Skip to main content

NEET Scandal: తమ్ముడి ‘నీట్‌’ రాసేందుకు అన్న చీటింగ్‌, ఎలా దొరికిపోయాడంటే..

NEET Scandal

దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ దేశవ్యాప్తంగా ఆదివారం జరిగింది.   రాజస్థాన్‌లోని బార్మర్‌లో గల అంత్రి దేవి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన నీట్ కేంద్రంలో  చీటింగ్‌ కేసు వెలుగు చూసింది.

 

వివరాల్లోకి వెళితే జోధ్‌పూర్ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న భగీరథ్ రామ్ తన తమ్ముడి స్థానంలో నీట్‌ పరీక్ష రాయడానికి అంత్రి దేవి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలకు వచ్చాడు. అతనిని  చూసిన ఎగ్జామినర్‌కు అనుమానం రావడంతో ఆరా తీశారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు భగీరథరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన తమ్ముడు గోపాల్ రామ్ స్థానంలో పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చానని తన తప్పును ఒప్పుకున్నాడు.

ఇలా.. డమ్మీ అని తేలింది
నీట్‌ పరీక్ష నిర్వహణకు బార్మర్‌లోని ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరంలోని ఆంత్రి దేవి స్కూల్‌లో నకిలీ అభ్యర్థిని గుర్తించినట్టు తమకు సమాచారం అందిందని బార్మర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ జస్రామ్ బోస్ తెలిపారు. పోలీసులు పరీక్షా కేంద్రానికి చేరుకుని నకిలీ అభ్యర్థిని విచారించగా, నిందితుడు డమ్మీ అభ్యర్థి అని తేలింది. ఈ ఉదంతంలో పోలీసులు భగీరథ్ రామ్, అతని తమ్ముడు గోపాల్‌రామ్‌లను అరెస్ట్ చేశారు.

భగీరథ రామ్ జోధ్‌పూర్ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ విద్యార్థి. తమ్ముడిని డాక్టర్‌ని చేసేందుకు మున్నా భాయ్‌ తరహాలో నకిలీ అభ్యర్థిగా పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చాడు. అయితే ఇంతలోనే పోలీసులకు పట్టబడ్డాడు. ప్రస్తుతం పోలీసులు ఈ సోదరులిద్దరినీ  విచారిస్తున్నారు

Published date : 06 May 2024 10:31AM

Photo Stories