ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ‘స్కిల్స్’ శిక్షణ
Sakshi Education
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఐబీఎం స్కిల్స్ బిల్డ్ శిక్షణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఎపీఎస్‌ఎస్‌డీసీ) గురువారం ప్రారంభించింది.
సీఎస్‌ఆర్ బాక్స్, దాల్మియా భారత్ ఫౌండేషన్‌తో కలిసి ఏపీఎస్‌ఎస్‌డీసీతో ఈ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. గురువారం ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రధాన కార్యాలయంలో వర్చువల్‌గా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్, ట్రిపుల్ ఐటీ వీసీ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడం ద్వారానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకనుగుణంగా శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ శిక్షణ పూర్తికాగానే వీరికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. శిక్షణ కోసం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో మూడు, నాలుగో ఏడాది చదువుతున్న విద్యార్థులు 3,152 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
Published date : 25 Jun 2021 04:41PM