Skip to main content

Zojila Tunnel: ఆసియాలోనే అతిపెద్ద సొరంగ మార్గాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు?

NItin Gadkari-Zozila Tunnel

జమ్మూ, కశ్మీర్‌లోని శ్రీనగర్, లద్దాక్‌లోని లేహ్‌ల మధ్య ప్రయాణ కాలాన్ని మూడున్నర గంటల నుంచి 15 నిమిషాలకు తగ్గించే జోజిలా పాస్‌ సొరంగ మార్గం(జోజిలా టన్నెల్‌) నిర్మాణ పనులను సెప్టెంబర్‌ 28న కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పరిశీలించారు. అంతకుముందు శ్రీనగర్‌–లేహ్‌ మార్గంలో నిర్మిస్తున్న మరో టన్నెల్‌ ప్రాజెక్టు అయిన జెడ్‌–మోర్‌ పనులను కూడా మంత్రి పరిశీలించారు. జోజిలా టన్నెల్‌ ప్రాజెక్టు పనుల పూర్తికి గడువు 2026 అయినప్పటికీ 2023లోనే పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఎంఈఐఎల్‌ ఎం.డి. కృష్ణారెడ్డికి గడ్కరీ సూచించారు.

ఏడాది పొడవునా ప్రయాణాలు...

శ్రీనగర్‌ నుంచి లేహ్‌ ప్రాంతంలో ఉన్న రహదారిని హిమపాతం కారణంగా ఏడాదిలో 6 నెలలపాటు(శీతాకాలంలో) పూర్తిగా మూసివేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసలతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా సోనామార్గ్‌ నుంచి కార్గిల్‌ మీదుగా లేహ్, లడఖ్‌కు ఈ రహదారి జోజిలా టన్నెల్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడాది పొడవునా ప్రయాణాలకు వీలవుతుంది.

 

జోజిలా టన్నెల్‌ విశేషాలు...

  • ఇన్‌ఫ్రా దిగ్గజం మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ (ఎంఈఐఎల్‌) పోటీ సంస్థల కన్నా అత్యంత తక్కువగా కోట్‌ చేసి ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. ఎంఈఐఎల్‌ రూ. 4,509.5 కోట్లకు బిడ్‌ వేసింది.
  • నిర్మాణ పనులను 2020, అక్టోబర్‌ 15న మంత్రి గడ్కరీ ప్రారంభించారు.
  • సుమారు 14.15 కి.మీ. పొడవుండే ఈ టన్నెల్‌ను షెడ్యూల్‌ ప్రకారం ఆరేళ్లలో పూర్తి చేయాలి.
  • ఈ టన్నెల్‌ పూర్తయితే ఆసియాలోనే అత్యంత పొడవైన టన్నెల్‌గా నిలుస్తుంది. శ్రీనగర్‌–లేహ్‌ మధ్య ప్రయాణ సమయం 3 గం.ల నుంచి 15 నిమిషాలకు తగ్గిపోతుంది.
  • శ్రీనగర్‌–కార్గిల్‌–లేహ్‌ జాతీయ రహదారిపై 11,578 అడుగుల ఎత్తున ఉండటంతో ఇది వ్యూహాత్మక ప్రాజెక్టుగా మారింది.
  • ఈ సొరంగం అందుబాటులోకి వస్తే శ్రీనగర్, కార్గిల్, లేహ్‌ మధ్య అనుసంధానత సాధ్యమవుతుంది.

చ‌ద‌వండి: భారత్‌లో ఫ్యూచర్‌ ఇంజనీర్‌ ప్రోగ్రాం చేపట్టనున్న సంస్థ?

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : జోజిలా పాస్‌ సొరంగ మార్గం(జోజిలా టన్నెల్‌) నిర్మాణ పనులు పరిశీలన
ఎప్పుడు : సెప్టెంబర్‌ 28
ఎవరు : కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ
ఎక్కడ : జోజిలా, లద్దాఖ్‌
ఎందుకు : శ్రీనగర్, లేహ్‌ను అనుసంధానించేందుకు...
 

 

Published date : 29 Sep 2021 06:05PM

Photo Stories