Skip to main content

విలువ సిద్ధాంతం

మార్కెట్.. వస్తువులు, సేవల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించింది. ఇక్కడ వస్తు సేవల ధరలను నిర్ణయిస్తారు. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రజలు వినియోగించాలంటే ముందుగా మారకం జరగాలి. వస్తువులు, సేవల అమ్మకాలు, కొనుగోళ్లను మారకం లేదా వినిమయం అంటారు.
నేటి ఆధునిక కాలంలో సమాచార వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం వల్ల ‘నిర్ణీత ప్రదేశం’ అవసరం లేకుండానే అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఉత్తరాలు, ఏజెన్సీలతోపాటు టెలిఫోన్, ఫ్యాక్స్, ఇంటర్నెట్, కంప్యూటర్లు తదితర సౌకర్యాల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
మార్కెట్ వర్గీకరణలో మూడు ప్రధాన అంశాలున్నాయి. మార్కెట్‌లోని వస్తువు, ఆ వస్తువుకున్న అమ్మకందార్ల సంఖ్య, కొనుగోలుదారుల సంఖ్యలు మొదటి అంశం. ఒక వస్తువు ఎంత భౌగోళిక విస్తీర్ణానికి విస్తరించి ఉంది అనేది రెండో అంశం. డిమాండ్‌కు అనుగుణంగా సప్లయ్ ఏ విధంగా మార్కెట్‌లో సర్దుబాటు అవుతుందనేది మూడో అంశం. ఇది వివిధ కాలవ్యవధులపై ఆధారపడి ఉంటుంది.

పోటీని బట్టి మార్కెట్లు:
పోటీని బట్టి మార్కెట్లు రెండు విధాలుగా ఉన్నాయి. అత్యధిక సంఖ్యలో అమ్మకందార్లు, కొనుగోలుదార్లు ఈ మార్కెట్‌లో ఉంటారు. ఇక్కడి పరిస్థితులు పోటీని పెంచేలా ఉంటాయి. ఈ మార్కెట్‌ను సంపూర్ణ పోటీ అంటారు. పరిమితమైన సంఖ్యలో ఉత్పత్తిదార్లు, కొనుగోలుదార్లు ఉండే మార్కెట్‌ను అసంపూర్ణ పోటీ అంటారు. ఉత్పత్తిదార్ల సంఖ్య ఆధారంగా ఇవి ఏకస్వామ్యం, ఏకస్వామ్య పోటీ, పరిమితస్వామ్య మార్కెట్‌లుగా ఉన్నాయి.

స్థలాన్ని, ప్రదేశాన్ని బట్టి మార్కెట్లు:
స్థలాన్ని బట్టి స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లుగా వర్గీకరించారు. ఇవి ఒక వస్తువు పరిమాణం లేదా ఎంతమేరకు మార్కెట్ ఉందో తెలుపుతాయి. కొన్ని వస్తువులకు పరిమిత విస్తీర్ణంలో కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతాయి. మరికొన్నింటికి వివిధ దేశాల్లో విస్తృత మార్కెట్ ఉంటుంది. మన్నిక ఆధారంగా ఒక వస్తువుకు మార్కెట్ విస్తీర్ణం, డిమాండ్ ఉంటుంది.

కాలాన్ని బట్టి మార్కెట్లు:
ఒక వస్తువు సప్లయ్‌లో సర్దుబాట్లను అనుసరించి మార్కెట్లున్నాయి. కాల వ్యవధి ప్రకారం వస్తువు సప్లయ్‌లో మార్పులు జరుగుతాయి. దీన్ని బట్టి మూడు రకాల మార్కెట్లు ఉన్నాయి. అవి అతి స్వల్పకాలిక, స్వల్పకాలిక, దీర్ఘకాలిక మార్కెట్లు.

సంపూర్ణ పోటీ మార్కెట్:
అమ్మకందార్లు, కొనుగోలుదార్ల మధ్య పోటీ సంపూర్ణంగా లేదా పరిపూర్ణంగా ఉంటే దానిని సంపూర్ణ పోటీ మార్కెట్ లేదా పరిపూర్ణ పోటీ మార్కెట్ అంటారు. ఈ మార్కెట్లో ఒక కాలంలో ఒక వస్తువుకు ఒకే ధర ఉంటుంది. మార్కెట్లో నిర్ణయమైన ధరనే అమ్మకందార్లు, కొనుగోలుదార్లు అంగీకరిస్తారు. సజాతీయ వస్తువులుంటాయి. సంస్థల స్వేచ్ఛా ప్రవేశం, నిష్ర్కమణ, ఉత్పత్తి కారకాల గమనశీలత, సంపూర్ణ జ్ఞానం, రవాణా ఖర్చులు, పోటీ ప్రకటనలు ఉండవు. సగటు రాబడి (అఖ) రేఖ గీ అక్షానికి సమాంతరంగా ఉంటుంది.
సంపూర్ణ పోటీ మార్కెట్‌లో డిమాండ్, సప్లయ్‌లు వస్తువు సమతౌల్యధరను నిర్ణయిస్తాయి. ఉత్పత్తిదార్లు సప్లయ్‌ను.. కొనుగోలుదార్లు మార్కెట్ డిమాండ్‌ను నిర్ణయిస్తారు. ఏ ధర వద్ద సప్లయ్, డిమాండ్ సమానం అవుతాయో ఆ ధరను సమతౌల్యధర అంటారు.
నిర్ణీత కాలంలో వివిధ ధరల వద్ద కొనుగోలు చేసే వస్తు పరిమాణాన్ని వైయక్తిక డిమాండ్ అంటారు. ఈ ధరను మార్కెట్లో కొనుగోలుదార్లు ఏ పరిమాణంలో కొంటారో దాన్ని డిమాండ్ అంటారు. వస్తుధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ధర పెరిగితే కొనుగోలుదార్లు తక్కువ వస్తువులను డిమాండ్ చేస్తారు.
వివిధ ధరల వద్ద ఉత్పత్తిదార్లు లేదా అమ్మకందార్లు ఎంత పరిమాణాన్ని విక్రయించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తారో దాన్ని సప్లయ్ అంటారు. ధర పెరిగితే సప్లయ్‌ను అమ్మకందార్లు పెంచుతారు. ధర తగ్గితే సప్లయ్‌ను తగ్గిస్తారు.
సమతౌల్య ధర వద్ద అమ్మకందార్ల, కొనుగోలుదార్ల మధ్య వస్తురాశి వినిమయం జరుగుతుంది. ఆ వస్తురాశిని సమతౌల్య వస్తురాశి అంటారు. వస్తువు ధరను డిమాండ్, సప్లయ్‌లు నిర్ణయిస్తాయి. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకంగా ఉంటాయి.
ధరపై సప్లయ్, డిమాండ్‌ల్లో ఏది ఎక్కువ ప్రభావం చూపుతుందనే అంశాన్ని మార్కెట్ కాల వ్యవధి ఆధారంగా విశ్లేషించారు. కాలవ్యవధిని మార్షల్ 3 రకాలుగా వర్గీకరించారు. అవి..
1) మార్కెట్ కాలం
2) స్వల్పకాలం
3) దీర్ఘకాలం
  • మార్కెట్ కాలంలో సప్లయ్ స్థిరంగా ఉంటుంది. డిమాండ్ పెరిగితే ధర పెరుగుతుంది. డిమాండ్ తగ్గితే ధర తగ్గుతుంది. దీన్ని బట్టి మార్కెట్ కాలంలో ధర మీద డిమాండ్ ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు.
  • స్వల్పకాలంలో.. ఒక ఉత్పత్తి సంస్థ తన వద్ద ఉన్న పరికరాలను, యంత్రాలను ఉపయోగించుకొని ఎక్కువ ముడిపదార్థాలను, శ్రామికులను నియమించి ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. స్థిర సాధనాలను పెంచడానికి అవకాశం లేనందున సప్లయ్‌ని అనుకున్నంత పరిమాణంలో సాధించలేకపోతుంది.
  • దీర్ఘకాలంలో ఎక్కువ ఉత్పాదక శక్తి కలిగిన కొత్త యంత్రాలను ప్రవేశపెట్టి డిమాండ్ పెరిగిన మేరకు సప్లయ్‌ని పెంచవచ్చు. ఈ కాలంలో అన్ని సాధనాలు చర సాధనాలే. అందువల్ల అన్ని వ్యయాలు చర వ్యయాలే. దీర్ఘకాలంలో డిమాండ్ పెరిగిన మేరకు సప్లయ్ పెరుగుతుంది.

సంపూర్ణ పోటీ మార్కెట్‌లో సమష్టి డిమాండ్, సమష్టి సప్లయ్‌లు కలిసి సమతౌల్య ధరను నిర్ణయిస్తాయి. పరిశ్రమలో నిర్ణయించిన ధరను ప్రతి సంస్థ స్వీకరిస్తుంది. ధరను బట్టి సంస్థ తయారుచేసే వస్తురాశి నిర్ధారితం అవుతుంది. ప్రతి సంస్థ సమతౌల్యం పొందడానికి ప్రయత్నం చేస్తుంది. ఉపాంత వ్యయం, ఉపాంత రాబడి సమానంగా ఉండాలి (MC = MR). MC రేఖ MR రేఖను కింది నుంచి ఖండిస్తూ పైకి పోవాలి.

అసంపూర్ణ పోటీ మార్కెట్:
ఏకస్వామ్యాన్ని ఆంగ్లంలో ‘మోనోపాలి’ అంటారు. ‘మోనోపాలి’ అంటే ఒకే ఒక అమ్మకందారుడు ఉండే మార్కెట్ అని అర్థం. ఒకే అమ్మకందారుడు ఉండి సమీప ప్రత్యామ్నాయాలు లేని మార్కెట్‌ను ఏకస్వామ్య మార్కెట్ అంటారు. దీన్నే గుత్తాధిపత్య మార్కెట్ అని కూడా అంటారు. ఉత్పత్తి తరహా, ముడి పదార్థాల సప్లయ్, పేటెంట్ హక్కులు, ప్రభుత్వ విధానాలు మొదలైన అంశాలు ఏకస్వామ్య సంస్థ కొనసాగడానికి సహకరిస్తాయి.

మాదిరి ప్రశ్నలు

  1. ఏకస్వామ్య పోటీ సిద్ధాంతం ఎవరిది?
    1) కార్‌నాట్
    2) చాంబర్లిన్
    3) రాబిన్‌సన్
    4) పాల్ స్వీజీ
  2. ఒకే ఒక అమ్మకందారు ఉన్న మార్కెట్?
    1) ద్విదాధిపత్యం
    2) పరిమితస్వామ్యం
    3) శుద్ధ ఏకస్వామ్యం
    4) ఏదీకాదు
  3. సంస్థ తన వస్తు అమ్మకాలను పెంచుకోవడానికి చేసే వ్యయాలను ఏమంటారు?
    1) అమ్మకపు వ్యయాలు
    2) అవకాశ వ్యయాలు
    3) అప్రకటిత వ్యయాలు
    4) ప్రకటిత వ్యయాలు
  4. పరిమితస్వామ్యాన్ని వివరించిన ఆర్థికవేత్త ఎవరు?
    1) అగస్టిన్
    2) కార్‌నాట్
    3) మార్షల్
    4) పాల్ స్వీజీ
  5. ఆగ్‌మార్క్‌ ముద్ర ఏ వస్తువులకు చెందింది?
    1) వ్యవసాయ వస్తువులు
    2) వినియోగ వస్తువులు
    3) మూలధన వస్తువులు
    4) పైవన్నీ
  6. ఒక సంస్థ ధరను పెంచితే మిగతా సంస్థలు ధరను పెంచని మార్కెట్ ఏది?
    1) ఏకస్వామ్యం
    2) ద్విదాధిపత్యం
    3) పరిమిత స్వామ్యం
    4) ఏకస్వామ్యపోటీ
  7. అసంపూర్ణ పోటీలో భాగం కానిదేది?
    1) ఏకస్వామ్యం
    2) సంపూర్ణపోటీ
    3) పరిమిత స్వామ్యం
    4) ద్విదాధిపత్యం
  8. ధరల దృఢత్వం ఉన్న మార్కెట్?
    1) మోనోపాలి
    2) సంపూర్ణపోటీ
    3) డ్యుయోపాలి
    4) పరిమితస్వామ్యం
  9. ద్విదాధిపత్యాన్ని గురించి వివరించిన ఆర్థిక వేత్త ఎవరు?
    1) మార్షల్
    2) రికార్డో
    3) స్వీజీ
    4) కార్‌నాట్
  10. సంస్థకు స్వల్పకాలంలో లాభాలు ఎలా ఉంటాయి?
    1) సామాన్యంగా
    2) గరిష్టంగా
    3) స్థిరంగా
    4) కనిష్టంగా
  11. వ్యాపార ప్రకటనలపై చేసే ఖర్చు వేటికి సంబంధించింది?
    1) అమ్మకపు వ్యయాలు
    2) అవకాశ వ్యయాలు
    3) అప్రకటిత వ్యయాలు
    4) ప్రకటిత వ్యయాలు
  12. దీర్ఘకాలంలో కూడా అత్యధిక లాభాలను ఆర్జించే మార్కెట్ ఏది?
    1) ఏకస్వామ్యం
    2) పరిమిత స్వామ్యం
    3) ద్విదాధిపత్యం
    4) పైవన్నీ
  13. కిందివానిలో డిమాండ్‌ను బట్టి ఏర్పడని మార్కెట్ ఏది?
    1) అంతర్జాతీయ మార్కెట్
    2) స్థానిక మార్కెట్
    3) జాతీయ మార్కెట్
    4) సంపూర్ణ పోటీ మార్కెట్
  14. సగటు వ్యయ కనిష్ట బిందువునేమంటారు?
    1) స్థిరవ్యయం
    2) అభిలషణీయ ఉత్పత్తి
    3) చర వ్యయం
    4) ఏదీకాదు
  15. కొద్దిమంది అమ్మకందార్లు ఉండి అనేక మంది కొనుగోలుదార్లు ఉన్న సంస్థ ఏది?
    1) ద్విదాధిపత్యం
    2) ఏకస్వామ్యం
    3) పరిమిత స్వామ్యం
    4) ఏదీకాదు
  16. ఉత్పత్తి వ్యయం, అమ్మకపు వ్యయాలు లేని మార్కెట్ ఏది?
    1) ఏకస్వామ్య పోటీ
    2) పరిమిత స్వామ్యం
    3) ద్విదాధిపత్యం
    4) ఏదీకాదు
  17. ఏకస్వామ్యంలో రాబడి రేఖలు ఏ విధంగా ఉంటాయి?
    1) స్థిరంగా
    2) ధనాత్మకంగా
    3) రుణాత్మక వాలు
    4) ఏదీకాదు
  18. గరిష్ట లాభాలను సంస్థ ఏ కాలంలో ఆర్జిస్తుంది?
    1) అతిదీర్ఘకాలం
    2) దీర్ఘకాలం
    3) స్వల్పకాలం
    4) పైవన్నీ
  19. సన్నిహిత ప్రత్యామ్నాయాలు లేని వ్యవస్థ ఏది ?
    1) ఏకస్వామ్యం
    2) ఏకస్వామ్యపోటీ
    3) పరిమిత స్వామ్యం
    4) ద్విదాధిపత్యం
  20. సంపూర్ణ పోటీలో ధర నిర్ణయం ఏ విధంగా జరుగుతుంది?
    1) సప్లయ్
    2) సమష్టి సప్లయ్, సమష్టి డిమాండ్ కలిసి
    3) డిమాండ్
    4) ఏదీకాదు
  21. ఏకస్వామ్య పోటీలో సంస్థకు స్వల్ప కాలంలో వచ్చేవి?
    1) నష్టాలు
    2) గరిష్ట లాభాలు
    3) గరిష్ట లాభాలు, నష్టాలు
    4) సామాన్య లాభాలు
  22. ఇటుకలకు ఉండే డిమాండ్ ఏది?
    1) అంతర్జాతీయ
    2) స్థానిక
    3) జాతీయ
    4) ఏదీకాదు
  23. మార్కెట్ కాలంలో సప్లయ్?
    1) సాపేక్ష వ్యాకోచత్వం
    2) సాపేక్ష అవ్యాకోచత్వం
    3) పూర్తి అవ్యాకోచత్వం
    4) పూర్తి వ్యాకోచత్వం
  24. జాతీయ డిమాండ్ లేని వస్తువు ఏది?
    1) గోధుమ
    2) పంచదార
    3) వస్త్రాలు
    4) చేపలు
  25. మార్కెట్ల వర్గీకరణలో ఉండే అంశాలు?
    1) ఐదు
    2) మూడు
    3) నాలుగు
    4) ఏదీకాదు
  26. ధర నాయకత్వం ఉన్న ఆర్థిక మార్కెట్‌కు ఉదాహరణ?
    1) ఏకస్వామ్య పోటీ
    2) పరిమిత స్వామ్యం
    3) పరిపూర్ణ పోటీ
    4) ద్విసామ్యం

సమాధానాలు

1) 2 2) 3 3) 1 4) 4 5) 1 6) 3 7) 2 8) 4 9) 4 10) 2
11) 1 12) 1 13) 4 14) 2 15) 2 16) 3 17) 3 18) 3 19) 1 20) 2
21) 3 22) 2 23) 3 24) 4 25) 2 26) 2
Published date : 11 Feb 2015 06:19PM

Photo Stories