MBBS: ఇకపై విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే..!
ప్రస్తుతం మన దేశంలో వైద్య విద్యకు నీట్ పరీక్ష అర్హత ఆధారంగా అడ్మిషన్లు కేటాయించడం.. ఎన్‌ఎంసీ నిర్దేశించిన విధానంలో పరీక్షల నిర్వహణతో ముగుస్తుంది. అయితే విదేశాల్లో ఎలాంటి నిబంధనలు లేకుండా ఫీజు ఆధారంగా సీట్లు పొంది కోర్సు పూర్తి చేస్తున్నారు. తాజాగా ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న వేల మంది భారతీయ విద్యార్థులు యుద్ధం కారణంగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. అయితే భారత్‌లో కంటే అత్యంత సులువైన పద్ధతితో విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీంతో విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసే వారికి కొన్ని నిబంధనలు తీసుకొచ్చేందుకు జాతీయ వైద్య మండలి ప్రత్యేక కసరత్తు చేస్తోంది.
కనీసం 54 నెలలు పూర్తి చేయాలనే..
ఇప్పటికే కొన్ని రకాల నిబంధనలు ఉన్నా వాటిని మరింత లోతుగా అధ్యయనం చేస్తూ కొత్తగా మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించింది. ఎంబీబీఎస్ కోర్సును కనీసం 54 నెలలు పూర్తి చేయాలనే నిబంధనను కఠినతరం చేస్తోంది. అలాగే కాలేజీలో అడ్మిషన్ పొందేముందు అక్కడి మౌలిక వసతులు, అత్యాధునిక పద్ధతుల తీరును పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తోంది.
ఇక ఆన్‌లైన్‌కి నో..
వైద్య విద్యలో ఆన్‌లైన్ పద్ధతిలో కొనసాగే తరగతులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవద్దని ఎన్‌ఎంసీ భావిస్తోంది. పూర్తిగా మాన్యువల్‌లో, ప్రయోగ విధానంలో తరగతులు నిర్వహించడమే మేలని అంచనాకు వచ్చింది. విదేశాల్లో వైద్య కోర్సు పూర్తి చేసిన తర్వాత ఇంటర్న్‌షిప్ నిర్వహించినా.. తిరిగి ఇక్కడ ఎన్‌ఎంసీ పరీక్షలో అర్హత సాధించడంతో పాటు ఇంటర్న్‌షిప్ మనోమారు చేయాల్సిన అంశాలను కఠినంగా అమలు చేయనుంది. ఇప్పటికే ఎన్‌ఎంసీ మార్గదర్శకాలు విడుదల చేసినప్పటికీ తాజా పరిణామాలతో వీటిని రివైజ్ చేసే అవకాశం ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.