Skip to main content

సిలబస్ తగ్గింపు దిశగా... తెలంగాణ విద్యాశాఖ యోచన !

సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యలోనూ జాతీయ స్థాయిలో 30 శాతం సిలబస్ తగ్గింపునకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఆ దిశగా విద్యాశాఖ యోచిస్తోంది.

జూన్ 12 నుంచి ప్రారంభమై కొనసాగాల్సిన పాఠశాలలు కరోనా కారణంగా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో వచ్చే నెలలోనూ ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ పాఠశాల విద్యలో సిలబస్‌ను 30 శాతం వరకు తగ్గించే విషయమై విద్యాశాఖ ఆలోచిస్తోంది. దీనిపై ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి చర్చించింది. అయితే జాతీయ స్థాయిలో స్పష్టత వచ్చాక ముందుకు సాగాలన్న అభిప్రాయం వ్యక్తమైనా, సిలబస్ కుదింపు అమలు చేయాల్సి వస్తే ఏయే పాఠ్యాంశాలను తొలగించాలి, ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై ప్రణాళికలను సిద్ధం చేయాలనే భావనకు వచ్చారు.

ప్రతి సబ్జెక్టులో 30 శాతం
కరోనా కారణంగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) తమ పరిధిలోని స్కూళ్లలో 30 శాతం సిలబస్ కుదింపునకు ఆదేశాలు జారీచేసింది. ముఖ్యంగా 9 నుంచి 12వ తరగతి వరకు సిలబస్ కుదింపునకు చర్యలు చేపట్టింది. మరోవైపు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) కూడా పాఠశాలల్లో సిలబస్ కుదింపు, అకడమిక్ వ్యవహారాలు ఎలా ఉండాలనే దానిపై కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ తరగతుల వారీగా ఏయే సబ్జెక్టులో ఎంత సిలబస్‌ను తగ్గించవచ్చనే అంశాలపై ప్రణాళికలు రూపొందిస్తోంది. తరగతుల వారీగా ప్రతి సబ్జెక్టులో 30 శాతం వరకు సిలబస్‌ను తగ్గించే ప్రణాళికలపై దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికై నా అనుగుణంగా సిద్ధంగా ఉండేలా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

సెలవు రోజుల్లోనూ పాఠశాలలు

కరోనా అదుపులోకి వస్తే సెప్టెంబరులో పాఠశాలను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఒకవేళ రాకుంటే అక్టోబరు కావచ్చు లేదా ఇంకా ఆలస్యం కావచ్చు. కాబట్టి సిలబస్ తగ్గించినా పని దినాలు సర్దుబాటయ్యే పరిస్థితి ఉండదని అధికారులు అంటున్నారు. సెప్టెంబరు నాటికే దాదాపు 70 రోజులకు పైగా పనిదినాలు కోల్పోయినట్టవుతుంది. స్కూళ్ల ప్రారంభం ఇంకా ఆలస్యమైతే ఇంకా పని దినాలు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి అందుకు అనుగుణంగా సెలవు దినాల్లో బడులను కొనసాగించేలా ప్రణాళికలను సిద్ధం చేసేందుకు విద్యాశాఖ నడుంబిగించింది. రెండో శనివారాలు, వీలైతే ఆదివారాలు, ఇతర పనిదినాల్లోనూ స్కూళ్లను కొనసాగించేలా ప్రణాళికలను రూపొందించడంపై దృష్టి సారించింది.
Published date : 09 Jul 2020 01:30PM

Photo Stories