Skip to main content

అమెరికాలో బీటెక్

స్టడీ అబ్రాడ్ ఔత్సాహికుల తొలి ప్రాధాన్యం.. యూఎస్! అక్కడ కోర్సు పూర్తిచేస్తే తిరుగులేని కెరీర్ సొంతమవుతుందని భావించి, ఏటా లక్షల మంది ఆ దిశగా ప్రయత్నిస్తుంటారు. వీరిలో అధిక శాతం మంది లక్ష్యం.. ఎంఎస్, ఎంబీఏ! అయితే అమెరికాలో యూజీ కోర్సులు చేయడానికి కూడా అవకాశాలు అనేకం. మరికొద్ది నెలల్లో యూఎస్ వర్సిటీల్లో స్ప్రింగ్ సీజన్ అడ్మిషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమెరికాలో బీటెక్ అవకాశాలు.. అనుసరించాల్సిన విధానాలపై విశ్లేషణ..
బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ(బీటెక్).. భారత్‌లో ఎంతో క్రేజ్ ఉన్న కోర్సు. ఐఐటీల వంటి ఉన్నత విద్యాసంస్థల్లో సీటు కోసం తీవ్ర పోటీ ఉంటుంది. దాంతో అమెరికాలోని యూజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే భారత్ విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. 2015 నాటికి అమెరికాలో 9 లక్షలకు పైగా విదేశీ విద్యార్థులు ఉండగా, వారిలో భారత విద్యార్థుల సంఖ్య 1,32,888. వీరిలో 15-18 శాతం మంది యూజీ కోర్సుల విద్యార్థులు! వీరిలో 80 శాతం మంది ఇంజనీరింగ్‌కు సంబంధించిన వారు కాగా, మిగిలిన వారు సైన్స్ కోర్సులు చేస్తున్నవారు.

యూఎస్‌లో బీటెక్‌కు మార్గం
యూఎస్‌లో బీటెక్‌లో ప్రవేశించాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి. అవి.. మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్‌లతో 70 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత.
  • స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్)లో స్కోర్.
  • శాట్ సబ్జెక్టు టెస్ట్‌ల్లో స్కోర్ (కొన్ని ప్రముఖ యూనివర్సిటీలకు మాత్రమే)
  • ACT (American College Testing)

శాట్, ఏసీటీ పరీక్షల విధానం
శాట్ పరీక్షలో మూడు విభాగాలుంటాయి. అవి.. రీడింగ్ (52 ప్రశ్నలు), రైటింగ్ అండ్ లాంగ్వేజ్ టెస్ట్ (44 ప్రశ్నలు); మ్యాథమెటిక్స్ (58 ప్రశ్నలు). మూడు గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. అదనంగా మరో 50 నిమిషాల్లో ఒక ఎస్సే రాయాలి. ఇది అభ్యర్థుల ఛాయిస్ మాత్రమే. 1600 పాయింట్లకు గరిష్ట స్కోరింగ్ ఉంటుంది. ఇందులో 50 శాతం మ్యాథమెటిక్స్‌కే!. విద్యార్థులు 1200 పాయింట్లు సాధిస్తే ప్రముఖ యూనివర్సిటీల్లో దరఖాస్తుకు అర్హత లభిస్తుంది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న కోర్సుకు అనుగుణంగా అనుబంధ సబ్జెక్టుల్లో పరిజ్ఞానాన్ని పరిశీలించేందుకు శాట్ సబ్జెక్టు టెస్ట్‌లు నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్, సైన్స్, బయాలజీ, ఫిజికల్ సైన్స్ తదితర 21 సబ్జెక్టుల్లో ఉండే శాట్ సబ్జెక్ట్ టెస్ట్‌లో ప్రతి సబ్జెక్ట్ పరీక్షకు 800 పాయింట్ల స్కోర్ ఉంటుంది. శాట్ పరీక్షను ఏటా ఏడుసార్లు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎన్నిసార్లయినా రాసుకోవచ్చు. అయితే రెండు కంటే ఎక్కువ అటెంప్ట్‌లు ఇస్తే దరఖాస్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందనే అభిప్రాయముంది.

అమెరికన్ కాలేజ్ టెస్టింగ్
అమెరికాలోని కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే మరో పరీక్ష.. అమెరికన్ కాలేజ్ టెస్టింగ్. ఇందులో ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, రీడింగ్ ఎబిలిటీ, సైన్స్ విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగంలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా 1 నుంచి 36 పాయింట్ల స్కోర్ కేటాయిస్తారు. ఈ పాయింట్ల శ్రేణిలో 25 పాయింట్లు సొంతం చేసుకుంటే.. ప్రముఖ కళాశాలల్లో ప్రవేశించేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ పరీక్షను ఏటా ఆరుసార్లు నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం
తొలుత అమెరికా విదేశీ వ్యవహారాల అధికారిక వెబ్‌సైట్ ఆధారంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీల జాబితాను పరిశీలించాలి. ఆయా యూనివర్సిటీలు-అవసరమైన అర్హతలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆ తర్వాత శాట్ లేదా ఏసీటీ టెస్ట్‌లకు సన్నద్ధం కావాలి. ఆ స్కోర్ల ఆధారంగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి.

దరఖాస్తుతోపాటు అందించాల్సిన పత్రాలు..
  • విద్యార్హతల సర్టిఫికెట్లు ఠ స్టాండర్ట్ టెస్ట్ స్కోర్ కార్డులు
  • కోర్సు ట్యూషన్ ఫీజు, కోర్సు వ్యవధిలో అమెరికాలో నివసించేందుకు అయ్యే వ్యయాలకు సరిపడినంతగా ఆర్థిక వనరులున్నాయనే రుజువులు.
  • స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ (సదరు కోర్సులో, నిర్దిష్టంగా సదరు ఇన్‌స్టిట్యూట్‌నే ఎంపిక చేసుకోవడానికి కారణాలు, ఆ ఇన్‌స్టిట్యూట్ అర్హతలు, ఇతర ప్రమాణాలకు తాము ఎలా సరితూగుతామో తెలియజేస్తూ రాసే స్టేట్‌మెంట్)
  • లెటర్ ఆఫ్ రికమండేషన్

వీసా ఎలా
ప్రవేశం ఖరారు చేసిన ఇన్‌స్టిట్యూట్ ఐ-20 పేరుతో అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ పంపుతుంది. దాని ఆధారంగా విద్యార్థులు ఎఫ్-1 వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తును పరిశీలించిన అధికారులు నిర్దేశిత తేదీలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థి ఇచ్చిన సమాధానాలకు సంతృప్తి చెందితే వీసా లభిస్తుంది. ఈ వీసా కాల పరిమితి కోర్సు వ్యవధి మేరకు ఉంటుంది. ఎఫ్-1 వీసా పొందిన వారు కోర్సు పూర్తయ్యాక 2 నెలలు అమెరికాలో ఉండే విధంగా నిబంధనలో వెసులుబాటు ఉంది. అదేవిధంగా ఎఫ్-1వీసా ఆధారంగా యూజీ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు ఆ అర్హతతో అమెరికాలోనే మరో ఇన్‌స్టిట్యూట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశం పొందితే.. మరో ఐ-20 ఫామ్ ఆధారంగా వీసా పొడిగింపు కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫీజులు, వ్యయాలు
యూనివర్సిటీలను బట్టి ఫీజుల్లో వ్యత్యాసాలున్నాయి. టాప్-10 యూనివర్సిటీల్లో వార్షిక ఫీజు 40-47 వేల డాలర్లు ఉంది. ఉండటానికి, రవాణా, ఆహారం తదితర అవసరాలకు నెలకు 10 వేల డాలర్ల వరకు అవసరం. కొన్ని యూనివర్సిటీలు, ప్రభుత్వ విభాగాలు అందిస్తున్న స్కాలర్‌షిప్‌లను సద్వినియోగం చేసుకోవాలి. ఉదా: ఏఏసీఈ ఇంటర్నేషనల్ స్కాలర్‌షిప్స్, ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్..
  • ద అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఉమెన్ (విద్యార్థినులకు) వంటి స్కాలర్‌షిప్స్ కోసం ప్రయత్నించొచ్చు. కొన్ని యూనివర్సిటీలు మెరిట్ కమ్ మీన్ బేస్డ్ విధానంలో తొలి సెమిస్టర్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నాయి.

యూఎస్-టాప్ వర్సిటీలు
  • మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
  • ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ
  • కాలిఫోర్నియా యూనివర్సిటీ
  • హార్వర్డ్ యూనివర్సిటీ
  • మిచిగాన్ యూనివర్సిటీ
  • స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ
  • యూనివర్సిటీ ఆఫ్ షికాగో
  • కొలంబియా యూనివర్సిటీ
  • యేల్ యూనివర్సిటీ
  • కార్నెగీ మిలన్ యూనివర్సిటీ

విద్యార్థులు ప్రతి యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
www.usnews.com, educationusa.state.gov

Education Newsయూఎస్‌లో అండర్‌గ్రాడ్యుయేట్ చదవాలనుకునే విద్యార్థులు.. అడ్మిషన్ సెషన్ ప్రారంభానికి కనీసం 8 నెలల ముందు నుంచి ఆ దిశగా అడుగులు వేయాలి. హాజరు కావాల్సిన ప్రామాణిక పరీక్షలు, యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్‌లపై రెండు నెలల్లో అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో దరఖాస్తు చేసుకోవడానికి ఆర్నెల్ల సమయం అందుబాటులో ఉంటుంది. శాట్, ఏసీటీ పరీక్షల విషయంలో ఆందోళన అనవసరం. ఈ ఏడాది శాట్‌లో చేసిన మార్పులు విద్యార్థులకు అనుకూలంగా ఉన్నాయి.
- రుచి థోమర్, డీజీఎం, మాన్యా ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్.
Published date : 07 Jun 2016 03:08PM

Photo Stories