పరీక్షల్లో ఒత్తిడి వద్దు, మార్కులు మేధస్సుకు కొలమానం కాదు: ప్రధాని మోదీ
పరీక్షల్లో మంచి మార్కులు సాధించని వారు అనేక మంది ప్రపంచంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు, వారిలో ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసేందుకు 2018 నుంచి ప్రధాని మోదీ ప్రతి ఏడాది నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చ కార్యక్రమం బుధవారం వర్చువల్ వేదిక ద్వారా నిర్వహించారు. పరీక్షా పే చర్చ–2021 కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు ఆయన సావధానంగా సమాధానం ఇచ్చారు. ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో పరీక్షలు వస్తాయని ముందే తెలిసినప్పుడు ఒత్తిడి పెంచుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని ఈ సందర్భంగా ప్రధాని విద్యార్థులకు సూచించారు. అర్థం కాని కొన్ని సబ్జెక్టుల నుంచి పారిపోకుండా దీటుగా ఎదుర్కొన్నప్పుడే విద్యార్థులు విజయం సాధించగలరని అన్నారు. ఏదైనా విషయాన్ని చదివేటప్పుడు విద్యార్థులు ఇన్వాల్వ్, ఇంటర్నలైజ్, అసోసియేట్, విజువలైజ్ (లీనమవడం, అంతర్గత విశ్లేషణ, ఇతరులతో పంచుకోవడం, చదివిన దాన్ని దృశ్య రూపంలో ఊహించుకోవడం) అనే నాలుగు అంశాలను గుర్తుంచుకోవడం ద్వారా వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాని ఇంకా ఏమన్నారంటే..
విద్యార్థుల్లో ఆశావహ దృక్పథం పెంచాలి
- అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ఇళ్లలో అసమానత చూపరాదు. కొందరు తల్లిదండ్రులు తాము నిర్దేశించుకున్న కలలు, లక్ష్యాలను పిల్లలపై మోపి, వాటిని సాధించేందుకు వారిని యంత్రాల మాదిరిగా చూస్తున్నారు. విద్యార్థులు ఆ లక్ష్యాలను సాధించే దిశలో పయనించని పరిస్థితుల్లో పిల్లల్లో లక్ష్య సాధనకు ప్రేరణ లేదని నిందించడం తగదు.
- ఏ విషయాన్ని అయినా పిల్లలకు తర్కబద్ధంగా నేర్పాలి. చిన్నారుల్లో ఆశావాహ దృక్పథాన్ని పెంచాలే తప్ప వారిలో భయాన్ని పెంచే చర్యలు చేపట్టరాదు.
- ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ కల్చర్ పెరిగిపోయిన తర్వాత ప్రసార మాధ్యమాల్లో కనిపించే వారిలా మాత్రమే తాము జీవితంలో మారాలని కోరుకుంటున్నారు. అయితే తమకున్న స్కిల్స్‌ను మెరుగు పరుచుకుంటూ ప్రపంచంలోని అనేక అవకాశాలను అందిపుచ్చుకొనేలా సిద్ధం కావాలి.
- పరీక్ష రాసేందుకు వెళ్లే ముందు విద్యార్థులు తమకున్న ఆందోళనను పరీక్షా కేంద్రం బయటే విడిచి పెట్టాలి. ఎగ్జామ్ వారియర్ పుస్తకంలో నేను రాసిన సలహాలు, సూచనలు విద్యార్థులకే కాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటాయి.
కరోనా మనకు ఎన్నో నేర్పింది
- కరోనా వల్ల మనం ఏవైతే కోల్పోయామో, వాటి కంటే ఎక్కువ తెలుసుకున్నాం. అతి తక్కువ వసతులతో ఎలా జీవించగలమో కరోనా మనకు నేర్పించింది. భావోద్వేగాలను బలపరిచింది.
- చిన్నారులతో తల్లిదండ్రులు స్నేహితులుగా ఉండాలే తప్ప శిక్షకులుగా మారి వారిని అర్థం చేసుకోకుండా వ్యవహరించరాదు. చిన్నారుల సంతోషంలో తల్లిదండ్రులు తప్పకుండా పాలుపంచుకోవాలి. అప్పుడే తరానికి తరానికి మధ్య ఉన్న తేడాను తగ్గించడంలో కీలకపాత్ర పోషించగలరు.
- సంప్రదాయ ఆహారంపై చిన్నారులకు గౌరవభావం పెరిగేలా చర్యలు తీసుకోవాలి. పరీక్షలు పూర్తయ్యాక విద్యార్థులు తమ రాష్ట్రాల్లోని స్వాతంత్య్ర సంగ్రామంతో సంబంధం ఉన్న 75 ఘటనలను మాతృభాషలో రాసే ప్రక్రియను ప్రాజెక్ట్ మాదిరిగా చేపట్టాలి.
ప్రధానిని ప్రశ్న అడిగిన ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన పల్లవి
ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నలమారి పల్లవికి అరుదైన అవకాశం లభించింది. పరీక్షా పే చర్చ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మొదటి ప్రశ్న అడిగింది. ‘గత సంవత్సర కాలంగా కరోనా వల్ల అందరిలోనూ ఆందోళన నెలకొంది. చదువుపై ధ్యాస కంటే కరోనా భయమే అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పరీక్ష ఎలా రాయాలో సలహా ఇవ్వండి సార్’’ అని పల్లవి ప్రధానిని అడిగింది. దీనికి స్పందించిన ప్రధాని మోదీ ‘కరోనా వ్యాధి జాగ్రత్తలు తప్పని సరిగా పాటించండి. దీంతో అది మనదగ్గరకి రాదనే ధైర్యంతో ఉండండి. మనోనిబ్బరంతో ప్రశాంత చిత్తంగా ప్రతి ఏటా రాసినట్లుగానే ఈ సంవత్సరం కూడా పరీక్షలు రాయండి. ప్రత్యేకంగా ఈ పరీక్షలను భావించవద్దు. బెస్ట్ ఆఫ్ లక్’ అని ఆశీస్సులు అందించారు. విద్యార్థిని పల్లవిని విద్యా శాఖ మంత్రి సురేష్, స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, ఎడ్యుకేషన్ కమిషనర్ చినవీరభద్రుడు ఫోన్ చేసి అభినందించారు.