ఓరియంటల్ బీఏ (ఎల్) వారికే బీఎడ్ తెలుగు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పండిట్ కోర్సులు రద్దయ్యాయి. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) గుర్తింపు లేని కోర్సులను రద్దు చేయాలని రెండేళ్ల కిందటే ఎన్‌సీటీఈ పాలక మండలి మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
దీంతో రెండేళ్లుగా తెలుగు, ఉర్దూ, హిందీ పండిట్ కోర్సులు నిర్వహించడం లేదు. అయితే ఓరియంటల్ లాంగ్వేజెస్ చదివే విద్యార్థులకు మాత్రం అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్‌సీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలుగులో ప్రి-డిగ్రీ కోర్సు (పీడీసీ) తర్వాత బీఏ (ఎల్) ఓరియంటల్ లాంగ్వేజెస్ చదివే వారికి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్)లో చేరే అవకాశం కల్పించింది. ఆ ప్రకారమే తొలిసారిగా 2020-21 విద్యాసంవత్సరం ప్రవేశాల్లో బీఏ లాంగ్వేజెస్ చేసిన వారికే బీఎడ్ తెలుగు మెథడాలజీలో చేరే అవకాశం ఇచ్చింది. హిందీ, ఉర్దూకు సంబంధించి కూడా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓరియంటల్ బీఏ లాంగ్వేజెస్ చేసిన వారికే ఆయా భాషల మెథడాలజీలో బీఎడ్ చేసే అర్హత ఉందని ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌లోనే పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. అయితే కొంతమంది రెగ్యులర్ డిగ్రీలో తెలుగు సబ్జెక్టు చదివిన వారు కూడా బీఎడ్ తెలుగు మెథడాలజీలో చేరేందుకు ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేశారని, నిబంధనల ప్రకారం వారు అనర్హులని వివరించారు. డిగ్రీలో ఇంగ్లిషు సబ్జెక్టు చదివిన వారికి బీఎడ్-ఇంగ్లిషు మెథడాలజీలో చేరే అవకాశం కల్పిస్తున్నపుడు, తమకు బీఎడ్-తెలుగులో చేరే అవకాశం ఎందుకివ్వరని విద్యార్థులు ప్రశ్నిస్తున్నా రు. దీనిపై విద్యాశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ ప్రస్తుత నిబంధనల ప్రకారం వారికి అర్హత లేదన్నారు. అయితే విద్యార్థుల విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పారు.
Published date : 28 Dec 2020 02:47PM