Skip to main content

ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో చదువులు గాలికి..!

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఎయిడెడ్‌ విద్యా ప్రమాణాలు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి.
చేరికలు తగ్గిపోతూ ప్రమాణాలు పడిపోతున్నా యాజమాన్యాలకు పట్టడంలేదు. పేదలకు ఉచితంగా మంచి విద్యనందించాలన్న ఉన్నతాశయంతో గతంలో దాతలు ఇచ్చిన భూములు, భవనాలు, నగదు తదితరాలను సద్వినియోగపర్చాల్సిన యాజమాన్యాలు ఈ లక్ష్యాన్ని పూర్తిగా గాలికి వదిలేశాయి. ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆడంబరాలకు వెచ్చిస్తూ కాలక్షేపం చేయడమే తప్ప విద్యా సంస్థలను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దడాన్ని పూర్తిగా విస్మరించాయి. మరోవైపు.. దాతలు ఏ లక్ష్యం కోసం వారి ఆస్తులను త్యాగం చేశారో ఆ లక్ష్యసాధన కోసం ప్రభుత్వం అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో పాటు భవనాలు, ఇతర సదుపాయాల కోసం ఏటా రూ.565.79 కోట్లను వెచ్చిస్తోంది.

చేరికలు అంతంతమాత్రమే
ఇక రాష్ట్రంలో ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలు 137 ఉండగా అందులో నాలుగు ఎండోమెంటు (రెలిజియస్‌) శాఖ పరిధిలోవి కాగా 16 మైనారిటీ సంస్థలు. వీటిలో ఎయిడెడ్‌ కోర్సులు, ఆన్ ఎయిడెడ్‌ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఎయిడెడ్‌ కోర్సులు పూర్తిగా ప్రభుత్వ నిధుల సాయంతో నిర్వహించేవి కాగా మిగిలిన కోర్సులు విద్యార్థుల నుంచి ఫీజుల రూపేణా వసూలుచేసి నిర్వహిస్తున్నవి. కానీ, రెండింటిలో కూడా సరైన చేరికలు అంతంతమాత్రమే. గత ఏడాది ఎయిడెడ్‌ కోర్సుల్లో మొత్తం 1,02,234 సీట్లుంటే కేవలం 51,085 మంది మాత్రమే చేరారు. అలాగే, ఆన్ఎయిడెడ్‌ కోర్సుల్లో 1,54,350 సీట్లుంటే 86,530 మంది చేరారు. ఈ సంస్థల్లో ప్రభుత్వ వేతనాలు, ఇతర ఆర్థిక నిధులతో ఉన్న ఎయిడెడ్‌లో బోధనా సిబ్బంది 1,303 మంది, బోధనేతర సిబ్బంది 1,422 మంది ఉన్నారు. అన్ఎయిడెడ్‌లో 1,621 మంది బోధనా సిబ్బంది, 909 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. అలాగే.. 34 ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో చేరికలు 30 శాతం కన్నా తక్కువగా ఉన్నాయి. 33 కాలేజీల్లో చేరికలు 50 శాతానికన్నా తక్కువగా ఉన్నాయి.

నిర్వహణ లోపాలపై సర్కారు దృష్టి
కానీ, ఈ సంస్థల నిర్వహణలో యాజమాన్యాలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. దీంతో ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ సంస్థలు ఏదో ఒక యాజమాన్యంలో కొనసాగేలా చర్యలు చేపట్టింది. ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో 10 కళాశాలలు ఇప్పటికే మూతపడగా ఇంకా 137 ఉన్నాయి. మిగిలిన సంస్థలను పూర్తిగా అప్పగిస్తే ప్రభుత్వమే నిర్వహిస్తుందని యాజమాన్యాలకు ఉన్నత విద్యాశాఖ లేఖలు రాసింది. ఇందుకు అంగీకరిస్తే అన్ఎయిడెడ్‌ సిబ్బందికి అయ్యే వ్యయాన్ని కూడా ప్రభుత్వం భరిస్తుందని ప్రతిపాదించింది. ఇందుకు ఎండోమెంటు విభాగంలోని సంస్థలు మినహా మిగిలిన సంస్థల నుంచి స్పందన రాలేదు. ఆస్తులపై తప్ప విద్యా సంస్థలపై ఆసక్తిలేని యాజమాన్యాలు బదులివ్వలేదు. నిజానికి.. దాతలు ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఆ లక్ష్యం కోసం తప్ప ఇతర ప్రయోజనాలకు ఈ ఆస్తులను వినియోగించడానికి వీల్లేదు. పైగా ఈ విద్యాసంస్థలకు సంబంధించిన భవనాల ఇతర సదుపాయాలను రూసా, యూజీసీ నిధులను వెచ్చించి ఏర్పాటుచేశారు. వీటిని కేవలం విద్యాసంబంధిత కార్యకలాపాలకే వినియోగించాలి. కానీ, కొన్ని యాజమాన్యాలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయి.

జిల్లాల వారీగా ఎయిడెడ్‌ కాలేజీలు..
వాటిలోని ఎయిడెడ్, నాన్ ఎయిడెడ్‌ కోర్సుల సీట్లు ఇలా..

జిల్లా

కాలేజీలు

ఎయిడెడ్‌ సీట్లు

నాన్ ఎయిడెడ్‌ సీట్లు

శ్రీకాకుళం

1

360

1,110

విజయనగరం

5

4,221

7,548

విశాఖపట్నం

8

6,630

9,486

తూ.గోదావరి

10

9,330

13,938

ప.గోదావరి

16

11,724

21,864

కృష్ణ

22

15,225

27,726

గుంటూరు

33

17,154

21,249

ప్రకాశం

10

6,804

2,844

నెల్లూరు

9

6,624

5,658

కర్నూలు

9

11,220

25,245

చిత్తూరు

1

1,896

2,580

అనంతపురం

4

2,820

5,040

కడప

9

8,226

10,062

మొత్తం

137

1,02,234

1,54,350

Published date : 04 Mar 2021 02:49PM

Photo Stories