Skip to main content

విద్యార్థి కేంద్రిత బోధనా పద్ధతులు

శాస్త్రీయ పద్ధతి
విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ. శాస్త్రవేత్తలు అనుసరించే విధానమే శాస్త్రీయ పద్ధతి. శా స్త్రీయ పద్ధతికి ప్రత్యేక సోపానాలు లేవు. ఎందుకంటే ప్రతి శాస్త్రవేత్త తనదైన శైలిలో ప్రయోగాలు చేస్తాడు.
  • 1937లో కార్‌‌లపియర్‌సన్, కీస్లర్ అనే శాస్త్రవేత్తలు ఈ పద్ధతిలో తొమ్మిది సోపానాలను వివరించారు. అవి... సమస్యను గుర్తించడం, సమస్యను నిర్వచించడం, సమస్య విశ్లేషణ, దత్తాంశ సేకరణ, దత్తాంశాల ప్రతిక్షేపణ, ప్రాకల్పనల ప్రతిపాదన, ప్రాకల్పనలను పరీక్షించడం, సాధారణీకరించడం, అన్వయం.

అన్వేషణ/ హ్యూరిస్టిక్ పద్ధతి
దీన్ని మొదటగా హెచ్.ఇ. ఆర్‌‌మస్ట్రాంగ్ లండన్‌లో ప్రవేశపెట్టారు. హ్యూరిస్టో అనే గ్రీకు పదానికి అర్థం అన్వేషణ. ఈ పద్ధతి ద్వారా విద్యార్థిని అన్వేషణకుడిగా చేయవచ్చు.
సోపానాలు: బోధనా అంశాలను సమస్యల రూపంలో రాయడం. సూచన పత్రాలను తయారు చేయడం. సూచనల ద్వారా ప్రయోగం చేయడం (విద్యార్థులు). ప్రయోగ ఫలితాలను రికార్డు చేసి, ఉపాధ్యాయులతో సంప్రదించి తిరిగి ప్రయోగాలు చేయడం. నేర్చుకున్న సూత్రాలను, సాధారణీకరణలను అన్వయించడం.
ప్రయోజనాలు: శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇస్తుంది. శాస్త్రీయ వైఖరి, సృజనాత్మకత, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించవచ్చు. కష్టపడి పనిచే యడంతో పాటు పనిపై గౌరవం పెరుగుతుంది. చేయడం ద్వారా నేర్చుకోవడం సాధ్యమవుతుంది. ఉపాధ్యాయునికి విద్యార్థులకు మధ్య సహకారం పెరుగుతుంది. నిజ జీవితంలో సమస్యలను సమర్థంగా ఎదుర్కొంటారు.
లోపాలు: విద్యార్థులు తమకు తాముగా నేర్చుకోవడం కష్టం. దీనికి ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు అవసరం. సరైన పాఠ్య పుస్తకాలు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు లేవు. తక్కువ మంది విద్యార్థులున్నప్పుడే సాధ్యం అవుతుంది. సిలబస్‌ను పూర్తి చేయడం కష్టం. అధిక వ్యయమవుతుంది. ప్రాథమిక పాఠశాలకు వర్తించదు. కాలనిర్ణయ పట్టికలో ఈ పద్ధతిని ఇమడ్చటం కష్టం.

ప్రాకల్పన/ ప్రాజెక్టు పద్ధతి
ఈ పద్ధతిని డబ్ల్యు.హెచ్. కిల్‌ప్యాట్రిక్ కను గొన్నాడు. జె.ఎ. స్టీవెన్‌సన్ దీని గురించి వివరించాడు. సహజ వాతావరణంలో చేసే సమస్యా పరిష్కారమే ప్రాజెక్ట్. ఇది వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉంది.
సోపానాలు: పరిస్థితిని కల్పించడం, ప్రాజెక్ట్‌ను ఎంచుకొని లక్ష్యాన్ని వివరించడం, వ్యూహరచన, ప్రాజెక్ట్‌ను అమలు పర్చడం, మూల్యాంకనం, నివేదిక తయారు చేయడం మొదలైనవి.
మంచి ప్రాజెక్ట్ లక్షణాలు: విద్యార్థికి నిజ జీవితంలో ఉపయోగపడాలి. ఫలవంతమైన అనుభవాలు ఇచ్చేవిగా ఉండాలి. విద్యార్థులే సొంతంగా నిర్వహించగలిగేవిగా, సమయం, డబ్బు వృథా కాకుండా, రుతువులకు అనుగుణంగా ఉండాలి.

ప్రాజెక్ట్‌ల రకాలు
స్టీవెన్‌సన్ ప్రకారం రెండు రకాల ప్రాజెక్టులు ఉంటాయి.
  1. భౌతిక సంబంధమైనవి: శారీరక శ్రమకు సంబంధించినవి.
  2. మేధా సంబంధమైనవి: ఆలోచన లేదా జ్ఞానం ఉపయోగించి చేసేవి.
  3. కిల్‌ప్యాట్రిక్ ఈ రెండింటితోపాటు మరో నాలుగు రకాలను చేర్చి ఆరు రకాలుగా వర్గీకరించాడు.
  4. ఉత్పత్తి సంబంధమైనవి: ఈ ప్రాజెక్ట్ వల్ల చివరకు ఏదో ఒక వస్తువు తయారవుతుంది. ఉదా: సబ్బులు, కొవ్వొత్తుల తయారీ
  5. వినియోగ సంబంధమైనవి: ఒక వస్తువు లేదా పరికరం వినియోగం గురించి తెలుసుకుంటారు. ఉదా: డ్రిల్లింగ్ మిషన్ పనిచేసే విధానం తెలుసుకోవడం.
  6. సమస్యా ప్రాజెక్ట్: దీనిలో భాగంగా ఒక సమస్యను ఇస్తారు. దాని పరిష్కారం కనుగొనాలి.
  7. శిక్షణ ప్రాజెక్ట్: నైపుణ్యాలు నేర్చుకునే ప్రాజెక్ట్.
ప్రయోగశాల పద్ధతి
విద్యార్థులకు ముందుగానే లక్ష్యం, ప్రయోగ విధానం, ఫలితం తెలియజేసి, వారితో ప్రయోగాలు చేయిస్తూ బోధించే పద్ధతి.
ప్రయోగాలు మూడు రకాలు.
వ్యక్తిగతంగా చేయించేవి: పరికరాలు సరిపడే సంఖ్యలో ఉండి, చిన్న ప్రయోగాలైనప్పుడు ప్రతి ఒక్క విద్యార్థితో ప్రయోగాలు చేయించవచ్చు.
జట్టుతో చేయించేవి: పరికరాల సంఖ్య తక్కువగా ఉంటే విద్యార్థులను జట్లుగా విభజించి ఒక్కో జట్టుతో చేయించేవి.
ప్రయోగ విభజన: ప్రయోగం పెద్దదై, క్లిష్టంగా ఉన్నప్పుడు, దాన్ని భాగాలుగా విభజించి ఒక్కో భాగాన్ని ఒక్కో జట్టుతో చేయించడం.

నియోజన పద్ధతి
వారం రోజుల్లో పూర్తి చేయడానికి వీలుగా ఉండే చిన్న పాఠ్యాంశాల భాగాన్నే నియోజనం అంటారు. ఇందులో రెండు భాగాలుంటాయి.
1. సన్నాహక భాగం, 2. ప్రయోగశాల భాగం.
సన్నాహక భాగం:
ఏం చదవాలో, ఏయే పుస్తకాలు సంప్రదించాలో వివరిస్తూ ఉపాధ్యాయుడు సూచన పత్రాల ద్వారా తెలియజేస్తాడు.
ప్రయోగశాల భాగం: సూచనల ఆధారంగా విద్యార్థి ప్రయోగాలు చేసి ఫలితాలు రాబడతాడు.

చర్చా పద్ధతి
విద్యార్థులకు వ్యక్తిగతంగా లేదా జట్లుగా చర్చను ఇవ్వవచ్చు. చర్చను గంట లేదా అంతకు మించిన సమయంలో కూడా నిర్వహించవచ్చు. కీలకమైన భావనలు నల్లబల్లపై రాయాలి. కాలనిర్ణయ పట్టికలో తగిన సమయం కేటాయించాలి. ఈ పట్టికలో పాఠ్యాంశాలు సరళంగా ఉండాలి.

కృత్య/ కార్యకలాపాల పద్ధతి
కృత్యాల ద్వారా బోధించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థి సొంతంగా కృత్యం చేయడం వల్ల ఆనందానికి గురవుతాడు. పాఠశాలలో సాంఘికోపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశ పెట్టాలని 1977లో ఈశ్వరీ భాయ్ పటేల్ కమిటీ సిఫార్సు చేసింది.
1986 లో జాతీయ విద్యా కమిషన్ కూడా ఈ కృత్యాలను ‘పని - అనుభవం’ పేరుతో ప్రవేశపెట్టింది. కృత్యాలు మూడు రకాలు. అవి..
1. కనుక్కొనే కృత్యం - జ్ఞానాన్నిచ్చేవి
2. నిర్మాణాత్మక కృత్యాలు - అనుభవాన్ని ఇచ్చేవి
3. ప్రకటిత కృత్యాలు - ప్రదర్శనను ఇచ్చేవి.
వివిధ రకాల ప్రయోగాల ద్వారా విద్యార్థులు వివిధ దశల్లో, వయసుల్లో చేయదగ్గ కృత్యాలను మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ పియాజే వివరించారు.

మాదిరి ప్రశ్నలు
1. అన్వేషణ పద్ధతిని కనుగొన్నవారు?
1) సింప్సన్
2) హెచ్.ఇ. ఆర్‌‌మస్ట్రాంగ్
3) డబ్ల్ల్యు.హెచ్. కిల్‌ప్యాట్రిక్
4) జె.ఎ. స్టీవెన్‌సన్
2. విద్యార్థి సొంతంగా ప్రయోగాలు చేసి నేర్చుకునేలా చేయాలనుకునే ఉపాధ్యాయుడు ఎంచుకునే బోధనా పద్ధతి?
1) చర్చ
2) ప్రదర్శన
3) నియోజన
4) అన్వేషణ
3. కార్‌‌లపియర్‌సన్, కీస్లర్ రూపొందించిన తొమ్మిది సోపానాలు ఏ పద్ధతికి సంబంధించినవి?
1) అన్వేషణ
2) ప్రాజెక్ట్
3) శాస్త్రీయ
4) ప్రయోగ
4. ప్రయోగ, అన్వేషణ పద్ధతుల మధ్య తేడాను తెలిపే ప్రవచనం?
1) అన్వేషణ పద్ధతిలో ప్రయోగాలుండవు - ప్రయోగ పద్ధతిలో ప్రయోగాలుంటాయి
2) అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుడు ప్రయోగాలు చేస్తాడు - ప్రయోగ పద్ధతిలో విద్యార్థులు ప్రయోగాలు చేస్తారు.
3) అన్వేషణ పద్ధతిలో ప్రయోగం తరగతి గదిలో చేస్తారు - ప్రయోగ పద్ధతిలో ప్రయోగశాలల్లో చేస్తారు
4) అన్వేషణ పద్ధతిలో ప్రయోగ విధానం, ఫలితం ముందుగా తెలియజేయరు - ప్రయోగ పద్ధతిలో తెలియజేస్తారు
5. హ్యూరిస్టో అనే గ్రీకు పదానికి అర్థం?
1) బిగ్గరగా చదవడం
2) ప్రయోగం
3) అన్వేషణ
4) పరిశీలన
6. ఉపాధ్యాయుడు మౌఖికంగా బోధించకుండా సూచన పత్రాలను ఇస్తే ఆయన ఏ బోధనా పద్ధతిని ఉపయోగిస్తున్నట్లు?
1) ఉపన్యాస పద్ధతి
2) అన్వేషణ
3) ప్రకల్పనా పద్ధతి
4) ప్రదర్శనా పద్ధతి
7. సమస్యా పరిష్కారం, సహజ వాతావరణం అనే రెండు అంశాలు కిందివాటిలో ఏ బోధనా పద్ధతికి సంబంధించినవి?
1) ప్రాకల్పన
2) అన్వేషణ
3) చర్చా
4) నియోజన
8. కిందివాటిలో అన్వేషణ పద్ధతి ప్రయోజనం కానిది?
1) శాస్త్రీయ పద్ధతిలో విద్యార్థికి శిక్షణ లభిస్తుంది
2) కష్టపడి పనిచేయడం, పనిపై గౌరవం పెంచుకుంటారు
3) ఉపాధ్యాయునికి చాలా సులభమైంది
4) నిజ జీవితంలో సమస్యలను విద్యార్థి సులభంగా ఎదుర్కొంటాడు
9. ఉపాధ్యాయుడు కేవలం మౌఖిక బోధకుడిగా కాకుండా విద్యార్థికి స్నేహితుడిగా, మార్గదర్శిగా, సలహాదారుడిగా వ్యవహరించాలనుకుంటే ఆయన ఎంచుకోవాల్సిన బోధనా పద్ధతి?
1) ఉపన్యాస
2) ప్రదర్శన
3) చారిత్రక
4) అన్వేషణ
10. కిందివాటిలో సమస్యా పరిష్కార పద్ధతి కానిది?
1) అన్వేషణ
2) ప్రదర్శన
3) ప్రాకల్పన
4) శాస్త్రీయ
11. ప్రయోగ పద్ధతిలో పెద్దదైన లేదా క్లిష్టమైన ప్రయోగాన్ని చేయించాల్సి వస్తే?
1) ఉపాధ్యాయుడు ప్రయోగం చేస్తాడు
2) ఒక్కో విద్యార్థితో ప్రయోగం చేయిస్తాడు
3) ప్రయోగాన్ని విభజించి ఒక్కో భాగాన్ని ఒక్కో జట్టుతో చేయిస్తాడు
4) ఆ ప్రయోగాన్ని చేయకూడదు
12. వారం రోజుల్లో పూర్తి చేయడానికి వీలుగా ఉండే చిన్న పాఠ్యాంశాల భాగాన్ని ఏమంటారు?
1) నియోజనం
2) విషయ ప్రణాళిక
3) పాఠ్య పథకం
4) పాఠ్య ప్రణాళిక
13. అనుభవాన్నిచ్చే కృత్యాలు ఏ రకానికి చెందినవి?
1) కనుక్కొనే కృత్యం
2) నిర్మాణాత్మక కృత్యం
3) ప్రకటిత కృత్యం
4) సామాజిక కృత్యం
14. ’A’ అనే ఉపాధ్యాయుడు ప్రయోగం చేసి చూపించాడు. ’B’ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులతో తోటపని చేయించడం ద్వారా బోధించాడు. వీరిద్దరూ అనుసరించిన బోధనా పద్ధతులు వరుసగా?
1) A - అన్వేషణ, B - ప్రదర్శన
2) A - ప్రదర్శన, B - ప్రాకల్పన
3) A - ప్రదర్శన, B - శాస్త్రీయ పద్ధతి
4) A - ప్రయోగ పద్ధతి, ఆ - ప్రదర్శనా పద్ధతి

సమాధానాలు

1) 2

2) 4

3) 3

4) 4

5) 3

6) 2

7) 1

8) 3

9) 4

10) 2

11) 3

12) 1

13) 2

14) 2


గతంలో అడిగిన ప్రశ్నలు
1. వ్యవహారిక సత్తా వాదాన్ని ఆధారంగా తీసుకొని రూపొందించిన బోధనా పద్ధతి? (డీఎస్సీ - 2008)
1) నియోజన పద్ధతి
2) ప్రాకల్పన పద్ధతి
3) అన్వేషణ పద్ధతి
4) చారిత్రక పద్ధతి
2. విద్యార్థులతో పంచదార ఫ్యాక్టరీని సందర్శింపజేయడం అనే ప్రక్రియ ఏ బోధనా పద్ధతిలో ఒక భాగం? (డీఎస్సీ-2012)
1) చర్చా
2) ప్రాజెక్ట్
3) సమస్యా పరిష్కార
4) సాంఘిక ఉద్గార
3. విజ్ఞాన శాస్త్రం విద్యార్థులకు ఈ పద్ధతిలో శిక్షణ ఇస్తుంది. అది వారిలో సమస్యల నిష్పాక్షిక పరిశీలన, మానసిక ఏకాగ్రత, క్రమబద్ధమైన ఆలోచనా సరళి, ఓర్పు, సరైన నిర్ణయాలు చేయడం, నిశిత పరిశీలన వంటి కొన్ని సుగుణాలను పెంపొందిస్తుంది. దీనికి కారణమైన పద్ధతి, విలువను గుర్తించండి.
1) అన్వేషణ పద్ధతి - సృజనాత్మక విలువ
2) ప్రాకల్పన పద్ధతి - సాంఘిక విలువ
3) సమస్యా పరిష్కార పద్ధతి - నైతిక విలువ
4) శాస్త్రీయ పద్ధతి - క్రమశిక్షణ విలువ

సమాధానాలు
1) 2 2) 2 3) 3
Published date : 23 Dec 2014 03:11PM

Photo Stories