నవోదయ దరఖాస్తులకు 10వ తేదీ గడువు
ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం 2024–25 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశానికి జరిగే జేఎన్‌వీఎస్‌టీ –2024 పరీక్షను వచ్చే ఏడాది జనవరి 20న నిర్వహించనున్నట్లు వివరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన 80 మంది ప్రతిభావంతులను ఎంపిక చేసి వారికి 6 నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌లో అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన చేస్తామని పేర్కొన్నారు. ఎలాంటి ఫీజలు లేకుండా ఉచితంగా విద్యతోపాటు హాస్టల్ ఇతర వసతులను కల్పించనున్నట్లు వెల్లడించారు.
పారదర్శకంగా ఓటర్ల జాబితా తయారీ కలెక్టర్ శివశంకర్ లోతేటి
నరసరావుపేట: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు చాలా కీలకమని కలెక్టర్ శివశంకర్ లోతేటి చెప్పారు. ఓటర్ల జాబితా తయారీలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. స్పెషల్ సమ్మరీ రివిజన్–2024 సంక్షిప్త ఓటర్ల జాబితా తయారీపై కలెక్టరేట్‌లో ఆదివారం ఆయన ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో సమీక్ష నిర్వహించారు. తొలుత ఓటర్ల సర్వే తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితా తయారీపై సూచనలు, సలహాలు ఇచ్చారు. సమావేశంలో జిల్లా ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ, జిల్లా రెవెన్యూ అధికారి కె.వినాయకం పాల్గొన్నారు.
ప్రారంభమైన రోల్ బాల్ పోటీలు
గుంటూరువెస్ట్ (క్రీడలు): రోల్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో అండర్–11, 17 విభాగాల్లో పోటీలు ఆదివారం స్థానిక బీఆర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం, నెల్లూరు, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, పశ్చిమగోదావరి నుంచి చిన్నారులు పాల్గొన్నారు. అసోసియేషన్ కార్యదర్శి అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పోటీల్లో ప్రతిభకనబరిచిన వారిని ఈనెల 14, 15 తేదీల్లో కేరళలోని కొల్లంలో జరగనున్న జాతీయ పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు.
తిరుపతమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
పెనుగంచిప్రోలు: తిరుపతమ్మ సన్నిధికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావటంతో పాటు పలు శుభకార్యాలు ఉండటంతో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. దీంతో ఆలయ క్యూలైన్లు, పరిసరాలు కిక్కిరిశాయి. వేకువజాము నుంచే భక్తులు పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు మధ్యాహ్న సమయంతో మునేరు అవతల మామిడి తోటల్లో సేద తీరారు.
సుబ్బారాయుడి నిత్యాన్నదానానికి..
మోపిదేవి: స్థానిక వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సన్నిధిలో నిత్యాన్నదానానికి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు అభిమానులు రూ. 1,00,116 విరాళంగా అందచేశారు. ఆదివారం వెంకట రమణ పుట్టిన రోజు సందర్భంగా కొక్కిలిగడ్డ ప్రశాంత్ కుమార్ ఫ్రెండ్ సర్కిల్ నేతృత్వంలో స్వామి వారికి అభిషేకం, పూజలు నిర్వహించారు. అనంతరం నిత్యాన్నదానానికి విరాళాన్ని ఆలయ ఏసీ ఎన్‌ఎస్ చక్రధరరావుకు అందించారు.