Skip to main content

A New Policy Implimented in TS Cops Events: పరుగుపై పరేషన్‌... అమల్లోకి కొత్త విధానం

ఎస్సై, కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఈసారి కీలకమైన ఈవెంట్స్‌ నిర్వహణలో వడబోత విధానం అమలు చేయబోతోంది. గతంలోలా అన్నింటిలో పాల్గొనే అవకాశమిచ్చేందుకు బదులు ఈసారి వడబోతను అనుసరించబోతోంది.

ఈనెల 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 12 వేదికల్లో ఈవెంట్లు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. వీటిలో తొలుత పరుగుపందెం నిర్వహించనున్నారు. పురుషులు 1,600 మీటర్లు, మహిళలు 800 మీటర్ల పరుగును నిర్ణీత కాలంలో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో గట్టెక్కలేకపోతే అభ్యర్థులు ఇక వెనుదిరగాల్సిందే. తదుపరి పోటీలకు అవకాశం లభించదు.
గతంలో ఐదింటిలో మూడు పాస్‌ ఐతే చాలు....
గతంలో తొలుత అభ్యర్థుల శారీరక కొలతల్ని తీసుకునేవారు. పురుష అభ్యర్థుల ఎత్తు, ఛాతీ కొలతలు.. మహిళా అభ్యర్థుల ఎత్తును పరిగణనలోకి తీసుకునేవారు. అవి నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే తదుపరి ఈవెంట్లలో పాల్గొనేందుకు అనుమతించేవారు. కొలతల్లో అర్హత పొందిన పురుష అభ్యర్థులు 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, హైజంప్, 800 మీటర్ల పరుగు పోటీల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేవారు. ఈ క్రమంలో మొదటి పోటీలో అర్హత సాధించకపోయినా తదుపరి పోటీలకు అనుమతించేవారు. చివరకు అయిదు ఈవెంట్లలో ఏవేని మూడింటిలో ఉత్తీర్ణులైతే సరిపోయేది. 
మహిళా అభ్యర్థులకు ఇలా... 
మహిళా అభ్యర్థులు 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, షాట్‌పుట్‌ అంశాల్లో పాల్గొనేవారు.  ఏవేని రెండింటిలో అర్హత సాధిస్తే ఉత్తీర్ణులైనట్లు పరిగణించేవారు. ఈసారి మాత్రం తొలుత పరుగుపందెంలో ఉత్తీర్ణులైతేనే శారీరక కొలతల అంకానికి అనుమతించనున్నారు. అవి కూడా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే లాంగ్‌జంప్, షాట్‌పుట్‌ పోటీలకు అర్హత దక్కుతుంది. అనంతరం ఈ రెండు ఈవెంట్లను విజయవంతంగా పూర్తి చేయగలిగితేనే తుది రాతపరీక్షకు అవకాశం ఉండనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తొలుత పరుగు పోటీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరమేర్పడింది.

Published date : 06 Dec 2022 06:10PM

Photo Stories