Skip to main content

డ్రీమర్స్‌.. డ్రీమ్‌ యాక్ట్‌...

డీఏసీఏ.. డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ ఎరైవల్స్‌ చిన్నప్పుడే తల్లిదండ్రులతో పాటు అమెరికాలో అడుగుపెట్టినవారు అక్కడే అధికారికంగా తాత్కాలికంగా నివసించేందుకు అవకాశం కల్పిస్తూ ఒబామా ప్రభుత్వం 2012లో తీసుకొచ్చిన చట్టం. దీనికింద ఇప్పటికే దాదాపు 8 లక్షల మంది అనుమతి పొందారు. కానీ.. ట్రంప్‌ ప్రభుత్వం 2018 మార్చి నుంచి ఈ విధానానికి స్వస్తి పలకనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం.. డీఏసీఏ ద్వారా డ్రీమర్స్‌ (స్వాప్నికుల) హోదాలో అమెరికాలో నివసిస్తున్న లక్షల మందిపై, దాదాపు 20 వేల మంది భారతీయులపైనా ప్రభావం చూపనుంది.
డ్రీమ్‌ యాక్ట్‌–2017.. నిబంధనలతో నివాస హోదా...
డ్రీమర్స్‌గా పేర్కొనేవారికి.. ప్రతిపాదిత ఈ చట్టం ప్రకారం పలు నిబంధనలతో ఎనిమిదేళ్ల పాటు అమెరికాలో నివసించే వీలు లభిస్తుంది. అక్కడి ఉన్నత విద్యా సంస్థల నుంచి కనీసం రెండేళ్ల వ్యవధి, మంచి అకడమిక్‌ రికార్డ్‌తో చదువు లేకపోయినా, నిబంధనల్లో పేర్కొన్న విధంగా మిలటరీ సర్వీస్‌లో కనీస కాల వ్యవధి (రెండేళ్లు) పూర్తి చేయకపోయినా.. నిర్దేశిత మూడేళ్ల వ్యవధిలోని ఉద్యోగ విధుల్లో 75 శాతం సమయం వెచ్చించకపోయినా.. ఈ నివాస హోదాను తొలగించే అధికారం సెక్రటరీ లేదా అటార్నీ జనరల్‌కు ఉంటుంది. డ్రీమ్‌ యాక్ట్‌కు అనుమతి లభించిన తొంభై రోజుల్లోగా హోంల్యాండ్‌ సెక్రటరీ.. సంబంధిత నిబంధనలతో కూడిన జాబితాను విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానించాలి.
త్వరలో రద్దు కానున్న డీఏసీఏ.. ప్రతిపాదిత డ్రీమ్‌ యాక్ట్‌.. ఈ రెండు చట్టాలు అమెరికాలో నివసిస్తున్న విదేశీయులను ఉద్దేశించినవి. అసలు మొదట డీఏసీఏ ఎందుకొచ్చింది..? తాజాడ్రీమ్‌ యాక్ట్‌ వివరాలేమిటి..? అగ్ర రాజ్య స్వాప్నికుల (డ్రీమర్స్‌) ముందున్న ప్రత్యామ్నాయమేమిటి..? తెలుసుకుందాం..!
డీఏసీఏ అంటే ఏమిటి?
 • ఉద్యోగం, ఉపాధి వెదుక్కుంటూ అమెరికాలో అడుగుపెట్టిన విదేశీయుల పిల్లలు తాత్కాలికంగా ఉండేందుకు, చదువుకునేందుకు, ఉద్యోగం చేసుకునేందుకు 2012లో అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రవేశపెట్టిన కార్యక్రమమే.. డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ ఎరైవల్స్‌ (డీఏసీఏ).
 • ఇది ఒకవిధంగా వారిని అక్రమ వలసదారులుగా పేర్కొనే విధానానికి స్వస్తి పలికే ఉద్దేశం.
 • ఎలాంటి నేర చరిత్ర లేనివారు, దేశ భద్రతకు ముప్పుగా పరిణమించనివారు, విద్యార్థులై ఉండి లేదా పాఠశాల విద్య చదివినవారు, లేదా అమెరికా మిలిటరీ సర్వీస్‌ పూర్తి చేసినవారు తగిన రుజువులతో ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోం ల్యాండ్‌ సెక్యూరిటీ’, ఇమిగ్రేషన్‌ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి.
 • అంతా సంతృప్తికరంగా ఉంటే తొలుత రెండేళ్లు అమెరికాలోనే ఉండేందుకు అనుమతి వస్తుంది. తర్వాత మరో రెండేళ్లు ఉండేలా రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. కొనసాగింపు కోరుకుంటే.. తొలి కాల పరిమితి ముగియడానికి నాలుగు నెలల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి.
 • అనుమతి వచ్చినవారు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేందుకు, కళాశాలల్లో చేరేందుకు, వర్క్‌ పర్మిట్‌ పొందేందుకు అర్హులు.
ఎవరీ డ్రీమర్స్‌..?
 • డీఏసీఏ కార్యక్రమం ద్వారా రక్షణ పొందినవారే ‘డ్రీమర్స్‌’. ట్రంప్‌ ప్రభుత్వం.. రెండు వారాల క్రితం రద్దు ప్రకటన చేసేనాటికి మొత్తం 7,87,580 మంది దీనికింద అనుమతి తీసుకుని ఉన్నారు.
 • డీఏసీఏ అమల్లోకి వచ్చిన తేదీ 2012 జూన్‌ 15. అప్పటికి 31 ఏళ్లు లోపువారంతా దరఖాస్తుకు అర్హులు. అయితే.. వీరు 16 ఏళ్ల వయసుకు ముందే అమెరికాలో అడుగుపెట్టి ఉండాలి. 2007 జూన్‌ నుంచి అక్కడే నివసిస్తుండాలి.
 • డ్రీమర్స్‌లో ఎక్కువమంది మెక్సికో, ఎల్‌సాల్వెడార్, గ్వాటెమాలా, çహోండూరస్‌కు చెందినవారు. వీరిలో అధిక శాతం కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, న్యూయార్క్‌లలో ఉంటున్నారు.
 • వైట్‌హౌస్‌ అంచనా ప్రకారం– డ్రీమర్స్‌ సగటు వయసు 15 ఏళ్ల నుంచి 31 ఏళ్ల మధ్యలో ఉంది.

అలా ఎందుకు పిలుస్తున్నారు?
డెవలప్‌మెంట్, రిలీఫ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఎలైన్‌ మైనర్స్‌ (డ్రీమ్‌).. బాల్యంలోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికా వచ్చినవారికి శాశ్వత నివాస అర్హత కల్పించే ఉద్దేశంతో ఒక చట్టానికి ఆమోదం కోసం 2001 నుంచి ప్రయత్నాలు జరిగాయి. అయితే అమెరికా చట్ట సభ కాంగ్రెస్‌ ఆమోదం పొందడంలో పలుసార్లు చుక్కెదురైంది. ఈ నేపథ్యంలోనే ఒబామా ప్రభుత్వం 2012లో కార్య నిర్వాహక విధాన నిర్ణయం (ఎగ్జిక్యూటివ్‌ పాలసీ డెసిషన్‌) ద్వారా డీఏసీఏను ఆమోదించింది. దీని పరిధిలోకి వచ్చేవారినే డ్రీమర్స్‌ అని పిలుస్తున్నారు.

డీఏసీఏ రద్దు.. భారతీయులపై ప్రభావం...

 • 2018 మార్చి నుంచి డీఏసీఏ రద్దు అమల్లోకి వస్తుందని ట్రంప్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ చట్టం కోసం ప్రయత్నించేందుకు కాంగ్రెస్‌కు ఆరు నెలల గడువిచ్చింది.
 • ఇప్పటికే అనుమతి తీసుకుని అమెరికాలో నివసిస్తూ.. 2018 మార్చి 5 నాటికి తొలి విడత కాలపరిమితి ముగియనున్నవారు అక్టోబర్‌ అయిదో తేదీలోపు కొనసాగింపునకు దరఖాస్తు చేసుకునే వీలుంది. లేకుంటే.. స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందే.
 • ఈ నిర్ణయంతో మొత్తం 8 లక్షల మందిపై ప్రభావం పడనుంది. భారతీయుల విషయానికి వస్తే తక్షణమే ఏడు వేల మంది, అమలు తర్వాత ఇరవై వేల మంది ప్రతికూలతకు గురయ్యే పరిస్థితి నెలకొంది.
 • పదిహేను, ఇరవై ఏళ్ల కిందటే ఉపాధి కోసం అమెరికా వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వీరంతా 25 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు వయసులోనే వెళ్లడం, అప్పుడే వివాహాలు చేసుకోవడం, పిల్లలు పుట్టడం, వారిని అమెరికాలోనే చదివిస్తుండటం గమనార్హం.
కొత్తగా.. డ్రీమ్‌ యాక్ట్‌–2017...
డీఏసీఏకు స్వస్తి పలుకుతున్న నేపథ్యంలో.. సెనేటర్లు లిండ్సే గ్రాహమ్, డిక్‌ డర్బిన్‌ ‘డ్రీమ్‌ యాక్ట్‌–2017’ పేరుతో ప్రత్యామ్నాయ చట్టాన్ని ప్రతిపాదించారు. మరో ఇద్దరు సెనేటర్లు బలపరిచారు. దీనికి ఆమోదం లభించాక.. డ్రీమర్స్‌ ఆశలు నిలుస్తాయా..? ఆచరణాత్మక ఇబ్బందులు ఎదురవుతాయా? అనేది తేలే అవకాశముంది. డ్రీమ్‌ యాక్ట్‌ ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు..
 • ఈ ప్రతిపాదన చట్టంగా రూపొందేనాటికి నాలుగేళ్ల ముందు నుంచి అమెరికాలో నివసిస్తున్నవారికి అనుమతిచ్చే అధికారం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీకి ఉంటుంది.
 • దరఖాస్తుదారులు పదిహేడేళ్లు లేదా అంతకంటే తక్కువ వయసులోనే అమెరికాలో అడుగుపెట్టి ఉండాలి.
 • ఏదైనా హై స్కూల్‌లో విద్యనభ్యసిస్తుండటం.. లేదా డిగ్రీ లేదా డిప్లొమా అర్హతలు కలిగినవారై ఉండాలి.
అవసరమైన డాక్యుమెంట్లు ...
డ్రీమ్‌ యాక్ట్‌ ద్వారా అమెరికాలో నివాస హోదా పొందాలనుకునే వారు ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దరఖాస్తుతో జత చేయాల్సిన డాక్యుమెంట్లు..
 • నిబంధనల మేరకు నిర్ణీత వయసులోపే అమెరికాలో ఉన్నట్లు రుజువులు
 • అమెరికాలో అడుగుపెట్టిన సమయానికి సంబంధించిన ఆధారాలు
 • హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం ఖరారైనట్లు చూపే పత్రాలు
 • హైస్కూల్, డిప్లొమా, జనరల్‌ ఎడ్యుకేషనల్‌ డెవలప్‌మెంట్‌ సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్‌
 • ఏదైనా కోర్సులో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వివరాలు
 • ఉద్యోగం ఖరారైనట్లు రుజువు చేసే డాక్యుమెంట్లు
వేల కుటుంబాల్లో ఆందోళన...
డ్రీమ్‌ యాక్ట్‌ను ప్రతిపాదించినప్పటికీ.. అమెరికాలో నివసిస్తున్న వేల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. భారతీయులనే పరిగణనలోకి తీసుకుంటే దాదాపు యాభై వేలమందికి ఇప్పుడు డీఏసీఏ రద్దు నిర్ణయం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పిల్లలకు దూరం కావలసి వస్తుందేమోనని గ్రీన్‌కార్డ్‌ హోల్డర్స్‌ బెంగ పడుతున్నారు. డ్రీమ్‌ యాక్ట్‌ నిబంధనలు, విధి విధానాలు చూసి నిరాశకు గురవుతున్నారు. తమ పిల్లలకు అనుమతి లభించకపోతే పరిస్థితి ఏమిటి? అనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది.
Published date : 02 Oct 2017 03:43PM

Photo Stories