Skip to main content

త్వరలో కొత్త ఐటీ పాలసీని ప్రకటిస్తాం: మేకపాటి గౌతంరెడ్డి

సాక్షి, విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఐటీ పాలసీని త్వరలోనే ప్రకటిస్తామని రాష్ట్ర పారిశ్రామిక, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రకటించారు.
విశాఖలోని మధురవాడ హిల్-3 లో ఉన్న ఐటీ ఇన్నోవేషన్ వ్యాలీలో ఐటీ పరిశ్రమల సీఈవోలు, ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రులు గౌతంరెడ్డి, ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఐటీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అవసరాలు, ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు అన్న విషయాలను పరిశ్రమల ప్రతినిధులను అడిగి తెలసుకున్నారు. ఐటీ రంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారనీ, పరిశ్రమల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గౌతంరెడ్డి స్పష్టం చేశారు. ఐటీ పాలసీని త్వరలోనే ప్రకటించనున్నామనీ.. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన రాయితీలు అందించేలా ఇది ఉంటుందని వివరించారు. ఏడాదికి 50వేల ఐటీ ఉద్యోగాల కల్పన దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. టీడీపీ హయాంలో మంజూరు కాని సబ్సిడీ నిధుల బకాయిలు త్వరలో విడుదల చేస్తామని కంపెనీ సీఈవోలకు హామీ ఇచ్చారు. విశాఖ ఐటీ హిల్స్‌లో ఎన్ని పరిశ్రమలున్నాయి, ఎంత భూమిని పొందాయి, ఎన్ని ఉద్యోగాలు కల్పించాయి, స్థలాలు తీసుకుని బిల్డింగ్‌లు నిర్మాణం చేసి వాటిని ఏవిధంగా వినియోగిస్తున్నారు.. మొదలైన వివరాల్ని వచ్చే సమావేశం సమయానికి తనకు అందించాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు.

అన్ని సదుపాయాలు కల్పిస్తాం
పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా రవాణా, విద్యుత్, మంచినీటి సరఫరా మొదలైన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. పరిశ్రమలు విశాఖ నుంచి తరలిపోతున్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాల్ని ఐటీ అసోసియేషన్ ప్రతినిధులు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రాజెక్టుల్ని ప్రశంసించిన మంత్రులు..
ఈ సందర్భంగా.. వివిధ పరిశ్రమల్ని మంత్రులు పరిశీలించి.. ఉద్యోగులతో మాట్లాడారు. నీటిలో మునిగిపోతున్న వారిని కాపాడే ‘రిమోట్ కంట్రోల్ వాటర్ రెస్క్యూ క్రాప్’ ప్రాజెక్టుని రూపొందించిన ఉద్యోగుల్ని మంత్రులు గౌతంరెడ్డి, ముత్తంశెట్టి ప్రశంసించారు. ఇది ఒడ్డు నుంచి 2 కిలో మీటర్లు దూరం వరకు వెళ్లి రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు తయారీకి రూ.5 లక్షలు వరకు ఖర్చవుతుందని మంత్రులకు వివరించారు.
Published date : 20 Feb 2020 01:59PM

Photo Stories