Skip to main content

వాక్యం - నిర్మాణం - భేదాలు

వాక్యం (Sentence): ఏ భాషలోనైనా ప్రధాన అంశం వాక్యం. ‘వచ్’ అనే సంస్కృత ధాతువు నుంచి వాక్యం ఏర్పడింది. భావ వ్యక్తీకరణకు ప్రధానమైంది వాక్యం. ప్రాచీన తెలుగు వ్యాకరణకర్తలు కేతన మొదలు చిన్నయసూరి (బాల వ్యాకరణం- 1858) వరకు వ్యాకరణకర్తలెవరూ వాక్య స్వరూపం, వాక్య నిర్మాణ రీతుల గురించి చర్చించలేదు. ప్రౌఢ వ్యాకరణ కర్త బహుజనపల్లి సీతారామాచార్యులు (1885) వాక్య పరిచ్ఛేదంలో వాక్య స్వరూపాన్ని చర్చించారు. ఆయనపై ఆంగ్ల వ్యాకరణాల ప్రభావం ప్రగాఢంగా ఉంది. అభిప్రాయాలను పూర్తిగా వ్యక్తీకరించేందుకు ఉపకరించేది వాక్యం. సంపూర్ణ అర్థాన్ని తెలియజేసే పదాల కూర్పును ‘వాక్యం’గా పేర్కొనవచ్చు. ప్రౌఢ వ్యాకరణకర్త వాక్య లక్షణాలు మూడింటిని వివరించారు. అవి.. 1. యోగ్యత, 2. ఆకాంక్ష, 3. ఆసత్తి.
1. యోగ్యత: పదాలను వాటి అర్థాలతో సమన్వయించేటప్పుడు వైరుధ్యం లేకుండా ఉండటాన్ని యోగ్యత అంటారు. ఉదా: ‘నిప్పుతో ఆర్పుతున్నాడు’ అనే వాక్యంలో నిప్పుకు ఆర్పే గుణం లేనందున ఇది స్వీకరించదగిన వాక్యం కాదు. ‘నీటితో ఆర్పుతున్నాడు’ అన్నప్పుడు నీటికి ఆర్పే గుణం ఉన్నందున ఈ వాక్యానికి యోగ్యత లక్షణం ఉంది.
2. ఆకాంక్ష: వాక్యం విన్న తర్వాత లేదా చదివిన తర్వాత ప్రశ్నించే అవకాశం ఉండటాన్ని ఆకాంక్ష అంటారు.
ఉదా: ‘రమ కాలేజీకి వెళ్లింది’ అనే వాక్యంలో ఎవరు కాలేజీకి వెళ్లారు? రమ ఎక్కడికి వెళ్లింది? ఎవరు? ఎక్కడికి? వంటి ప్రశ్నలు వేసే అవకాశం ఉన్నందున ఇది ఆకాంక్ష లక్షణం.
3. ఆసత్తి: వాక్యంలో పదాలు అవ్యవధానంగా ఉండటాన్ని ‘ఆసత్తి’ అంటారు.
ఉదా: ‘రవి బడికి వెళ్లాడు’ అనే వాక్యంలో పదాలు అవ్యవధానంగా ఉన్నందున ఇది ఆసత్తి గల వాక్యం. రవి... బడికి... వెళ్లాడు అనేది ఆసత్తి లేని వాక్యం.
వాక్య భేదాలు: బహుజనపల్లి సీతారామాచార్యులు వాక్యాన్ని సంపూర్ణ వాక్యం, అసంపూర్ణ వాక్యం అని రెండు విధాలుగా వర్గీకరించారు.
ఎ. సంపూర్ణ వాక్యం: సమాపక క్రియ గల వాక్యం సంపూర్ణ వాక్యం. ‘రవి రఘుని కొట్టాడు’ అనే వాక్యంలో కర్త, కర్మలతోపాటు సమాపక క్రియ ఉన్నందున ఇది సంపూర్ణ వాక్యం.
బి. అసంపూర్ణ వాక్యం: వాక్యంలో అసమాపక క్రియ ఉంటే దాన్ని అసంపూర్ణ వాక్యం అంటారు.
ఉదా: ‘మాధవి కాలేజీకి వెళ్లి..’ ఇందులో కర్త, కర్మలతోపాటు ‘వెళ్లి’ అనే అసమాపక క్రియ ఉన్నందున ఇది అసంపూర్ణ వాక్యం.

వాక్య రూపం - అర్థం - క్రియా ప్రాధాన్యం - వాక్య భేదాలు
రూపాన్ని, అర్థాన్ని, క్రియా ప్రాధాన్యాన్ని అనుసరించి భాషావేత్తలు వాక్య భేదాలను సూక్ష్మ దృష్టితో కొన్ని విధాలుగా వర్గీకరించారు.
I. రూపాన్ని బట్టి వాక్య భేదాలు: వాక్య రూపాన్ని అనుసరించి భాషా శాస్త్రవేత్తలు ఆంగ్ల వాక్య నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని వాక్యాన్ని మూడు రకాలుగా విభజించారు.
I. సామాన్య వాక్యం (Simple Sentence)
II. సంశ్లిష్ట వాక్యం (Complex Sentence)
III.సంయుక్త వాక్యం (Compound Sentence)
I. సామాన్య వాక్యం (Simple Sentence)
కర్త, కర్మతోపాటు ఒక సమాపక క్రియ ఉండే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. ఇందులో అసమాపక క్రియలుండవు.
ఉదా: రమ్య పుస్తకం కొన్నది. ఇతర భాషల్లో లేని విధంగా తెలుగు వాక్య నిర్మాణంలో క్రియారహిత వాక్యాలున్నాయి. సామాన్య వాక్యాన్ని రెండు విధాలుగా వర్గీకరించవచ్చు.
1. క్రియా సహిత వాక్యాలు
2. క్రియారహిత వాక్యాలు
1. క్రియా సహిత వాక్యాలు: క్రియలున్న వాక్యాలు క్రియా సహిత వాక్యాలు. ఉదా: ‘రాముడు వాలిని చంపెను’ - ఇందులో క్రియ ఉన్నందున ఇది క్రియా సహిత వాక్యం.
2. క్రియా రహిత వాక్యం: క్రియలులేని వాక్యాలు క్రియా రహిత వాక్యాలు. ఉదా: ఆమె మంచి డాక్టర్, ఆయన మంచి ప్రొఫెసర్, ఆమె సుగుణవతి వంటివి క్రియా రహిత వాక్యాలు.
క్రియా సహిత వాక్యాలను రెండు రకాలుగా వర్గీకరించారు.
ఎ. కర్తృ సహిత వాక్యాలు
బి. కర్తృ రహిత వాక్యాలు
ఎ. కర్తృ సహిత వాక్యాలు: కర్తృ సహిత వాక్యాలను క్రియలను అనుసరించి మళ్లీ మూడు విధాలుగా వర్గీకరించవచ్చు.
1. సకర్మక వాక్యం
2. అకర్మక వాక్యం
3. ప్రేరణార్థక వాక్యం
1. సకర్మక వాక్యం: వాక్యంలో వరుసగా కర్త, కర్మ, క్రియ ఉంటే అది సకర్మక వాక్యం, వాక్యంలో కర్మ ఉన్నా, లేదా క్రియా పదం వల్ల కర్మ ఉన్నట్లు తెలిసినా అది కూడా సకర్మక వాక్యమే.
ఉదా: కవిత అన్నం వండింది; స్వాతి తిట్టింది; అమ్మ కొట్టింది; వాడు ఉత్తరం చదివాడు మొదలైనవి.
2. అకర్మక వాక్యం: వాక్యంలో కర్మ లేకుండా కేవలం కర్త, క్రియలు మాత్రమే ఉంటే దాన్ని అకర్మక వాక్యం అంటారు.
ఉదా: అమ్మాయి కాలు జారిపడింది; పులి చచ్చింది; వర్షం కురిసింది మొదలైనవి.
3. ప్రేరణార్థక వాక్యం: ఒక పని జరిగేందుకు ఇతరుల ప్రేరణ ఉంటే దాన్ని ప్రేరణార్థక వాక్యం అంటారు. ధాతువుకు ‘ఇంచు’ ప్రత్యయం చేరడం వల్ల ప్రేరణార్థక వా క్యం ఏర్పడుతుంది. ఉదా:
• ఉపాధ్యాయుడు నా చేత పరీక్ష రాయించాడు.
• అమ్మ పిల్లవాడి చేత అన్నం తినిపించింది.
బి. కర్తృరహిత వాక్యాలు: కర్తృరహిత వాక్యాల్లో ‘ఉంది’ అనే క్రియా రూపం ఉంటుంది.
• నాకు ఆకలిగా ఉంది.
• వాడికి సంతోషంగా ఉంది.

II. సంశ్లిష్ట వాక్యం (Complex Sentence)
వాక్యంలో సమాపక క్రియ, అసమాపక క్రియతో కలిసి ఉన్న పద సముదాయాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు.
ఉదా: కొడుకు చూస్తుండగానే, తండ్రిపై హత్యా ప్రయత్నం జరిగింది.
ఈ వాక్యంలో ‘జరిగింది’ అనేది సమాపక్రియ. ‘చూస్తుండగానే’ అనేది అసమాపక క్రియ. కాబట్టి ఇది సంశ్లిష్ట వాక్యం.
సంశ్లిష్ట వాక్యాల్లో శత్రర్థకం, చేదర్థకం, అప్యర్థకం, క్త్వార్థకం అనేవి ప్రధాన పాత్ర వహిస్తాయి.
1. శత్రర్థక వాక్యాలు: శత్రర్థంలో క్రియకు ‘తూ’ ప్రత్యయం చేరుతుంది.
• సుమ పాడుతూ నాట్యం చేస్తుంది.
• భాస్కర రావు తింటూ మాట్లాడతాడు.
• ‘స్మిత’ సినిమా చూస్తూ నవ్వుతుంది.
2. చేదర్థక వాక్యాలు: చేదర్థక క్రియల్లో ధాతువుకి ‘తే’, ‘అయితే’ ప్రత్యయాలు చేరతా యి. ఒక పనిపై ఆధారపడి ఇంకో పని జరుగుతుంది. ఉదా:
• వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి.
• ప్రామాణిక భాష అయితే అందరికీ ఆమోద యోగ్యం.
3. అప్యర్థక వాక్యాలు: అప్యర్థక క్రియల్లో ధాతువుకు ‘ఇనా’ ప్రత్యయం చేరుతుంది. రెండు వ్యాపారాల్లో వైరుధ్యాలున్నప్పుడు మాత్రమే ఈ వాక్యాలు ప్రయోగిస్తారు.
• వరకట్న నిషేధం చట్టం వచ్చినా ఫలితం లేదు.
• వాణ్ణి ఆహ్వానించకపోయినా హాజరవుతాడు.
• ఆ ప్రొఫెసర్ పాఠం చెప్పినా అర్థం కాదు.
4. క్త్వార్థక వాక్యాలు: భూతకాలిక అసమాపక ‘క్రియ’ క్త్వార్థకం. ఇందులో ధాతువుకు ‘ఇ’ ప్రత్యయం చేరుతుంది.
• డా॥రమణ ఆసుపత్రికి వెళ్లి రోగులను చూశాడు.
• స్రవంతి కాలేజీకి వెళ్లి పాఠాలు చెప్పింది.
III. సంయుక్త వాక్యాలు(Compound Sentences)
రెండు లేదా అంతకంటే ఎక్కువ సమాన ప్రతిపత్తి గల వాక్యాలు కలిసి ఒకే వాక్యంగా ఏర్పడితే దాన్ని సంయుక్త వాక్యం అంటారు. దీన్ని మహావాక్యం అని కూడా అంటారు. ఆంగ్ల భాషా సంప్రదాయం వల్ల వచ్చిన వాక్య నిర్మాణం కాబట్టి రెండు వాక్యాల మధ్య అఛీ, ఆఠ్ట, ౌ వంటి అనుసంధాయక పదాలు ఆంగ్లంలో చేరిన విధంగా తెలుగులో కానీ, అయితే వంటి అవ్యయాలు అనుసంధానాలుగా చేరతాయి. సంయుక్త వాక్యాలను మూడు విధాలుగా వర్గీకరించవచ్చు.
1. సంకలన సంబంధ వాక్యాలు
2. వికల్ప సంబంధ వాక్యాలు
3. వైరుధ్య సంబంధ వాక్యాలు
1. సంకలన సంబంధ వాక్యాలు: సంయుక్త వాక్యంలో ఉపయోగించే వాక్యాల మధ్య సంకలన సంబంధం ఉంటుంది. ఉదా: సుధాకర్ కవిత్వం రాస్తాడు, విమర్శవ్యాసాలు రాస్తాడు, ఉపన్యాసాలిస్తాడు. ఇవి సంకలన సంబంధ వాక్యాలు.
2. వికల్ప సంబంధ వాక్యాలు: సందేహాస్పదమైన ఊహలు వికల్ప సంబంధ వాక్యాల్లో ఉంటాయి. వీటిలో నామబంధాలకు ఓ ప్రత్యయం చేరుతుంది. ఉదా: కృష్ణ ఉద్యోగమో, వ్యాపారమో చేస్తున్నాడు.
3. వైరుధ్య సంబంధం: రెండు వాక్యాలు ప్రతిపాదించే విషయాల మధ్య వైరుధ్య సంబంధం ఉంటుంది.
ఉదా: ఆ రాజకీయ నాయకుడు పెద్ద అవినీతిపరుడు, అయితే నీతి బోధలు సభల్లో వల్లిస్తాడు.
II. అర్థాన్ని బట్టి వాక్య భేదాలను కొన్ని విధాలుగా విభజించారు. వాటిలో ముఖ్యమైన వాటిని పరిశీలిద్దాం. నిశ్చయార్థక వాక్యా లు, వ్యతిరేకార్థక వాక్యాలు, విధ్యర్థక వా క్యాలు, అనుమత్యుర్థక వాక్యాలు, సంభావనార్థక వాక్యాలు, ఆశ్చర్యార్థక వాక్యాలు ఆశీర్యాద్యర్థక వాక్యాలు, ప్రార్థనార్థక వాక్యాలు, నిషేధక వాక్యాలు ప్రధానమైనవి.
III. క్రియా ప్రాధాన్యాన్ని అనుసరించి వాక్యాలను మూడు రకాలుగా వర్గీకరించారు.
1. కర్తృ ప్రధాన వాక్యం: ఇందులో క్రియా పదం కర్తకు ప్రాధాన్యాన్ని సూచిస్తుంది. ఉదా: రాముడు రావణున్ని వధించాడు.
2. కర్మ ప్రధాన వాక్యం: ఇందులో క్రియా పదం కర్మకు ప్రాధాన్యం ఇస్తుంది. ఉదా: రావణుడు రామునిచేత చంపబడ్డాడు.
3. భావ ప్రధాన వాక్యం: భావ క్రియ ద్వారా విధేయాంశాన్ని చెప్పడం భావ ప్రధాన వాక్యం. ఉదా: మీ రాక వల్ల సకల శుభాలు కలగడం మొదలయ్యాయి.
నామ్నీకరణ వాక్య విధానం: నామం కాని దాన్ని నామం చేయడమే నామ్నీకరణం. ఒక వాక్యాన్ని కొన్ని మార్పులతో కర్తృ, కర్మ పదస్థానాల్లో ప్రయోగించే పద్ధతిని ‘నామ్నీకరణం’ అంటారు. ఆచార్య చేకూరి రామారావు ‘తెలుగు వాక్యం’ పరిశోధనాత్మక గ్రంథంలో నామ్నీకరణ పద్ధతులను సూచించారు.
సమాపక క్రియలతో కూడిన వాక్యాలను కొన్ని మార్పులతో నామ పదాలుగా మార్చడం. వాక్యం చివర కర్త, కర్మ ఉపయోగించవచ్చు. ధాతువులకు ప్రత్యయాదులను చేర్చి నామాలుగా వ్యవహరించడాన్ని కూడా నామ్నీకరించవచ్చు. ఇది మూడు విధాలు
1. భావార్థకాలు: క్రియకు ‘అడం’ చేరుతుం ది. ఉదా: చదవడం, రాయడం, తినడం మొదలైనవి.
2. ధాతుజ/క్రియాజన్య విశేషణాలు: క్రియకు ‘ఇన’ ప్రత్యయం చేరుతుంది. ఉదా: చేసిన, చూసిన, వచ్చిన మొదలైనవి.
3. యత్ తదర్థక వాక్యాలు: వీటిలో ఎవడైతే, ఎక్కడ, చేశానో, చూశానో మొదలైనవి చేరతాయి.
నామ్నీకరణగా మార్చడం: ఉదా: ఆరోగ్యం బొత్తిగా చెడిపోయింది. ఇందులో క్రియకు ‘ఇన’ ప్రత్యయం చేర్చి కర్త, కర్మ పద స్థానాలు మార్చాలి. బొత్తిగా చెడిపోయిన ఆరోగ్యం.
స్వానుభవం వల్ల ఈ జీవిత సత్యాన్ని నేర్చుకున్నాను. ఇది స్వానుభవం వల్ల నేర్చుకున్న జీవిత సత్యం.
అనుకృతి వాక్యాలు: అనుకృతి రెండు విధాలు
1. ప్రత్యక్షానుకృతి/ప్రత్యక్ష కథనం (Direct Speech)
2. పరోక్షానుకృతి/పరోక్ష కథనం (Indirect Speech)
1. ప్రత్యక్షానుకృతి లేదా ప్రత్యక్ష కథనం: ఒకరు చెప్పిన విషయాన్ని యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ప్రత్యక్ష కథనం. ఇందులో ఒకరు చెప్పిన విషయం ‘అనుకరణ చిహ్నాల మధ్య’ ఉంటుంది.
ఉదా: అంబేద్కర్ ‘నేను హిందువుగా పుట్టాను. హిందువుగా మాత్రం మరణించను’ అన్నారు. (ప్రత్యక్ష కథనం)
అంబేద్కర్ తాను హిందువుగా పుట్టానని, హిందువుగా మాత్రం మరణించనని అన్నారు. (పరోక్ష కథనం)
1. కర్తరీ - కర్మణీ వాక్యాలు: కర్త ప్రధానంగా ఉన్న వాక్యాలు కర్తరీ వాక్యాలు. ఆంగ్లంలో Active Voice అంటారు. కర్తరీ వాక్యాల్లో కర్త ప్రథమావిభక్తి ప్రత్యయాల్లో ఉంటుం ది. ఒక్కొక్కసారి విభక్తి ప్రత్యయాలు లేకుండా ఉంటుంది. సమాపక క్రియ ఉం టుంది. కర్మ ద్వితీయా విభక్తి ప్రత్యయాల్లో ఉంటుంది.
ఉదా:
• వాల్మీకి రామాయణాన్ని రచించారు (కర్తరీ).
• రామాయణం వాల్మీకి చేత రచించబడింది (కర్మణీ).
• గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకాన్ని రచించారు (కర్తరీ).
• కన్యాశుల్కం నాటకం గురజాడ చేత రచింపబడింది (కర్మణీ).
2. కర్మణీ వాక్యాలు: కర్మ ప్రధానంగా గల వాక్యాలు కర్మణీ వాక్యాలు. ఆంగ్లంలో Possive Voice అంటారు. ఇందులో కర్మకు ప్రథమావిభక్తి ప్రత్యయాలు చేరతాయి. కర్తకు తృతీయా విభక్తి ప్రత్యయాలు చేరతాయి. క్రియకు ‘బడు’ అనే ప్రత్యయం చేరుతుంది. ఉదా: పోతన చేత భాగవతం రచించబడింది (కర్మణీ)
పోతన భాగవతాన్ని రచించారు (కర్తరీ).
కర్మణీ వాక్యాలు తెలుగులో ఆంగ్ల, సంస్కృ త భాషా ప్రభావాల వల్ల వచ్చాయి.
కొన్ని కర్మణీ వాక్యాలు:
• రాముడి చేత రావణుడు సంహరించబడెను. (కర్మణీ)
• రాముడు రావణుని సంహరించాడు. (కర్తరీ)
• అర్జునుడి చేత మత్స్యయంత్రం చేధించబడింది. (కర్మణీ)
• అర్జునుడు మత్స్యయంత్రాన్ని చేధించాడు. (కర్తరీ)

గత డీఎస్సీలో అడిగిన ప్రశ్నలు

  1. నాకు ఆకలిగా ఉంది - ఈ వాక్యం? (ఎల్‌పీ - 2012)
    1) కర్మార్థక వాక్యం
    2) కర్తృరహిత వాక్యం
    3) విధ్యర్థక వాక్యం
    4) కర్తృసహిత వాక్యం
  2. ‘వాళ్ల నలుగురిలో అతను మంచివాడు’ అనే వాక్యంలో ‘లో’ ప్రత్యయం బోధించే అర్థం? (ఎస్‌ఏ - 2012)
    1) నిర్ధారణార్థం
    2) ఔపశ్లేషకం
    3) వైషయికార్థం
    4) అభివ్యాపకార్థం
  3. ‘జీతాలు చాలక ఎన్జీవోలు సమ్మె చేశారు’ అనే వాక్యంలోని అసమాపక క్రియ? (ఎస్‌ఏ-2012)
    1) వ్యతిరేకతమున్నర్థకం
    2) వ్యతిరేక అనంతర్యార్థకం
    3) వ్యతిరేక శత్రర్థకం
    4) వ్యతిరేక క్త్వార్థకం
  4. ‘గుడ్డి కన్ను మూసినా ఒక్కటే, తెరిచినా ఒక్కటే’ అనే వాక్యంలోని అసమాపక క్రియ? (ఎస్‌ఏ-2012)
    1) చేదర్థకం
    2) ప్యర్థకం
    3) క్త్వార్థకం
    4) శత్రర్థకం
  5. ఆమె నోటితో మాట్లాడి, నొసలుతో వెక్కిరిస్తుంది. అనే వాక్యంలో ‘తో’ ప్రత్యయం ఈ అర్థంలో వచ్చింది? (ఎస్‌ఏ-2012)
    1) రీత్యర్థం
    2) గమ్యార్థం
    3) సహార్థం
    4) కరణార్థం
సమాధానాలు 1) 2 2) 1 3) 4 4) 2 5) 4
Published date : 28 Feb 2015 01:10PM

Photo Stories