Skip to main content

విద్యార్ధులు.. శేయోమార్గాన్ని ఎంచుకోవాలి!

ఖాళీ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా చదువుకోవాలనే విషయం విద్యార్థులందరికీ తెలుసు.
అయినా సరే దానిపై ఆసక్తి కనబరచరు. కష్టపడితే ఫలితం దక్కుతుందని, కష్టపడనిదే ఫలితం రాదనీ వారికి తెలుసు. అయినా సరే అదేమీ పట్టించుకోరు. టీవీలవల్ల సోషల్ మీడియావల్ల సమయం వృథా అవుతుందని తెలుసు. అయినా అది మానుకోరు. ఇక కొంతమంది వృత్తి పనులు చేసేవారుకూడా ఇలాగే ఉంటారు. సకాలంలో పనిచేయరు. అందుకు కారణం ఏదైనా కావ చ్చు. అలా ఉండడం తగదు కదా. ఈ స్థితి మారాలంటే సంకల్పశక్తిని పెంపొందించుకోవడమే మార్గం. జీవితంలో ఏకొద్దిపాటి విజయం సాధించిన దానికి కారణం మన లోని సంకల్పశక్తే. అయితే ఈ శక్తిని నిరంతరం మరింత పెంపొందించుకోవచ్చు. సంకల్పశక్తి అంటే ఏమిటో కొన్నిమాటల్లో అర్థం చేసుకుందాం. ప్రపంచంలో కొన్ని మనకు మంచివి కలిగించేవి ఉంటాయి. అవి కలిగించే మంచిని శ్రేయస్సు అంటారు. మరికొన్ని సుఖాన్నిచ్చేవి ఉంటాయి. ఈ సుఖాన్ని ప్రేయస్సు అంటాము. సాధారణంగా మనకు శ్రేయస్సునిచ్చేవి మనకు రుచించ వు..అంతేకాకుండా వాటిని చేయాలంటే మనకు ఇష్టం ఉండదు. కానీ ప్రేయస్సునిచ్చే పనులకోసం ఎగబడతాము. అయితే, ఈ పనులు ముందు సుఖంగా తోచినా తర్వాత ఎక్కడలేని కష్టాలనూ కొనితెస్తాయి. కాబట్టి మనకు శ్రేయస్సును కూర్చే పని చేయడం అలవాటు చేసుకోవాలి. సంకల్పశక్తి కొరవడితే మనిషి ఎలా తయారవుతాడో చెప్పే కథ ఒకటి ఉంది. ‘‘నీవు ఎందుకు ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తూ ఉంటావు’’ అని ఒకసారి ఎవరో దుర్యోధనుడిని ప్రశ్నించారు. దీంతో ఆయన మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన జవాబిచ్చాడు. ‘‘నాకు ధర్మమేదో తెలుసు. అయితే ఆ మార్గంలో పనిచేయలేను. నాకు అధర్మమేమిటో తెలుసు. అయినప్పటికీ అధర్మమైన పనులు చేయకుండా ఉండలేను’’ అని అన్నా డు. ప్రపంచంలో అత్యధికుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందేమోననిపిస్తుంది.
Published date : 06 Jan 2020 04:07PM

Photo Stories