Skip to main content

ఇంటర్నెట్ ఎక్కువ వాడే విద్యార్థుల్లో ఒత్తిడి, నేర్చుకునే సామర్థ్యం కూడా తక్కువే.. జర భద్రం!

సాక్షి, అమరావతి: ఇంటర్నెట్‌ను ఎక్కువగా వినియోగించే విద్యార్థులు చదువుపై తక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తేలింది.

డిజిటల్ టెక్నాలజీ ప్రభావం వల్ల చదువు పట్ల వారికి ఆసక్తి కూడా తగ్గిపోతున్నట్లు గుర్తించారు. దీంతో పరీక్షల సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. బ్రిటన్ (యూకే)లోని స్వాన్‌సీ యూనివర్సిటీ మన దేశంతోపాటు పలు దేశాలకు చెందిన 285 యూనివర్సిటీ, కళాశాలల విద్యార్థులను ఆన్‌లైన్‌లో చేసిన సర్వేలో ఈ విషయాలు స్పష్టమయ్యాయి. చదువుపై ఆసక్తితోపాటు చదివే నైపుణ్యం, నేర్చుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతున్నాయని తేలింది.

ఈ అధ్యయనంలో తేలిన విషయాలు..

  • డిజిటల్ టెక్నాలజీపైనే ఎక్కువగా ఉండడం వల్ల తాము ఒంటరిగా ఉన్నామనే భావన పెరుగుతోంది. దీంతో చదవడానికి ఇబ్బందిపడుతున్నారు. తద్వారా పరీక్షల సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.
  • 25 శాతం మంది విద్యార్థులు రోజూ నాలుగు గంటలు ఆన్‌లైన్‌లో గడుపుతున్నారు. దీంతో వారికి చదువుకునేందుకు ఎక్కువ సమయం దొరకడంలేదు. స్నేహితులు, కుటుంబసభ్యులు ఇతరులతో మాట్లాడేందుకు అవకాశం రావడంలేదు.
  • ఇంటర్నెట్ ఎక్కువవాడే వారిలో సోషల్ నెట్‌వర్కింగ్‌కు 40 శాతం వినియోగిస్తున్నారు. 30 శాతం సమాచారం తెలుసుకోవడం, పంచుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఇవి వారికి చదువులో ఏమాత్రం ఉపయోగపడడంలేదు. పైగా అనవసరమైన అంశాలపైకి దృష్టి మళ్లుతోంది.
  • సామాజిక సంబంధాల గురించి అవగాహన లేకపోవడంతో ఒంటరితనం భావన పెరిగి పాజిటివ్ ఫీలింగ్ రాకుండా చేస్తోంది.
  • స్నేహితులు, పక్కవారితో మాట్లాడడం వల్ల సామాజిక సంబంధాలు మెరుగుపడి కొత్త అంశాలు తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఇప్పుడు అవి తగ్గిపోవడం ప్రమాదకరంగా మారిందని అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు తేల్చారు.
  • ఈ నేపథ్యంలో పిల్లలు ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయాన్ని గడపడానికి తల్లిదండ్రులు అంగీకరించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
Published date : 20 Nov 2020 04:08PM

Photo Stories