విద్యార్ధులపై వత్తిడిలేని విద్య తీసుకురావాలి: సీఎం వైఎస్ జగన్
విద్య అన్నది వికాసానికి దారితీయాలే తప్ప ఒత్తిడితో సతమతమయ్యే పరిస్థితి ఉండకూడదన్నారు. యూజీసీ, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని విద్యా శాఖ అధికారులకు ఆయన సూచించారు. అలాగే, ఈ విద్యా సంవత్సరంలో వసతి దీవెన, విద్యాదీవెన పథకాల అమలుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఉన్నత విద్యపై సీఎం వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ వర్సిటీల్లో 50 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద, మిగిలిన 50 శాతం సీట్లు వర్సిటీ కోటా కింద ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ప్రకారం కన్వీనర్ కోటాలో పేద పిల్లలకు సీట్లు వస్తాయని, వారికి ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఫీజులు చెల్లిస్తుందని సీఎం జగన్ స్పష్టంచేశారు. వర్సిటీలకు ఎన్‌బీఏ, ఎన్‌ఏసీ-నాక్ గుర్తింపు కూడా ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ క్లాసులు, యూనివర్సిటీల్లో ప్రమాణాలు, ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, కోర్సుల ఇంటిగ్రేషన్.. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు, కెపాసిటీ బిల్డింగ్ కాంప్లెక్స్‌లు అంశాలపై సీఎం సూచనలు చేశారు.
ఆన్‌లైన్ క్లాస్‌లు..
ఉన్నత విద్యలో ఇప్పటివరకూ చేపట్టిన సంస్కరణలు, వాటి ప్రగతి గురించి అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో క్లాసుల ప్రారంభం, తీసుకుంటున్న చర్యలు.. కోవిడ్ కాలంలో ఎనీటైం-ఎనీవేర్ లెర్నింగ్ పద్ధతిలో తరగతులు నిర్వహించామని అధికారులు తెలిపారు. అలాగే, ఇప్పటివరకు 5 లక్షల ఆన్‌లైన్ క్లాసులు జరిపినట్లు చెప్పారు. దీంతో సీఎం స్పందిస్తూ.. దీన్ని ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసి మరింత మందికి అందుబాటులోకి తీసుకువచ్చేలా ఆలోచనలు చేయాలని ఆదేశించారు.
యూనివర్సిటీలు - ప్రమాణాలు..
కాగా, ప్రైవేటు యూనివర్సిటీల్లో ప్రమాణాలపైనా సమావేశంలో చర్చించారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, బోధన ఉంటుందనే ఉద్దేశంతోనే ఎవరైనా ప్రైవేటు సంస్థలకు వెళ్తారని.. అందువల్ల ఆయా సంస్థల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రమాణాలున్నాయా? లేవా? అన్నది పరిశీలించాలని సీఎం సూచించారు. ప్రైవేటు కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు.. ఉండాల్సిన సిబ్బంది లేకపోతే గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రైవేటు యూనివర్శిటీలకు ఎన్‌బీఏ, ఎన్‌ఏసీ-నాక్ గుర్తింపు ఉండాలని నిర్ణయించారు.
ప్రతిష్టాత్మక సంస్థల్లో సమస్యలు ఉండొద్దు
ఐఐటీ తిరుపతి, ఐఐఎస్‌ఈఆర్ తిరుపతి, ఐఐఎం విశాఖ, ఎన్‌ఐటీ తాడేపల్లిగూడెంల్లో పనుల ప్రగతి గురించి చర్చకు వచ్చినప్పుడు ఆయా సంస్థలకు వెళ్లే రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం, విద్యుత్ కనెక్షన్ వంటి వాటిలో సమస్యలు లేకుండా చూడాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. గిరిజన విశ్వవిద్యాలయంపైనా దృష్టిసారించాలన్నారు.
కోర్సుల ఇంటిగ్రేషన్..
అలాగే, పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రస్తుతం డిమాండ్ ఉన్న కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటిని ఉద్యోగాల కల్పన కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నారు. అంతేకాక.. ఇంజినీరింగ్ కోర్సులతోపాటు వెటర్నరీ, అగ్రికల్చర్ కోర్సులను అవసరాలకు అనుగుణంగా ఇంటిగ్రేషన్ చేసేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, ఉన్నత విద్యా శాఖ స్పెష్‌ల్ చీఫ్ సెక్రటరీ సతీష్‌చంద్ర, పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ చైర్‌పర్సన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య, ఏపీఎస్‌సీహెచ్‌ఈ చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, సీసీఈ స్పెషల్ కమిషనర్ ఎంఎం నాయక్ పాల్గొన్నారు.
నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌తోపాటు ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచే ఓ కెపాసిటీ బిల్డింగ్ కాంప్లెక్స్‌ను తీసుకురావాలి. శిక్షణ కేంద్రాలుగా కూడా ఇవి ఉపయోగ పడతాయి. జిల్లాల్లోని మంచి సదుపాయాలున్న కాలేజీలను, ఇతర ప్రభుత్వ శిక్షణ కేంద్రాలను ఇందుకు పరిశీలించాలి.
- సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి