Skip to main content

పదం, ప్రాతిపదిక , ప్రత్యయం , అవ్యయం....

1. పదం 2. ప్రాతిపదిక
3. ప్రత్యయం 4. అవ్యయం
5. పదం- అర్థాలు 6. నానార్థాలు
7. పర్యాయపదాలు 8. వ్యుత్పత్యర్థాలు

1. పదం: వాక్ వ్యవహారంలో అర్థభేదక సామర్థ్యం ఉన్న కనిష్టాంశాన్ని వర్ణం అంటారు. అర్థభేదక వర్ణాల సమూహమే పదం. ఉదా: పలక, అరక.

2. ప్రాతిపదిక: చిన్నయసూరి నామంబనగా ‘ప్రాతిపదిక’ అని నిర్వచించాడు. నామమే ప్రాతిపదిక అన్నాడు. దీనికి ప్రకృతి అనే పర్యాయపదం ఉంది. నామవిభక్తి ప్రత్యయాలు, తద్ధిత ప్రత్యయాలు చేరడానికి తగిన ప్రకృతినే ప్రాతిపదికగా నిర్వచించవచ్చు.

ఉదా: రవిని. ఈ పదంలో ‘రవి’ అనేది ప్రాతిపదిక. ని అనేది ద్వితీయవిభక్తి. ప్రత్యయం చేరి కర్మార్థంలో రవిని అయింది.

3. ప్రత్యయం: అర్థ విశేషాన్ని సూచించేందుకు శబ్దానికి చేరే అక్షరాన్ని, అక్షరాలను ప్రత్యయం అనొచ్చు. ప్రథమాది విభక్తులు ప్రత్యయాలు. విభక్తులు శబ్దాలకు చివర చేరతాయి. విభక్తులనే కారకాలంటారు. క్రియతో అన్వయాన్ని కలిగించేవి కారకాలు. చిన్నయసూరి కారకాలను ఆరు విధాలుగా వర్గీకరించారు.

• కర్మకారకం-ప్రథమ, ద్వితీయా విభక్తులు
• కరణ కారకం - తృతీయా విభక్తి
• సంప్రదాన కారకం - చతుర్థీ విభక్తి (త్యాగోద్దేశం సంప్రదానం)
• అపాదాన కారకం- పంచమీ విభక్తి - (అపాయ జుగుప్స, భయ, పరాజయాలకు సంబంధించింది)
• అధికరణ కారకం - సప్తమీ విభక్తి (అధికరణమంటే ఆధారమని అర్థం)
• షష్ఠీ విభక్తికి కారకం లేదు.

4. అవ్యయాలు: లింగ విభక్తి వచన శూన్యం అవ్యయమని, లింగ విభక్తి వచన రహితాలు అవ్యయాలు అని అర్థం. అవ్యయాలు రెండు విధాలు. I. ప్రతిపదోక్తాలు II. లాక్షణికాలు

I. ప్రతిపదోక్తాలు: సహజసిద్ధంగా పద రూపంలో ఉండి అవ్యయాన్ని సూచించేవి ప్రతిపదోక్తాలు. ఇవి అనేక విధాలు. అవి.. సముచ్ఛయార్థకాలు, వికల్పార్థకాలు, హేత్వర్థకాలు, ఆశ్చర్యార్థకాలు, ప్రశంసార్థకాలు, సంతాపార్థకాలు, తిరస్కారార్థకాలు, ప్రశ్నార్థకాలు, సాదృశ్యార్థకాలు, స్థలార్థకాలు, కాలార్థకాలు, తూష్ణీమర్థకాలు, నిశ్చయార్థకాలు, కిలార్థకాలు, ప్రకారార్థకాలు. ఇవి కాకుండా సంస్కృతం నుంచి సదా, సర్వత్రా, వృథా, బహుధా క్వాచిత్కం, బహుశః, ప్రాయశః వంటి అవ్యయాలు తెలుగులో ప్రవేశించాయి.

1. సముచ్ఛయార్థకాలు: యు, ను అనేవి సముచ్ఛయార్థకాలు. ఉదా: రాముడును, లక్ష్మణుడును, మరియును సీత.

2. వికల్పార్థకాలు: ఏని, కాన, ఐన, అయ్యున్ మొదలైనవి వికల్పార్థకాలు. ఉదా: వచ్చినేని, అతడైన, ప్రసన్నుడయ్యున్.

3. హేత్వర్థకాలు: కనుకన్, కాబట్టి మొదలైనవి.

4. ఆశ్చర్యార్థకాలు: అయ్యారే!, బాపురే!, ఆహా!, ఔరా!, అమ్మకచెల్లా!

5. ప్రశంసార్థకాలు: ఓహో, ఆహా, వహ్వా, భళీ, సెబాసు.

6. సంతాపార్థకాలు: సానుభూతి సూచకాలు. అయ్యో!, అక్కటా, కటకటా.

7. తిరస్కారార్థకాలు: తిరస్కార సూచకాలు, ఛీ, ఫో! మొదలైనవి.

8. సాదృశ్యార్థకాలు: వలెన్, పోలెన్, బలెన్, మాడ్కి, అట్లు మొదలైనవి ఉపమావాచకాలు.

9. స్థలకాలార్థకాలు: స్థలకాలానుగుణాలను సూచించేవి. ఇక్కడ, నేడు, రేపు.

10. తూష్ణీమర్థకాలు: ఊరక, మిన్నక.

11. నిశ్చయార్థకాలు: కదా! కాదె! సుమా! సుమ్మీ.

12. కిలార్థకాలు: అట, అంట వంటి పదాలు.

13. ప్రకారార్థకాలు: అట్లు, ఇట్లు.

II. లాక్షణిక అవ్యయాలు: వ్యాకరణ లక్షణాల వల్ల సిద్ధించిన అవ్యయాలన్నీ లాక్షణిక అవ్యయాలు. అసమాపక క్రియలన్నీ లాక్షణిక అవ్యయాలు.

1. క్త్వార్థకాలు: భూతకాలిక అసమాపక క్రియలు క్త్వార్థకాలు. ఉదా: చూసి, చేసి, తిని, వెళ్లి, వచ్చి.

2. వ్యతిరేక క్త్వార్థకాలు: క్రియకు వ్యతిరేకా ర్థాన్ని సూచించే ‘అక’ చేరుతుంది. ఉదా: చూడక, చేయక, తినక, రాక.

3. శత్రర్థకాలు: వర్తమాన కాల అసమాపక క్రియలు. క్రియకు ‘చున్’ అనే ప్రత్యయం చేరుతుంది. ఉదా: చేయుచున్, తినుచున్, చూచుచున్.

4. తుమున్నర్థకాలు: ‘కొరకు’ అనే అర్థాన్నిచ్చే అసమాపక క్రియలు. ‘అన్’ ప్రత్యయం క్రియకు చేరుతుంది. ఉదా: చేయన్, చేయగన్, వచ్చినన్, చూచినన్, చేసినన్.

5. అనంతర్యార్థకాలు: తర్వాత అనే అర్థాన్నిచ్చే అసమాప క్రియలు. క్రియకు ‘డున్’ అనే ప్రత్యయం చేరుతుంది. ఉదా: చేయుడున్, వ్రాయుడున్, వచ్చుడున్.

6. చేదర్థకాలు: ‘అయితే’ అనే అర్థాన్నిచ్చే అసమాపక క్రియలు. క్రియకు ‘ఇనన్’ ప్రత్యయం చేరుతుంది. ఉదా: తినినన్, చేసినన్, వ్రాసినన్.

7. భావార్థకాలు: క్రియకు ‘ట’ ప్రత్యయం చేరుతుంది. ఉదా: వచ్చుట, చూచుట.

8. ఆశీర్వాద్యర్థకాలు: ఆశీర్వదించే అర్థాలు, శపించే అర్థాలు. క్రియకు ఎడున్, తన్ మొదలైన ప్రత్యయాలు చేరతాయి. ఉదా: ప్రసన్నులయ్యెడున్, కావుతన్

5. పదం- అర్థం: అర్థవంతమైన వర్ణాల సము దాయం పదం. ప్రతి పదానికి అర్థం ఉంటుంది. ఒక పదానికి అనేక అర్థాలుంటే వాటిని నానార్థాలు అంటారు. ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలను పర్యాయపదాలు అంటా రు. పదానికి సంబంధించిన పుట్టుక, దాని అర్థాన్ని సవివరంగా తెలియజేసేవి వ్యుత్పత్తి అర్థాలు.

పదం

నానార్థాలు

అంకిలి:

ఆపద, క్షోభ.

అంగుష్ఠం:

బొటనవ్రేలు, అంగుళం.

అండజయు:

పాము, చేప, పక్షి,తొండ, కస్తూరి.

అంతర్యామి:

పరమాత్మ, జీవాత్మ.

ఆశరుడు:

రాక్షసుడు, అగ్ని.

ఆర్యుడు:

మంచివాడు, పూజ్యుడు.

ఆళి:

పంక్తి, తేలు, చెలికత్తె

ఇష్టి:

కోరిక, యజ్ఞం, కత్తి

ఈశుడు:

రాజు, శివుడు, మన్మథుడు, సంపన్నుడు.

ఉక్తి:

సరస్వతి, మాట.

ఉదాత్తుడు:

గొప్పవాడు, ఇచ్చువాడు.

ఉమ:

పార్వతి, కాంతి, పసుపు.

అక్షరం:

వర్ణం, రూపం, నాశనం లేనిది, పరబ్రహ్మం.

అశని:

వజ్రాయుధం, పిడుగు, మెరుపు.

సౌరభం:

సువాసన, కుంకుమపువ్వు, ఎద్దు.

ధనం:

విత్తం, ధనిష్ఠానక్షత్రం, ధనియాలు.

కేసరి:

సింహం, గుర్రం, ఆంజనేయుని తండ్రి.

గురువు:

ఉపాధ్యాయుడు, తండ్రి బృహస్పతి.

తీర్థం:

పుణ్యక్షేత్రం, జలం, యజ్ఞం

శ్రీ:

సంపద, లక్ష్మి, విషం, సాలెపురుగు.

పుండరీకం:

పెద్దపులి, తెల్ల తామర, తెల్ల గొడుగు.

కరము:

చేయి, తొండం, కిరణం.

ఉద్యోగం:

పని, అధికారం,యత్నం.

వ్యవసాయం:

కృషి, పరిశ్రమ, ప్రయత్నం

సుధ:

సున్నం,పాలు, అమృతం.

ఉచితం:

ఊరక, తగినది, మితం.

తాత:

బ్రహ్మ, తండ్రికి తండ్రి, తల్లికి తండ్రి.

గగనం:

ఆకాశం, శూన్యం,దుర్లభం

శిఖ:

సిగ, కొన, కొమ్ము.

భవం:

పుట్టుక, బ్రతుకు, ప్రపంచం.

పర్యాయపదాలు

తావి:

సుగంధం, పరిమళం, సౌరభం.

హలం:

నాగలి, సీరం, లాంగలం.

సామెత:

సమత, లోకోక్తి, నానుడి, పురాణోక్తి.

హిరణ్యము:

కనకం, బంగారం, కాంచనం, పసిడి.

కార్ముకం:

విల్లు, ధనస్సు, సింగణి, శరాసనం.

కపి:

మర్కటం, కోతి,వానరం.

క్ష్మా:

భూమి, ధరణి, ధాత్రి, మహి, పృథ్వి.

కేతనం:

జెండా, ధ్వజం, పతాకం.

ఘనసారం:

కర్పూరం, ఘనరసం, కప్పురం.

గంగ:

భాగీరథి, జాహ్నవి.

ఇంద్రధనస్సు:

హరివిల్లు, ఇంద్రచాపం, వాల్మీకం.

కిరీటం:

మౌళి, మకుటం, ఉష్ణీషం, కోటీరం.

రైతు:

కర్షకుడు, సేద్యగాడు, క్షేత్రజీవుడు.

కళత్రం:

భార్య, ఇల్లాలు, పత్ని సతి.

తనువు:

శరీరం, దేహం, కాయం.

ఎండ్రి:

పీత, కుళీరం,ఎండ్రకాయ

పులుంగు:

పక్షి, విహంగం, ఖగం.

తనయుడు:

పుత్రుడు, కొడుకు, సుతుడు.

తరువు:

చెట్టు, వృక్షం, మహీరుహం

కదనం:

యుద్ధం, రణం, సమరం.

పుండరీకం:

వ్యాఘ్రం, శార్దూలం,పులి.

క్షత్రియుడు:

రాజు, విభుడు, నృపుడు.

నీహారం:

మంచు, హిమం, తుహినం.

సముద్రం:

వారధి, కడలి, అబ్ది, సాగరం.

వ్యుత్పత్యర్థాలు

ఒక పదానికి సంబంధించిన పుట్టుక, నేపథ్యం దాని అర్థం మొదలైన వాటిని తెలియజేసేవి వ్యుత్పత్యర్థాలు.

• భూజం - భూమియందు పుట్టింది (వృక్షం)
• ఇల్లాలు-ఇంటి యందలి స్త్రీ (గృహిణి)
• ఆఖండలుడు - కొండల రెక్కలను ఖండించినవాడు (ఇంద్రుడు)
• ఇతిహాసం - ఇది ఈ విధంగా జరిగిందనే పూర్వ రాజుల చరిత్ర (రామాయణం, భారతం)
• ఇందిర - గొప్ప ఐశ్వర్యం గలది (లక్ష్మీదేవి)
• ఇంద్రాణి - ఇంద్రుడి భార్య (శచీ దేవి)
• ఉదధి - ఉదకమును ధరించునది (సముద్రం)
• ఉపేంద్రుడు - ఇంద్రుని తమ్ముడు (విష్ణువు)
• ఉర్వి - పర్వతాలతో కప్పి ఉన్నది (భూమి)
• ఉతాకం - నయన కాంతితో కాకులను దహించునది (గుడ్లగూబ)
• ఔరసుడు - తనకు ధర్మపత్ని యందు పుట్టినవాడు (వారసుడైన పుత్రుడు)
• లాంగలం - దున్నేటప్పుడు భూమిలో చొచ్చునది (నాగలి)
• వాగ్మి - చతురంగా మాట్లాడే నేర్పు గలది/గలవాడు (చిలుక, బృహస్పతి)
• సీరపాణి- నాగలి హస్తమునందు గలవాడు (బలరాముడు)
• అలివేణి - తుమ్మెద వంటి నల్లని కురులు గలది (స్త్రీ)
• పన్నగము- పాదములతో నడవనిది (పాము)
• రత్నగర్భ- రత్నములు గర్భం నందు కలది (భూమి)
• అపర్ణ - ఆకులను సైతం తినక కఠోర తపస్సు చేసింది (పార్వతి)
• మర్త్యుడు- మృతి నొందువాడు (మానవుడు)
• సరసిజనాభుడు - పద్మం నాభి యందు గలవాడు విష్ణువు
• కమలిగర్భుడు - కమలం గర్భముగా గలవాడు (బ్రహ్మ)
• హుతభుక్కు - హుతమును (హోమాగ్ని) భుజించువాడు (అగ్ని)
• పుత్రుడు - పున్నామ నరకం నుంచి రక్షించేవాడు (కుమారుడు)
• జీమూతం - దీని యందు నీరు బంధించి ఉంటుంది (మేఘం)
• ఛాత్రుడు - గురువు దోషాలను ఛత్రం వలె కప్పిపుచ్చు శీలం గలవాడు (శిష్యుడు)

గత డీఎస్సీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

  1. ప్రత్యయాలు తెలుగులో ఇలా చేరతాయి? (L.P.2012)
    1) ధాతువుకు ముందు చేరతాయి
    2) ధాతువుకు తర్వాత చేరతాయి
    3) ధాతువునే తమలో చేర్చుకుంటాయి
    4) ధాతువుకు మధ్యలో చేరతాయి
  2. ప్రత్యయానికి నిబద్ధమైన పద రూపం? (L.P.2012)
    1) పదం
    2) ప్రాతిపదిక
    3) సపదాంశం
    4) పదాంశం
  3. నల్లజీడి అనే అర్థం ఏ పదానికున్న నానార్థాల్లో ఒకటి? (L.P.2012)
    1) అనామకము
    2) అనలము
    3) అనంతము
    4) అనిలము
  4. ఉదకం దీనియందు బంధించి ఉండటం వల్ల దీన్ని ______ అంటారు. (L.P.2012)
    1) జీమూతము
    2) జలనిధి
    3) జలకలశం
    4) జలజం
  5. భూమిని స్వల్పంగా చేయునది? (L.P.2012)
    1) కులిశము
    2) కలశము
    3) కుముదము
    4) కైలాసము
  6. పదాది యకార లోపానికి ఉదాహరణలు (S.A.2012)
    1) ఊసర, ఓలగం
    2) ఉంగరం, జవ్వనం
    3) అక్కరం, ఇచ్ఛ
    4) ఆసము, ఆమడలు
  7. పిడుగు అనే మాటకు పర్యాయపదాలు (S.A.2012)
    1) విద్యుల్లత, మెరుపు తీగె, మించు
    2) మేఘభూతి, వృష్టి, స్వనితం
    3) అశని, వజ్రం, దంభోళి
    4) నీటిధారి, ధరాధరం, అభ్రమం
  8. శ్వాస, నాద స్పర్శాలకు బేధం కలిగించేది? (S.A.2012)
    1) నాదతంత్రుల ప్రకంపనం
    2) స్థానకరణాలు
    3) అనునాసిక్యం
    4) పెదవుల ఆకారం
  9. రెండు వ్యాపారాల్లో వైరుధ్యం ఉన్నప్పుడు వాడే అసమాపక్రియ? (S.A.2012)
    1) అనంతర్యార్థకం
    2) తుమున్నర్థకం
    3) శత్రర్థక క్రియ
    4) అప్యర్థక క్రియ
  10. దీనితో మింగుతారు కాబట్టి గొంతును ఇలా అంటారు? (S.A.2012)
    1) ఘటం
    2) గళం
    3) కంఠం
    4) కంధరం

సమాధానాలు

1) 2 2) 2 3) 1 4) 1 5) 1 6) 1 7) 3 8) 2 9) 3 10) 2

మాదిరి ప్రశ్నలు

  1. ప్రాతిపదికకు పర్యాయపదం?
    1) వర్ణం
    2) నామం
    3) ప్రకృతి
    4) ప్రత్యయం
  2. అర్థ విశేషాన్ని సూచించేందుకు శబ్దానికి చేరే అక్షరాన్ని ఏమంటారు?
    1) ప్రత్యయం
    2) వర్ణం
    3) ప్రాతిపదిక
    4) క్రియా విశేషణం
  3. చిన్నయసూరి వివరించిన కారకాలెన్ని?
    1) 4
    2) 6
    3) 5
    4) 7
  4. కారకం లేని విభక్తి ఏది?
    1) తృతీయ
    2) చతుర్థీ
    3) పంచమీ
    4) షష్ఠీ
  5. సంద్రదాన కారకంలో క్రియకు చేరే విభక్తి
    1) ద్వితీయ
    2) ప్రథమ
    3) చతుర్థీ
    4) తృతీయ
సమాధానాలు: 1) 3 2) 1 3) 2 4) 4 5) 3
Published date : 26 Feb 2015 03:13PM

Photo Stories