Skip to main content

Medical Colleges: కొత్త వైద్య కళాశాలలను అడ్డుకోవడంతో భారీగా నష్టపోయిన విద్యార్థులు

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగా కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటవ్వకుండా అడ్డుకోవడంతో ఈ ఒక్క ఏడాదే ఏకంగా 700 ఎంబీబీఎస్‌ సీట్లను మన విద్యార్థులు కోల్పోవాల్సి వచ్చింది.
Blocking of new medical colleges is a major loss for students

ఫలితంగా మన విద్యార్థుల వైద్య విద్య కలలు ఛిద్రమయ్యాయి. పక్కనున్న తెలంగాణా రాష్ట్రంలో ఈ ఏడాది ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమై, 400 ఎంబీబీఎస్‌ సీట్లు పెరగడంతో అక్కడి విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెరిగాయి. 

ఇటు ఏపీలో మాత్రం పోటీకి అనుగుణంగా సీట్లలో వృద్ధి లేకపోవడంతో మన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణాలో తొలి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా అక్టోబర్ 1న‌ ఎంబీబీఎస్‌ ప్రభుత్వ కోటా (కన్వినర్‌) సీట్లను కేటాయించారు.

ఈ క్రమంలో ఏపీలో తొలి దశ ప్రభుత్వ కోటా కౌన్సెలింగ్‌ కటాఫ్‌లను ఓసారి పరిశీలిస్తే మన విద్యార్థులకు ప్రభుత్వం చేసిన ద్రోహం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది.  

చదవండి: MBBS Convenor Seats: ఈ ర్యాంకుకూ కూడా ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ సీటు

రిజర్వేషన్‌ విద్యార్థులకు తీవ్ర అన్యాయం 

వాస్తవానికి ఈ విద్యా సంవత్సరం పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పాడేరు వైద్య కళాశాలల్లో ఒక్కో చోట 150 సీట్లతో తరగతులు ప్రారంభం కావ్వాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా గత ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ, వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం కోసం బాబు ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా అనుమతులు రాకుండా మోకాలడ్డింది.

దీంతో కేవలం పాడేరులో 50 సీట్లు రాగా, మిగిలిన 700 సీట్లు విద్యార్థులు నష్టపోయారు. దీంతో నీట్‌ యూజీలో 600 పైబడి స్కోర్‌ చేసిన ఓసీ, 500 పైబడి స్కోర్‌ చేసిన ఎస్సీ, బీసీ విద్యార్థులకు ఏపీలో ప్రభుత్వ కోటా సీట్‌లు తొలి దశలో లభించలేదు. 

అదే తెలంగాణాతో పోలిస్తే ఏపీలో సీట్లు లభించిన చివరి కటాఫ్‌ల మధ్య వ్యత్యాసం రిజర్వేషన్‌ వర్గాల్లోనే 130 మార్కులకు పైగా ఉంటోంది. తొలి దశ కౌన్సెలింగ్‌లో తెలంగాణలో బీసీ–ఏ విభాగంలో 437 మార్కులకు చివరి సీట్‌ లభించగా, అదే ఏపీలో 568 వద్ద ఆగిపోయింది.

తెలంగాణలో చివరి సీట్‌ దక్కించుకున్న విద్యార్థులకంటే ఏకంగా 131 మార్కులు అదనంగా సాధించినా ఏపీ విద్యార్థులకు నిరాశే మిగిలింది. 

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఓసీ విభాగంలో తొలి దశలో మన రాష్ట్రంలో 615 మార్కుల వద్ద నిలిచిపోయింది. ఈ విభాగంలో తెలంగాణ విద్యార్థులకు 528 మార్కుల వరకు సీట్‌ దక్కింది. ఎస్సీ విభాగంలో తెలంగాణతో పోలిస్తే ఏపీలో 74 మార్కుల  వ్యత్యాసం ఉంది.

అక్కడ ఎస్సీ విభాగంలో 446 మార్కుల వరకు సీట్‌ వస్తే.. ఏపీలో 520 మార్కుల వద్దే ఆగిపోయింది.

సన్నగిల్లిన ఆశలు  

గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెంచడంతో పాటు, పేదలకు ఉచిత సూపర్‌ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేసే లక్ష్యంతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

2023–24 విద్యా సంవత్సరం ఐదు వైద్య కళాశాలలు ప్రారంభించి 750 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. 2024–25లో ఐదు, 2025–­26లో మిగిలిన ఏడు కళాశాలలు ప్రారంభించాలని ప్రణాళిక రచించారు. 

కాగా, చంద్రబాబు ప్రభుత్వం కొత్త కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని నిర్ణయించి, ఈ ఏడాది ఐదుకు గాను నాలుగు కళాశాలలు ప్రారంభం అవ్వకుండా అడ్డుకుంది. పక్క రాష్ట్రంలో కనీసం భవనాలు, ఆస్పత్రులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోయినా తాత్కాలిక ఏర్పాట్లతో కొత్త కళాశాలలు ప్రారంభిస్తుంటే.. గత ప్రభుత్వంలో 80 శాతం మేర భవన నిర్మాణాలు పూర్తై, పూర్తి స్థాయిలో బోధనాస్పత్రులు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఏపీ ప్రభుత్వం కళాశాలలను అడ్డుకోవడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. 

బాబు ప్రభుత్వం ప్రైవేట్‌ మోజు వల్ల ఇప్పటికే 700 సీట్లు రాష్ట్రం నష్టపోగా, వచ్చే ఏడాది ఏడు కళాశాలలు ప్రారంభం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. తద్వారా మరో 1050 సీట్లు రాష్ట్రం నష్టపోనుంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే పిల్లలకు లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ల కోసం రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేసిన పేద, మధ్య తరగతి కుటుంబాలు మరో ఏడాది కోచింగ్‌కు పంపేందుకు సాహసం చేయడం లేదు. వారిలో వైద్య విద్యపై ఆశలు సన్నగిల్లి ప్రత్యామ్నాయ కోర్సులు చూసుకుంటున్నారు. 

Published date : 02 Oct 2024 04:25PM

Photo Stories