ఇంగ్లిష్ మీడియాన్ని తీసుకొచ్చేందుకు సుప్రీంకోర్టుకైన వెళ్తాం..: సీఎం వైఎస్ జగన్
Sakshi Education
సాక్షి, తాడేపల్లి : మన పాలన- మీ సూచన కార్యక్రమంలో భాగంగా మే 27న విద్యారంగంపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. బ్రిక్స్ దేశాలతో పోలిస్తే కళాశాలల్లో చేరే విద్యార్థుల నిష్పత్తిలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. చదివించే స్థోమత లేకనే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువులను ఆపేస్తున్నారు.. పాదయాత్రలో పిల్లలను చదివించలేక ఇబ్బందిపడుతున్న చాలా మంది తల్లిదండ్రులను కలిశా. చదువు కోసం తండ్రి అప్పులపాలు కాకూడదని తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు గోపాల్ అనే వ్యక్తి పాదయాత్రలో నాతో చెప్పారు. పేదరిక నిర్మూలనకు ఉన్న ఏకైక పరిష్కారం చదువు మాత్రమే. అందుకే విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుట్టాం. విద్యారంగంలో మార్పుల్లో భాగంగానే ఇంగ్లిష్ మీడియాన్ని తీసుకొచ్చాం. ఇంగ్లిష్ మీడియాన్ని తీసుకొస్తే తెలుగును అగౌరవపరిచినట్లనే కొందరు పెద్ద మనుషులు విచిత్రమైన వాదనను తీసుకొస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం వద్దనే పెద్దమనుషులు మాత్రం...తమ పిల్లల్ని ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తున్నారు. అసెంబ్లీలో చట్టాలు చేయకుండా అడ్డుకుంటారు, కోర్టుల్లో కేసులు వేస్తారు. అయినా సడలని పట్టుదలతో ఇంగ్లిష్ మీడియంపై ఇంటింటి సర్వే చేశాం. దాదాపు 40 లక్షల మంది పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకుంటే.. అందులో 96శాతం మంది ఇంగ్లిష్ మీడియం కావాలన్నారు. ఇంగ్లిష్ మీడియాన్ని తీసుకొచ్చేందుకు సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం.
Published date : 27 May 2020 03:22PM