Skip to main content

సింధూ నాగరికత

సింధూ నాగరికత లేదా హరప్పా నాగరికతను క్రీ.శ.1921లో కనుగొన్నారు. ఆనాటి పురావస్తు శాఖ అధిపతి సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో ఈ నాగరికత గురించి తెలుసుకోవడానికి తవ్వకాలు జరిగాయి. మనదేశంలో ఈ నాగరికత ఆనవాళ్లు లభించే ప్రాంతాలు ఎక్కువగా గుజరాత్‌లో ఉన్నాయి. క్రీ.పూ. 3000 నుంచి క్రీ.పూ. 1500 వరకు సింధూ నాగరికత విరాజిల్లింది. క్రీ.పూ. 2500 నుంచి క్రీ.పూ.1750 వరకు ఈ నాగరికత ఉన్నత దశలో ఉంది. హరప్పా నాగరికతకు కేంద్రస్థానం సింధూ నది. సింధు ప్రజలు కాంస్య యుగానికి చెందినవారు. వీరిది పట్టణ నాగరికత. ఈ కాలంలోనే తొలి నగరీకరణ జరిగింది. ఈ నాగరికత 12,99,600 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉత్తరాన జమ్మూ నుంచి దక్షిణాన నర్మద వరకూ, పశ్చిమాన బెలూచిస్థాన్ కోస్ట్‌లోని మాక్రాన్ నుంచి ఈశాన్యంలో మీరట్ వరకు వ్యాపించి ఉంది. ఆ కాలంలో ప్రపంచంలో ఏ నాగరికతా ఇంత పెద్ద విస్తీర్ణంలో వ్యాపించి లేదు. తవ్వకాల్లో మొదట బయటపడిన నగరం హరప్పా. పలు ధాన్యాగారాల ఉనికి కూడా హరప్పాలోనే లభ్యమైంది. హరప్పా సంస్కృతికి చెందిన కాళీభంగన్ రాజస్థాన్‌లో ఉంది. మొహంజొదారో, చన్హుదారో, బన్వాలీ, లోథాల్.. నాటి ఇతర ప్రసిద్ధ నగరాలు. మొహంజొదారో అతి పెద్ద పట్టణం. మత, కర్మకాండలకు ఉపయోగించిన అద్భుత స్నానఘట్టం, పెద్ద ధాన్యాగారం, గుర్రాల ఉనికి తెలియజేసే అస్పష్టమైన సాక్ష్యాధారాలు కూడా ఇక్కడే లభ్యమయ్యాయి.

నిర్మాణ శైలి

ప్రజలు కాల్చిన ఇటుకలతో ఇళ్లను నిర్మించుకున్నారు. పాలక వర్గాల భవనాలకు విశేష రక్షణ కల్పిస్తూ గోడలు నిర్మించారు. దిగువన సామాన్యుల గృహాలు ఉండేవి. సామాన్యుల ఇళ్లు రెండు గదులు, సంపన్నుల ఇళ్లు ఐదారు గదులతో విశాలంగా ఉండేవి. ప్రతి ఇంటికీ బావి, పెద్ద ఇళ్లకు మరుగుదొడ్లు ఉండేవి. అద్భుతమైన భూగర్భ డ్రైనేజీ ఉంది. మురుగు కాల్వలపై ఇటుకలను కప్పి ఉంచేవారు. ఈ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను సింధూ నాగరికత ప్రత్యేకతగా చెప్పవచ్చు. లోథాల్ పట్టణాన్ని ఇటుకలతో కృత్రిమంగా నిర్మించారు. సింధూ ప్రజలు స్నానప్రియులు. అందుకే మొహంజొదారోలో మహాస్నానవాటికను నిర్మించారు. ఇది ఇటుకలతో రూపుదిద్దుకుంది. 180 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు కలిగి 8 అడుగుల లోతులో ఇది నిర్మితమైంది. స్నానవాటిక అడుగుభాగం నీరు ఇంకిపోకుండా జిప్సమ్ - బిటూమెస్ పదార్థాలతో నిర్మించారు. హరప్పాలో అతిపెద్ద ధాన్యాగారాన్ని నిర్మించారు. దశాంశ పద్ధతిని కొలతలకు ఉపయోగించారు. ‘ఇంగ్లిఘ బాండ్’ అని పిలిచే తాపీ పనిని ప్రవేశపెట్టిందీ వీరే.

వ్యవసాయం

సింధు ప్రజలకు నాగలి తెలియదు. భూములను దున్నకుండా తవ్వేవారు. దీని కోసం తేలికపాటి గొర్రును ఉపయోగించేవారు. వ్యవసాయం కోసం నీటిని నిల్వ చేయడానికి గబర్ బంద్‌ల (డ్యామ్‌లు) నిర్మించారు. నాడు ప్రధాన పంటలు గోధుమ, బార్లీ. వరి పండించినట్లు లోథాల్, రంగాపూర్‌ల్లో ఆధారాలు లభించాయి. తివాచీల తయారీకి పత్తిని ముఖ్యంగా ఉపయోగించారు. దీన్ని బట్టి వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం అని తెలుస్తోంది.

మత విశ్వాసాలు

సింధూ ప్రజలు ఎక్కువగా అమ్మతల్లిని అంటే శక్తిని ఆరాధించేవారు. పశుపతి అనే పురుష దేవుడిని కూడా కొలిచేవారు. పశుపతిని ముద్రిక ద్వారా తెలుసుకోవచ్చు. ఒక వేదికపై కూర్చున్న ముఖాల మూర్తి, ఆ వేదికను ఆవరించి ఏనుగు, పులి, ఖడ్గ మృగం, మహిషం ఉండేవి. రావి చెట్టు, స్వస్తిక్ గుర్తు, జంతువులు, చెట్లు, సర్పాలను కూడా పూజించేవారు. మూపురంతో కూడిన ఎద్దు వీరికి ఇష్టమైన జంతువు. లింగపూజ వీరితోనే ప్రారంభమైంది. జంతువులను బలిచ్చేవారు. వీరికి తెలియని జంతువు గుర్రం. వేదాల ఆధారంగా శివారాధన, శక్తి పూజ, లింగారాధన వంటివి సింధూ నాగరికత వారసత్వాలుగా చెప్పుకోవచ్చు.

బొమ్మల లిపి

సింధూ ప్రజల లిపి బొమ్మల లిపి. దీన్ని 1853లో కనుగొన్నారు. ఇది స్వదేశీ లిపి. దీన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. ఒక వరుసను ఎడమ నుంచి కుడికి, తర్వాత వరుసను కుడి నుంచి ఎడమకు రాసేవారు. ఈ విధానాన్ని ‘సర్పలేఖనం’ అంటారు. ఇది మెసపటోమియా, ఈజిప్ట్ దేశాల ప్రాచీన లిపిని పోలి ఉంది.

వేషధారణ

సింధూ ప్రజలు గొప్ప అలంకార ప్రియులు. స్త్రీ, పురుష భేదం లేకుండా ఆభరణాలు ధరించేవారు. కాటుక, పెదవులకు రంగులు, సుగంధ లేపనాలు వాడేవారు. స్త్రీలు జడలు, ముడులు వేసుకునేవారు. దంతపు దువ్వెనలు, అద్దాలు ఉపయోగించేవారు. బంగారం, వెండి, రాగి పూసలు, ఎముకలు, కొమ్ము, గవ్వలతో ఆభరణాలు తయారు చేసేవారు. సింధూ ప్రజలు వాడిన వస్త్రాలతో కూడిన మూట ఉమ్మాలో దొరికింది. నృత్యం, వేట, జూదం ముఖ్య వినోదాలు.

వ్యాపార సంబంధాలు

నాడు ప్రధాన రేవు పట్టణం లోథాల్. విదేశీ వ్యాపారం ఇక్కడ నుంచే ప్రారంభమైంది. మొట్టమొదటిసారిగా రాగి వ్యాపారం జరిగింది. వ్యాపారం కాంబే గల్ఫ్ నుంచి ప్రారంభమై అరేబియా సముద్ర తీరం వెంట కొనసాగుతూ పర్షియన్ గల్ఫ్ మీదుగా యూఫ్రీట్స్ ఉత్తర ప్రాంతానికి సముద్ర మార్గం ద్వారా చేరుకునేది. ప్రధానంగా సుమేరియన్లు, బహ్రెయిన్ దేశస్తులతో వ్యాపారం చేసేవారు. తూనికలు, కొలతలు ఉపయోగించేవారు. రాగి ఖనిజాన్ని ఖేత్రి (రాజస్థాన్), వెండి (అఫ్ఘానిస్థాన్), బంగారం (కోలార్)ల నుంచి పొందారు. ఇనుము వాడకం వీరికి తెలియదు. వీరి ప్రధాన ఎగుమతులు.. కాటన్ వస్త్రాలు, టెర్రాకోట వస్తువులు, వస్త్రాలు, కుండలు, పాత్రలు (పాటరీ).

ప్రజలు వాడిన వస్తువులు

కుమ్మరి చక్రాన్ని మొట్టమొదటిసారి మెహార్‌ఘర్‌లో క్రీ.పూ 4000లో ఉపయోగించారు. మృణ్మయ పాత్రలపై సరళరేఖలు, రావిచెట్టు ఆకులను పోలిన గుర్తులు, నెమళ్లు, చేపలు, జింక మొదలైనవి కనిపిస్తాయి. మనిషి బొమ్మలు చాలా అరుదు. మట్టి బొమ్మల్లో వృషభం బొమ్మలు ఎక్కువగా బయటపడ్డాయి.

నమ్మకాలు- విశ్వాసాలు

ఎవరైనా చనిపోయినప్పుడు అంతిమ సంస్కారాలు చేసేటప్పుడు తల ఉత్తర దిక్కుకు ఉండేట్లుగా ఖననం చేసేవారు. సమాధుల్లో ఉంచిన అద్దాలు, ముత్యాలు, కుండల వంటి వస్తువుల ఆధారంగా నాటి ప్రజలకు పునర్జన్మపై విశ్వాసం ఉండేదని తెలుస్తోంది.

సింధూ నాగరికత.. ప్రజలను నాగరికులుగా తీర్చిదిద్దింది. దీని ఆవిర్భావానికి ఏ విధమైన విదేశీ నాగరికతా కారణం కాదని, పూర్వపు హరప్పా నాగరికతలు కాలక్రమేణ పరిణితి చెంది సింధూ నాగరికతగా ఏర్పడ్డాయనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది చరిత్రకారులు, పురావస్తు శాస్త్రజ్ఞులు సమర్థిస్తున్నారు. సింధూ నాగరికత అంతరించడం ఒక వెనుకడుగని ‘కోశాంభి’ అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డారు.

మాదిరి ప్రశ్నలు

 1. సింధూ నాగరికత భారతదేశంలో ఏ ప్రాంతాల్లో విస్తరించింది?
  1) ఉత్తర ప్రాంతం
  2) తూర్పు ప్రాంతం
  3) పశ్చిమ ప్రాంతం
  4) 1, 3
 2. మొహంజొదారోను స్థానిక ప్రజలు ఏమని పిలుస్తారు?
  1) పూర్వీకుల దేవాలయం
  2) క్రీడా ప్రాంగణం
  3) మృతుల దిబ్బ
  4) ఏవీకాదు
 3. హరప్పా నాగరికత ఏ సంవత్సరంలో బయటపడింది?
  1) క్రీ.శ. 1912
  2) క్రీ.శ. 1921
  3) క్రీ.శ. 1922
  4) క్రీ.శ. 1925
 4. సింధు ప్రజలకు ఇష్టమైన జంతువు?
  1) ఎద్దు
  2) ఒంటె
  3) గుర్రం
  4) ఏనుగు
 5. గుజరాత్‌లో జరిగిన తవ్వకాల్లో కొత్తగా బయటపడిన హరప్పా నగరం ఏది?
  1) ధోలవీర
  2) ఖాండియ
  3) కుంటాసి
  4) మాండా
 6. సింధూ ప్రజల ప్రధాన రేవు పట్టణం లోథాల్ ఏ రాష్ర్టంలో ఉంది?
  1) గుజరాత్
  2) మహారాష్ర్ట
  3) పంజాబ్
  4) రాజస్థాన్
 7. సింధూ ప్రజలు ముద్రికలను దేనితో తయారు చేశారు?
  1) చెక్క
  2) కంచు
  3) స్టియటైట్ (మెత్తని రాయి)
  4) మట్టి
 8. సింధూ నగరాల్లో గృహ నిర్మాణానికి ఏ వస్తువులను ఉపయోగించారు?
  1) కాల్చిన ఇటుకలు
  2) వెదురు
  3) చెక్క
  4) గ్రానైట్
 9. హరప్పా సంస్కృతి నిర్మాతలెవరు?
  1) సుమేరియన్లు
  2) ఆర్యులు
  3) ద్రావిడులు
  4) ఆస్ట్రలాయిడ్‌లు
 10. హరప్పా, మెసపటోమియాల మధ్య వర్తక కేంద్రంగా ఉన్న ప్రాంతమేది?
  1) మెలూహా
  2) సుమేరియా
  3) చన్హుదారో
  4) కాళీభంగన్
 11. సింధూ ప్రజల వస్త్రాల మూటను ఏ మెసపటోమియా నగరంలో కనుగొన్నారు?
  1) ఉర్
  2) కిష్
  3) టెల్
  4) ఉమ్మా
 12. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించిన నాగరికత ఏది?
  1) మెసపటోమియా
  2) చైనా
  3) సింధూ
  4) పర్షియా
 13. గుర్రం అవశేషాలు బయటపడిన సింధూ ప్రాంతం?
  1) సుర్కోటడా
  2) లోథాల్
  3) చన్హుదారో
  4) బన్వాలీ
 14. ఒంటె ఆనవాళ్లు లభ్యమైన సింధూ నగరం ఏది?
  1) కాళీభంగన్
  2) లోథాల్
  3) హరప్పా
  4) మొహంజొదారో
 15. హరప్పా ప్రజలకు తెలిసిన లోహాలేవి?
  1) రాగి
  2) లెడ్
  3) టిన్
  4) అన్నీ
 16. అమ్మతల్లి ఆరాధకులైన సింధూ ప్రజలు పూజించిన పురుష దేవుడెవరు?
  1) ఇంద్రుడు
  2) విష్ణువు
  3) బ్రహ్మ
  4) పశుపతి
 17. లోథాల్, చన్హుదారో పట్టణాలు ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందాయి?
  1) నౌకా నిర్మాణం
  2) పూసల తయారీ
  3) నేత పరిశ్రమ
  4) లోహ పరిశ్రమ
 18. హరప్పా తవ్వకాల్లో బయటపడిన ఆయుధం?
  1) ఖడ్గం
  2) ఈటె
  3) గొడ్డలి
  4) బల్లెం
 19. సింధూ లిపితో పోలికలు గల భారతీయ లిపి?
  1) పాళీ
  2) బ్రాహ్మి
  3) ద్రవిడియన్
  4) ఖరోష్టి
 20. సింధూ ప్రజల కళాభివేశాన్ని ప్రతిఫలించే నాట్యకత్తె కాంస్య విగ్రహం ఎక్కడ లభించింది?
  1) మొహంజొదారో
  2) హరప్పా
  3) చన్హుదారో
  4) కాళీభంగన్
 21. సింధూ లోయ నాగరికత ఏ కాలానికి చెందింది?
  1) క్రీ.పూ. 3000
  2) క్రీ.పూ. 4000
  3) క్రీ.పూ. 1000
  4) క్రీ.పూ. 4500
 22. హరప్పా సంస్కృతికి చెందిన కాళీభంగన్ ఏ రాష్ర్టంలో ఉంది?
  1) గుజరాత్
  2) రాజస్థాన్
  3) హర్యానా
  4) ఉత్తరప్రదేశ్
 23. మహాస్నాన వాటిక ఏ నగరంలో ఉంది?
  1) హరప్పా
  2) లోథాల్
  3) మొహంజొదారో
  4) చన్హుదారో
 24. హరప్పా ప్రజల ప్రధాన వృత్తి?
  1) పశుపోషణ
  2) వ్యవసాయం
  3) వ్యాపారం
  4) మత్స్య గ్రహణం
 25. సింధూ ప్రజలకు తెలియని జంతువు?
  1) కుక్క
  2) ఆవు
  3) ఎద్దు
  4) గుర్రం
 26. అతిపెద్ద ధాన్యాగారం ఎక్కడ ఉంది?
  1) హరప్పా
  2) లోథాల్
  3) ధోల్‌వీర
  4) రంగాపూర్
 27. హరప్పా ప్రజలు ఆరాధించింది?
  1) అమ్మతల్లి
  2) పశుపతి, లింగం
  3) జంతువు, సర్పాలు, చెట్లు
  4) అన్నీ
 28. సింధూ ప్రజల లిపి?
  1) ప్రాకృతం
  2) సంస్కృతం
  3) బొమ్మల
  4) ద్రావిడ
 29. వీటిలో తొలి నగరీకరణగా పేరు పొందింది?
  1) ఆర్య నాగరికత
  2) సింధూ నాగరికత
  3) షోడశ జనపదాలు
  4) మగధ రాజ్య స్థాపన

సమాధానాలు

1) 4 2) 3 3) 2 4) 1 5) 1 6) 1 7) 3 8) 1 9) 3 10) 1
11) 4 12) 3 13) 1 14) 1 15) 4 16) 4 17) 2 18) 1 19) 3 20) 1
21) 1 22) 2 23) 3 24) 2 25) 4 26) 1 27) 4 28) 3 29) 2
Published date : 10 Jan 2015 03:50PM

Photo Stories