసా మంజూరు కాదు.

సంస్థలు ఏమంటున్నాయి..
తాజా నిబంధనలపై అటు అమెరికన్ కంపెనీలతోపాటు అమెరికాలో కార్యాలయాలున్న మన దేశానికి చెందిన సంస్థలు, కన్సల్టెన్సీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా.. తాజా నిబంధనలతో ప్రతి ఏటా వీసాలు రెన్యువల్ చేసుకోవాల్సి రావడం కన్సల్టెన్సీ ఉద్యోగులకు భారం కానుంది. ఒకసారి హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేయాలంటే.. వీసా ఫీజు, అటార్నీ ఖర్చులన్నీ కలిపి 7-8 వేల డాలర్ల వరకు ఖర్చవుతుంది. దీనిపై సంస్థల నుంచి, ఉద్యోగుల నుంచి పెద్దయెతున్న వ్యతిరేకత కనిపిస్తోంది.

టెక్ దిగ్గజాల వ్యతిరేకత..
తాజా ఉత్తర్వులపై అమెరికాలోని టెక్ దిగ్గజ సంస్థలు గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ సంస్థలు అత్యధికంగా స్పాన్సర్ చేస్తూ విదేశీయుల్ని నియమించుకుంటున్నాయి. ఇక అమెరికాలో ఉన్న భారతీయ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటివి కూడా తక్కువ వేతనాలకే భారతీయ టెకీలను నియమించుకుంటున్నాయి. తాజా ఉత్తర్వులతో సాఫ్ట్‌వేర్ కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకోలేవు. అధిక వేతనాలు ఇచ్చి అమెరికన్లను నియమించుకోవాల్సి ఉంటుంది.

{rంప్ ఉత్తర్వులు ..
ముఖ్యాంశాలు..
  • హెచ్-1బీ వీసా నిషేధం డిసెంబర్ వరకు పొడిగింపు.
  • ఇక ప్రతిభ ఆధారంగానే వీసాల మంజూరు.
  • కనీస వేతనం 1.10 లక్షల డాలర్లు ఉంటేనే హెచ్-1బీ వీసా దరఖాస్తుకు అర్హత.
  • వీసా మంజూరులో లాటరీ విధానానికి స్వస్తి పలికే దిశగా అడుగులు.
  • ఎఫ్-1 వీసా విధానంలోనూ మార్పులు.
  • 2 లక్షలకు పైగా ఉద్యోగులు, మరో 2 లక్షలకుపైగా భారతీయ విద్యార్థుల్లో ఆందోళన.
  • ఓపీటీ అవకాశాలకు కత్తెర. ప్రస్తుతం ఓపీటీ విధానంలో పని చేస్తున్న దాదాపు 85 వేల మంది భారతీయ విద్యార్థులు.
  • ఈ ఏడాది హెచ్-1బీ వీసా పొందిన భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు 70 వేల మంది డిసెంబర్ తర్వాత తిరిగొచ్చేయాల్సిన పరిస్థితి.
{పత్యామ్నాయాలపై దృష్టి ..
 {పస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో విదేశీ విద్య, ఉద్యోగ ఔత్సాహికులు అమెరికానే గమ్యంగా భావించి.. దానికే పరిమితం కాకుండా.. ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టిపెట్టాలి. టెక్ గ్రాడ్యుయేట్స్‌కు కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలు కొంత అనుకూలమని పేర్కొనొచ్చు. ఈ దేశాలు కూడా స్థానికులకే ప్రాధాన్యం అనే విధానంతో ఉన్నప్పటికీ.. అక్కడి అవకాశాలు,అనుసరిస్తున్న ఇమిగ్రేషన్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటే.. వర్క్ వీసా, పోస్ట్ స్టడీ వర్క్ పరంగా అమెరికా కంటే కొంత సులభంగా అవకాశాలు దక్కించుకోవచ్చు.
      - ఆలపాటి శ్రీకర్, గ్లోబల్ ట్రీ అకాడమీ
Published date : 03 Nov 2020 02:06PM

Photo Stories