Skip to main content

వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి పీహెచ్‌డీ తప్పనిసరి.. 50 వేల మంది ఆశలు గల్లంతు..

సాక్షి, హైదరాబాద్‌: యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిర్ణయంతో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దాదాపు 50 వేల మంది అర్హత కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.
ఇంతకు ముందే ఆయా పోస్టులను భర్తీచేసి ఉంటే వారంతా అర్హులయ్యేవారని అంటున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి పీహెచ్‌డీ చేసి ఉండాలన్న యూజీసీ నిర్ణయం అనేకమంది నిరుద్యోగులకు నష్టం చేకూర్చుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కేంద్రానికి లేఖ రాయాల్సి ఉన్నా, అధికారులు పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో దశాబ్దంగా వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ జరగలేదు. 2017లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ కొన్ని కారణాలతో ఈ పోస్టులను ఇప్పటికీ భర్తీ చేయలేదు. గతంలో ఈ పోస్టులకు నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌), స్టేట్‌ లెవల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (స్లెట్‌) అర్హతగా నిర్ధారించారు. ఇవి లేనివారికి ఎంఫిల్, పీహెచ్‌డీ చేసినా సరిపోయేది. కానీ తాజాగా నెట్, స్లెట్‌ ఉన్నా వాటికి వెయిటేజీ మార్కులు మాత్రమే ఉం టాయని, పీహెచ్‌డీ తప్పనిసరిగా ఉండాల్సిందేనని యూజీసీ స్పష్టం చేసింది. పైగా ఈ నిర్ణయాన్ని గత నెల ఒకటో తేదీ నుంచే అమలులోకి తెచి్చంది. ప్రస్తుతం రాష్ట్రంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేస్తామని ఉన్నత విద్యా మండలి చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఎంతో కష్టపడి నెట్‌ లేదా స్లెట్‌లలో అర్హత సాధించిన వారంతా నష్టపోతారని అంటున్నారు. వారికి పీహెచ్‌డీ చేసే అవకాశం ఉన్నా అసిస్టెంట్‌ ప్రొఫె సర్‌ పోస్టులకు నెట్, స్లెట్‌ సరిపోతుందని భావించి చాలామంది ఊరుకున్నారు. కానీ యూజీసీ నిర్ణయం వారి జీవితాన్ని చిన్నాభిన్నం చేసిందని అంటున్నారు. యూజీసీ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో కేవలం ఆరు వేల మంది పీహెచ్‌డీ పూర్తి చేసిన వారే అర్హులవుతారని ఉన్నత విద్యా మండలి వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత పద్ధతిలోనే పోస్టుల భర్తీ జరగాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

పరిశోధన అంశంపై నిర్ణయం యూజీసీదే..
ప్రస్తుతం పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన వారు ఏ అంశంపై పరిశోధన చేయాలన్నది వారి ఇష్టానుసారంగా జరుగుతుంది. ఆ మేరకు అభ్యర్థి తాను ఎంచుకున్న అంశంలో పరిశోధన తీరును వివరిస్తూ క్లుప్తంగా నివేదిక తయారు చేసి విశ్వవిద్యాలయానికి సమర్పంచాలి. అయితే వారి సొంతానికి పరిశోధన అంశాన్ని వదిలేయడం వల్ల ఒరిగేదేమీ ఉండటం లేదని, సులువైన అంశాలు తీసుకొని చాలామంది తూతూమంత్రంగా పీహెచ్‌డీ పూర్తి చేస్తున్నారన్నది నిపుణుల ఆరోపణ. అంతేకాక ఇతరులు పూర్తి చేసిన పీహెచ్‌డీ థీసిస్‌లను దగ్గర పెట్టుకొని కొందరు కాపీ కొడుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. పరిశోధన అంటే అది సమాజానికి ఉపయోగపడాలన్నది యూజీసీ భావన. కాబట్టి ఏ అంశంపై పీహెచ్‌డీ చేయాలన్నది కూడా యూజీసీనే నిర్ణయిస్తుందని ఉన్నత విద్యా మండలి వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉందని అంటున్నారు.
Published date : 10 Aug 2021 05:25PM

Photo Stories