ప్రభుత్వ స్కూళ్లలో పెరుగుతున్న హాజరు శాతం: మంత్రి సబిత
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తుండటంతో 9,10 తరగతుల విద్యార్థుల హాజరు శాతం రోజురోజుకూ పెరుగుతోందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
పాఠశాలల్లో తరగతుల నిర్వహణపై గురువారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో కోవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా అమలయ్యేలా పర్యవేక్షిస్తున్నందున విద్యార్థులు ప్రత్యక్ష తరగతుల హాజరుకు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులకు వీలైనంత ఎక్కువగా ప్రత్యక్ష తరగతులను నిర్వహించి, విద్యార్థుల సందేహాల నివృత్తికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈనెల 1న విద్యార్థుల హాజరును పరిశీలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో 48%, మోడల్ స్కూళ్లలో 37%, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో 6%, తెలంగాణ గురుకుల విద్యా సంస్థలో 19%, ప్రైవేట్ పాఠశాలల్లో 46% ఉందన్నారు. ఇక ఈ నెల 17న చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో 72%, మోడల్ స్కూళ్లలో 69%, కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో 71%, తెలంగాణ గురుకుల విద్యా సంస్థలో 85%, ప్రైవేట్ పాఠశాలల్లో 69 శాతానికి హాజరు పెరిగిందన్నారు. పాఠశాలల నిర్వహణలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మాస్క్, శానిటైజేషన్, భౌతికదూరం వంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడవద్దన్నారు.
Published date : 19 Feb 2021 03:14PM