అర్థశాస్త్రం - పరిధి
Sakshi Education
- అర్థశాస్త్రం అనే పదం గ్రీకు భాషలోని 'OIKOS', 'NEMEIN' అనే రెండు పదాల నుంచి ఆవిర్భవించింది. OIKOS అంటే ఇల్లు, NEMEIN అంటే నిర్వహణ. గృహ, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో నైపుణ్యమని అర్థం. అర్థశాస్త్ర పితామహుడు ‘ఆడమ్‌స్మిత్’ అర్థశాస్త్రాన్ని సంపదకు సంబంధించిన శాస్త్రంగా నిర్వచించారు. ఆయనకు ముందు అర్థశాస్త్రాన్ని రాజనీతి ఆర్థిక వ్యవస్థగా పిలిచేవారు. ఆడమ్ స్మిత్ రచించిన ‘దేశాల సంపద, స్వభావం, కారణాల పరిశోధన’ 1776లో ప్రచురితమైన తర్వాత అర్థశాస్త్రం ప్రత్యేక శాస్త్రంగా రూపొందింది. ‘సామాజిక శాస్త్రాల్లో అర్థశాస్త్రం రాణి వంటిది’ అని పాల్ శామ్యూల్‌సన్ పేర్కొన్నారు.
- మానవుడు, అతని శ్రేయస్సును గురించి అధ్యయనం చేసే శాస్త్రం.. అర్థశాస్త్రమని ఆల్‌ఫ్రెడ్ మార్షల్ నిర్వచించారు.
- అమర్త్యసేన్ - సంక్షేమ ఆర్థిక శాస్త్రం గురించి వివరించారు. ఆడమ్ స్మిత్‌తో సహా సంప్రదాయ ఆర్థికవేత్తలందరూ అర్థశాస్త్రం సంపదకు సంబంధించిన శాస్త్రమని అభిప్రాయపడ్డారు. అర్థశాస్త్రానికి ఒక నిర్దిష్టమైన నిర్వచనాన్ని ఇచ్చిన మొదటి వ్యక్తి ఆడమ్‌స్మిత్. సంపద నిర్వచనాన్ని బలపర్చినవారు జె.బి.సే, జె.ఎస్.మిల్, వాకర్ మొదలైన ఆర్థికవేత్తలు. ఆడమ్ స్మిత్ సంపదకు అధిక ప్రాముఖ్యతను ఇవ్వగా మార్షల్ శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. కార్లే, రస్కిల్‌లు సంపద నిర్వచనాన్ని విమర్శిస్తూ కేవలం సంపద అనే ఒకే విషయాన్ని గురించి చర్చించే శాస్త్రం శాస్త్రమే కాదని అది ఒక శూన్య శాస్త్రమని పేర్కొన్నారు. లయోనెల్ రాబిన్‌స 1932లో ప్రచురించిన ప్రఖ్యాత పుస్తకం ‘యాన్ ఎస్సే ఆన్ ది నేచర్ అండ్ సిగ్నిఫికెన్‌స ఆఫ్ ఎకనామిక్ సైన్‌స’ లో వనరుల కొరతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.
- పరిధి: అర్థశాస్త్రం ముఖ్యంగా సంపదకు సంబంధించిన శాస్త్రం. మానవుడు కోర్కెలను సంతృప్తి పర్చుకోవడానికి ధనాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాడో తెలియచేస్తుంది. మానవుల కోర్కెలు తీర్చే వస్తు సేవల ఉత్పత్తి ఎలా జరుగుతుంది? తయారైన వస్తువులు మార్కెట్ల ద్వారా వ్యక్తులకు ఎలా చేరతాయి? వాటి ధరలను ఎలా నిర్ణయిస్తారు వంటి విషయాలను అర్థశాస్త్రం తెలుపుతోంది. ఉద్యోగిత, ఆదాయ పంపిణీ, ధరల పెరుగుదల, వస్తుమార్పిడి మొదలైన అంశాల్లో వ్యక్తులు, ప్రభుత్వ ప్రవర్తనను అర్థశాస్త్రం వివరిస్తుంది. ఆధునిక కాలంలో అర్థశాస్త్ర ప్రాముఖ్యత పరిధి పెరిగింది.
ప్రాముఖ్యత, ఆవశ్యకత
- అర్థశాస్త్రం ఒక సామాజిక, మానవీయ శాస్త్రం. ఇది శాస్త్రరూపం దాల్చి 200 ఏళ్లే అయినప్పటికీ దీన్ని ‘సామాజిక శాస్త్రాల రాణి’గా పరిగణిస్తున్నారు. ఈ శాస్త్రంలో విశేషమైన ప్రతిభ కనబర్చిన వారికి 1969 నుంచి అత్యున్నత పురస్కారమైన నోబెల్ బహుమతి ఇస్తున్నారు. మనదేశానికి చెందిన భారతరత్న అవార్డు గ్రహీత అమర్త్యసేన్‌కు 1998లో నోబెల్ బహుమతి లభించింది. ప్రస్తుత ప్రణాళికా యుగంలో ఆర్థికాభివృద్ధికి ఈ శాస్త్ర అధ్యయనం ఎంతో ఉపయోగకరం. భవిష్యత్ ఆర్థికాభివృద్ధికి, వనరుల సమతౌల్య వినియోగానికి అర్థశాస్త్రం ఉపయోగపడుతుంది. దేశ ఆర్థిక వనరులు పరిమితంగా ఉంటాయి. కాబట్టి ఆర్థిక వనరులను వినియోగ వస్తువుల తయారీకి ఎక్కువగా ఖర్చు చేస్తే ఆర్థికాభివృద్ధికి అవసరమైన వస్తువుల తయారీకి కావాల్సిన వనరుల కొరత ఏర్పడుతుంది. అందువల్ల వనరుల వాడకంలో సమతూకాన్ని పాటించాల్సి ఉంది.
- వస్తువుకు ఉండే కోరికలను తీర్చగలిగే శక్తిని ఉపయోగ విలువ అంటారు. ఉదాహరణకు గాలి, నీరు, ఆహారం, వస్త్రం, ఇల్లు, కారు వీటన్నింటికీ ఉపయోగ విలువ ఉంటుంది.
- ఒక వస్తువు కొనుగోలు శక్తిని వినిమయ విలువ అంటారు. ఇది ఆ వస్తువు మారక విలువకు సంబంధించింది. అర్థశాస్త్రంలో మారక విలువ ఉన్న వస్తువులను అధిక వస్తువులు అంటారు. ఉత్పత్తి అయిన వస్తు సేవలు వాటి ఉత్పత్తికి కారణమైన కారకాల మధ్య ఎలా సరఫరా అవుతాయో పంపిణీ తెలుపుతుంది. భూమికి, శ్రమకు, మూలధనాలకు చెల్లించే ప్రతిఫలాలు వరుసగా భాటకం, వేతనం, వడ్డీ. వ్యవస్థాపనకు చెల్లించే ప్రతిఫలం లాభాలు.
- వివిధ ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా వ్యక్తులకు ఆదాయం వస్తుంది. ద్రవ్య రూపంలో వచ్చే ఆదాయాన్ని ‘ద్రవ్య ఆదాయం’ అంటారు. ద్రవ్య ఆదాయాన్ని అది కొనుగోలు చేయగల వస్తు సేవల రూపంలో చెప్పినట్లయితే దాన్ని ‘నిజ ఆదాయం’ అంటారు.
- ఆర్థిక వ్యవస్థలో అమలులో ఉన్న వేతనస్థాయి వద్ద పనిలో చేరడానికి ఇష్టపడిన వారందరికీ పని కలిగించగలిగే స్థితిని ‘సంపూర్ణ ఉద్యోగిత’ స్థితి అంటారు.
- నార్వేలోని ఓస్లో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రాగ్నర్ ఫ్రిష్ 1933లో మొదటిసారిగా సూక్ష్మ, స్థూల అర్థశాస్త్రాలు అనే భావనలను అభివృద్ధి చేశారు. అర్థ శాస్త్రంలో నోబెల్ బహుమతిని 1969 నుంచి ఇస్తున్నారు. మొదటి విజేత రాగ్నర్ ఫ్రిష్.
- సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ‘మైక్రాస్’ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. మైక్రో అంటే చిన్న అని అర్థం. సూక్ష్మ అర్థశాస్త్రం వైయక్తిక ఆర్థిక యూనిట్లను అధ్యయనం చేస్తుంది. దీనికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించిన వారు మార్షల్. ఆయన రచించిన గ్రంథం ‘ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఎకనామిక్స్’. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ధరల సిద్ధాంతం అని కూడా అంటారు.
- స్థూల అర్థశాస్త్రం మాక్రోస్ అనే గ్రీకు పదం నుంచి ఆవిర్భవించింది. మాక్రో అంటే పెద్ద అని అర్థం. స్థూల అర్థశాస్త్రం మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేస్తుంది. ఉదా: జాతీయాదాయం, మొత్తం వినియోగం, మొత్తం రాబడి, మొత్తం ఉద్యోగిత మొదలైన సమష్టి అంశాలను స్థూల అర్థశాస్త్రం వివరిస్తుంది. జె.ఎం. కీ న్స్ స్థూల అర్థశాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని కల్పించారు. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని మార్షల్, స్థూల అర్థశాస్త్రాన్ని కీన్స్ వివరించారు. ధరల సిద్ధాంతాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం అని, ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని స్థూల అర్థశాస్త్రం అని పిలుస్తారు.
- ప్రజల కోరికలను సంతృప్తి పర్చగలిగే దృశ్యరూప పదార్థాలన్నింటినీ వస్తువులుగా పరిగణించొచ్చు. ప్రకృతి పరంగా అందరికీ అందేవాటిని ఉచిత వస్తువులని అంటారు. వీటి విషయంలో డిమాండ్ కంటే సప్లయ్ ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. వీటికి ఉపయోగితా విలువ ఉంటుంది. వినిమయ విలువ ఉండదు.
ఉదా: సూర్యరశ్మి, నదిలో నీరు, గాలి. పెద్ద నగరాల్లో నీటిని ఉచిత వస్తువుగా చెప్పలేం. - కొరతగా ఉన్న వస్తువులన్నీ ఆర్థిక వస్తువులే. డిమాండ్‌తో పోల్చి చూసినప్పుడు సప్లయ్ ఎప్పుడూ తక్కువగా ఉండి ధర చెల్లించాల్సిన వస్తువులను ఆర్థిక వస్తువులని అంటారు. పబ్లిక్, ప్రైవేట్ వస్తువులు అన్నీ ఆర్థిక వస్తువులే. ప్రజలు కోరే వస్తువులను ఉత్పత్తి చేసేందుకు వనరులను అత్యుత్తమ పద్ధతిలో వాడుకోవడాన్ని ఆర్థిక సామర్థ్యం అంటారు. ప్రస్తుతం ఉపయోగించుకోవడానికి ఉత్పత్తి చేసే వస్తువులను వినియోగ వస్తువులంటారు. ఇతర వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగపడుతూ మానవుని కోర్కెలను పరోక్షంగా తీర్చగలిగే వస్తువులను ఉత్పాదక వస్తువులు లేదా మూలధన వస్తువులు అని అంటారు. ఉదా: యంత్రాలు, పరికరాలు.
- పూర్తిగా తయారు కాకుండా ఉత్పత్తి ప్రక్రియలో వివిధ దశల్లో ఉన్న వస్తువులను మాధ్యమిక వస్తువులు అంటారు. ఉదా: సిమెంట్, ఇటుకలు, ఉక్కు.
- అర్థశాస్త్రంలో ఆర్థిక వస్తువులన్నింటినీ సంపదగా పరిగణిస్తారు. ఒక వినియోగదారుడు లేదా సంస్థ కలిగి ఉన్న ఆదాయాన్ని ఆర్జించడానికి అవకాశం ఉన్న ఆస్తుల నిల్వ.. సంపద. ఆదాయానికి మూలం సంపద. సంపద ఒక విలువ. దీని ద్వారా ఆదాయం ప్రవాహం రూపంలో వస్తుంది. ప్రతి ఆర్థిక వ్యవస్థలో ఆదాయం కుటుంబాల నుంచి వ్యాపార సంస్థలకు, వ్యాపార సంస్థల నుంచి కుటుంబాలకు ప్రవహిస్తుంది. మానవుని కోరికలను సంతృప్తి పర్చగలిగే వస్తు, సేవల శక్తిని ప్రయోజనం అంటారు. ఒక వస్తువు ఆకారం, రంగు, పరిమాణం మొదలైనవి మార్చడం ద్వారా ఆ వస్తువుకు మానవుని కోరికను తీర్చగలిగే శక్తి పెరిగినట్లయితే దాన్ని రూప ప్రయోజనం అంటారు.
ఉదా: చెక్కతో కుర్చీ లేదా టేబుల్ తయారు చేసినప్పుడు దాన్ని రూప ప్రయోజనం అంటారు. అదేవిధంగా స్థల, కాల, సేవల ప్రయోజనం కూడా ఉంటుంది. - వ్యక్తులు తమ ప్రస్తుత కోరికలను తీర్చుకోవడానికి వస్తు సేవలను ఉపయోగించడాన్నే వినియోగం అంటారు. వస్తువులు ఉపయోగించే వ్యక్తిని వినియోగదారుడంటారు.
- అర్థశాస్త్రంలో ఉత్పత్తి అంటే ముడి పదార్థాలకు ప్రయోజనం చేకూర్చి అంతిమ వస్తువులుగా మార్చే ప్రక్రియ. వస్తువులను ఉత్పత్తి చేసేవారు ఉత్పత్తిదారులు.
- ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించే ప్రతి వ్యక్తి ఆర్థిక ప్రతినిధి. ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొనే వారందరూ ఉత్పత్తిదారులే. సేవలను ఉత్పత్తి చేసే వర్తకుడు కూడా ఉత్పత్తిదారుడే. ప్రత్యక్ష వినియోగానికి తోడ్పడే ఉత్పత్తులను అంతిమ ఉత్పత్తులు అంటారు. వస్తువు లేదా సేవలను ఉపయోగించుకొనే ప్రతి వ్యక్తి వినియోగదారుడే. వస్తు ఉత్పత్తికి ఉపయోగపడే వస్తువులను ఉత్పాదక వస్తువులు అంటారు. చిల్లర వర్తకులు విక్రయించే ధరను చిల్లర ధర అంటారు.
- వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడిని వాటాలుగా (షేర్స్)గా విభజించి వాటిని ఎంపిక చేసిన కొంతమందికి, ప్రజలకు అమ్మి ఆ ధనంతో వ్యాపార వ్యవస్థను నిర్వహించడాన్ని ‘జాయింట్ స్టాక్ కంపెనీ’ అంటారు. ఈ కంపెనీలను ‘లిమిటెడ్’ అనడానికి కారణం వాటాదారు బాధ్యత పెట్టిన పెట్టుబడి మేరకే పరిమితంగా ఉంటుందని అర్థం.
- ప్రతి ధరకు, డిమాండ్‌కు సంబంధాన్ని డిమాండ్ ఫలం అంటారు. అంటే ‘డిమాండ్ పరిమాణానికి ఆధారం ధర. కాబట్టి ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ధరకు డిమాండ్‌కు మధ్య విలోమ సంబంధం ఉంటుంది.
మాదిరి ప్రశ్నలు
- ఏ నిర్వచనం వల్ల అర్థశాస్త్రానికి సార్వజనీనత లభిస్తుంది?
1) కొరత
2) శ్రేయస్సు
3) సంపద
4) అన్నీ - సూక్ష్మ అర్థశాస్త్రానికి మరొక పేరు?
1) క్షీణోపాంత ప్రయోజన సూత్రం
2) ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతం
3) ధరల సిద్ధాంతం
4) ఏదీకాదు - 'Wealth of Nations' గ్రంథాన్ని ఎవరు రాశారు?
1) పిగూ
2) వాల్రస్
3) మార్షల్
4) ఆడం స్మిత్ - 1970లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత?
1) రాబిన్స్
2) అమర్త్యసేన్
3) మార్షల్
4) పాల్ శామ్యూల్‌సన్ - వనరుల కొరత వల్ల ఏర్పడే సమస్య?
1) ఎంపిక
2) కొరత
3) ఆర్థిక
4) శ్రేయస్సు - పూర్తిగా తయారుకాకుండా ఇంకా తయారీలో ఉన్న వస్తువులను ఏమంటారు?
1) వినియోగ వస్తువులు
2) మాధ్యమిక వస్తువులు
3) ఆర్థిక వస్తువులు
4) ఉచిత వస్తువులు - ‘ఉద్యోగిత, వడ్డీ, ద్రవ్య సాధారణ సిద్ధాంతం’ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు?
1) కె.ఇ. బోల్డింగ్
2) రాగ్నర్ ఫ్రిష్
3) జె.ఎం. కీన్స్
4) స్టిగ్లర్ - అర్థశాస్త్రంలో ‘సూక్ష్మ అర్థశాస్త్రం’, ‘స్థూల అర్థశాస్త్రం’ భావనలను 1933లో అభివృద్ధి చేసినవారు?
1) కీన్స్
2) ఆడమ్ స్మిత్
3) రాగ్నర్ ఫ్రిష్
4) రాబిన్స్ - ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే గ్రంథాన్ని రచించింది?
1) మార్షల్
2) కీన్స్
3) ఆడమ్ స్మిత్
4) రాబిన్స్ - చెక్కతో కుర్చీ తయారు చేసినప్పుడు దానికి ఏ ప్రయోజనం చేకూరుతుంది?
1) రూప ప్రయోజనం
2) స్థల ప్రయోజనం
3) సేవల ప్రయోజనం
4) కాల ప్రయోజనం - అర్థశాస్త్రాన్ని ‘సామాజిక శాస్త్రాల్లో రాణి’ వంటిదని చెప్పినవారు?
1) జాకోబ్ వైనర్
2) మార్షల్
2) ఆడమ్ స్మిత్
4) పాల్ శామ్యూల్ సన్ - అర్థశాస్త్రానికి కొరత నిర్వచనాన్ని ఇచ్చిన ఆర్థికవేత్త?
1) రాబిన్స్
2) ఆడమ్ స్మిత్
3) మార్షల్
4) జాకోబ్ వైనర్
సమాధానాలు
1) 1 | 2) 3 | 3) 4 | 4) 4 | 5) 1 | 6) 2 | 7) 3 | 8) 3 | 9) 1 | 10) 1 |
11) 4 | 12) 1 |
Published date : 02 Feb 2015 06:22PM