Skip to main content

మార్చి 5న సాంకేతిక, వృత్తివిద్య ఫీజుల నియంత్రణపై తుది నిర్ణయం

సాక్షి, అమరావతి: సాంకేతిక, వృత్తివిద్య కోర్సుల ఫీజులపై ఉన్నతవిద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కసరత్తు మార్చి 3 (మంగళవారం)ననాటికి దాదాపుగా కొలిక్కి వచ్చింది.
కోర్సుల ఫీజులపై ఆయా కాలేజీల వాదనలకు గత నెల 4వతేదీ నుంచి అవకాశం కల్పించింది. ఫీజుల ప్రతిపాదనలు అందచేసిన 288 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు తమ వాదనలు వినిపించాయి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి, వర్సిటీల నిబంధనలను అనుసరించి సదుపాయాల కల్పన, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు, ల్యాబ్‌లు, గ్రంథాలయాల ఏర్పాటు, కాలేజీల్లో ప్రమాణాలు తదితర అంశాలపై కమిషన్‌కు నివేదించాయి. కాలేజీల నిర్వహణ ఖర్చులపై నివేదికలను కమిషన్ నిపుణుల బృందాలతో అధ్యయనం చేయించింది. కాలేజీల వాదనలు పూర్తయిన నేపథ్యంలో ఫీజుల ప్రతిపాదనలపై ఈ నెల 5వ తేదీన నిర్వహించే కమిషన్ పూర్తిస్థాయి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం ప్రభుత్వానికి కమిషన్ తన ప్రతిపాదనలను అందించనుంది.

తొలిసారిగా ఫీజులపై కమిషన్
ఉన్నత విద్య ప్రమాణాలను మెరుగుపర్చి విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఉన్నత విద్యనభ్యసించే పేద విద్యార్ధులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతి, భోజనం కోసం ఏటా రూ.20 వేలు చొప్పున అందిస్తోంది. ఉన్నత విద్యారంగాన్ని తీర్చిదిద్దేందుకు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలో తొలిసారిగా చట్టబద్ధమైన ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
  • కాలేజీల సామర్థ్యం, వ్యయ సూచీల ఆధారంగా కమిషన్ పరిశీలన చేపట్టింది.
  • జాతీయ స్థాయిలో వివిధ నియంత్రణ సంస్థలు నిర్దేశించిన కాలేజీలు ప్రమాణాలు పాటించడం, సౌకర్యాలు కల్పించడం ప్రామాణికాలుగా కమిషన్ కసరత్తు కొనసాగింది.
  • విద్యా సంస్థల్లో భవనాలు, తరగతి గదులు, సెమినార్ హాళ్లు, ఈ-క్లాస్‌రూములు, ఆట స్థలం, క్రీడా సదుపాయాలు, గార్డెన్, ఫలహార శాల, మంచినీరు, మరుగుదొడ్లు ల్యాబ్‌లు, ఫ్యాకల్టీ, విద్యార్ధుల చేరికలు, ఉత్తీర్ణత, ఉద్యోగ అవకాశాలు, ఇన్నోవేషన్లు, స్టార్టప్‌లు తదితర అంశాలను పరిశీలించారు.
  • మౌలిక వసతుల్లో ల్యాబ్ పరికరాలు, లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ, వైఫై, ఇంటర్నెట్, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్, సాంకేతిక సిబ్బందిని పరిగణలోకి తీసుకున్నారు.
  • ఫ్యాకల్టీ పనితీరులో అకడమిక్ రీసెర్చి (బుక్స్, జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ఆర్టికల్స్ ప్రచురణ, ప్రాజెక్టులు, పేటెంట్‌లు లాంటి అంశాలను పరిశీలించారు.

పారదర్శకంగా కమిషన్ విచారణ
‘జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ క్షుణ్నంగా తనిఖీలు జరిపి కాలేజీల స్థితిగతులపై అవగాహనకు వచ్చింది. కాలేజీల్లో సమస్యలను సరిదిద్దుకునేందుకు వీలుగా సూచనలు అందించింది. ఫీజులపై అన్ని కాలేజీల వాదనలు పూర్తిగా ఆలకించింది. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా సాగింది. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని కాలేజీల నిర్వహణకు వీలుగా సరైన ఫీజులు నిర్ణయిస్తారని ఆశిస్తున్నాం’
- నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు
Published date : 04 Mar 2020 02:45PM

Photo Stories