Skip to main content

నాడు-నేడు: కొత్త వైద్య కళాశాలల డిజైన్లపై తుది కసరత్తు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య రంగంలో నాడు-నేడు, కొత్త వైద్య కళాశాలల డిజైన్లను నేడు ఖరారు చేయనున్నారు. దీనికోసం విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోధనాసుపత్రుల సూపరింటెండెంట్‌లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, వైద్య విద్యా సంచాలకులతో పాటు, రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ అధికారులు, ఇంజనీర్లు, 25 మంది కన్సల్టెంట్‌లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. డిజైన్లపై ఇదే తుది సమావేశమని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే నాడు-నేడు పనులపై డిజైన్లు రూపొందించారు. కొత్త వైద్య కళాశాలలకు సైతం డిజైన్లు పూర్తయ్యాయి. 11 బోధనాసుపత్రుల్లో నాడు-నేడు పనులు, 16 కొత్త వైద్య కళాశాలలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు పలు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులను ఉన్నతీకరిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, కొత్త నర్సింగ్ కాలేజీలు నిర్మిస్తున్నారు. వీటన్నింటి డిజైన్లన్నింటినీ తుదిసారి పరిశీలించి, ఖరారు చేయాలని బుధవారం సమావేశం నిర్వహిస్తున్నారు. అనంతరం అన్ని బోధనాసుపత్రుల్లో నాడు-నేడు పనులు మొదలు కానున్నాయి. గతంలో కొన్ని కొత్త వైద్య కళాశాలల డిజైన్లు సీఎం దృిష్టికి వెళ్లగా.. ఆయన కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. వాటికి అనుగుణంగా, భవిష్యత్ తరాలకూ ఉపయోగపడేలా అన్నింటి డిజైన్లను రూపొందించారు.
Published date : 27 Jan 2021 04:56PM

Photo Stories