ఎస్సీ, ఎస్టీ ఉద్యోగార్థులకు 3 ఉచిత కోర్సులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్ తెగల (ఎస్టీ)కు చెందిన ఉద్యోగార్థుల కోసం స్టైఫండ్‌తో కూడిన ఉచిత కోర్సులను అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ కెరియర్ సర్వీస్ సెంటర్ ఫర్ ఎస్సీ/ఎస్టీస్ తెలిపింది.
ఇంటర్మీడియట్ ఆపై విద్యార్హతలున్న అభ్యర్థుల కోసం పేరు పొందిన కోచింగ్ సెంటర్ల ద్వారా మొత్తం మూడు కోర్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. వీటిలో మొదటి కోర్సు క్లరికల్ కేడర్ పోస్టు కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్/ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు/ ఐబీపీఎస్, ఎల్‌ఐసీ తదితర సంస్థలు నిర్వహించే పోటీపరీక్షలకు అందించే శిక్షణ కోర్సు అని పేర్కొంది. ఇందులో 60 మంది శిక్షణార్థులకు 2020 సెప్టెంబర్ 1 నుంచి 11నెలల పాటు శిక్షణనిస్తామని, దీనికి గరిష్ట వయో పరిమితి 27 ఏళ్లు అని వివరించింది. ఇక రెండోది కంప్యూటర్ ‘ఒ’లెవల్ కోర్సు అని, వంద మందికి వచ్చేనెల 1 నుంచి ఏడాది పాటు శిక్షణనిచ్చి ఎన్‌ఐఈఎల్‌ఈటీ సర్టిఫికెట్‌ను అందజేస్తారని తెలిపింది. ఇక మూడోది కంప్యూటర్ హార్డ్‌వేర్ మెయింటెనెన్స్ కోర్సు అని, ఈ సెప్టెంబర్ 1 నుంచి ఏడాది పాటు శిక్షణనిచ్చి ఎన్‌ఐఈఎల్‌ఈటీ సర్టిఫికెట్‌ను ఇస్తారని పేర్కొంది. ఈ రెండు కోర్సుల్లో చేరాలనుకునే వారి వయసు 18-30 ఏళ్ల మధ్యలో ఉండాలని తెలిపింది. ఈ కోర్సుల్లోని ట్రెయినీలకు రూ.1,000 విలువైన పుస్తకాలు ఉచితంగా ఇవ్వడంతో పాటు నెలకు రూ.1,000 చొప్పున స్టైఫండ్ కూడా ఇస్తామని.. అయితే లాడ్జింగ్, బోర్డింగ్ సదుపాయాలు కల్పించడం లేదని వివరించింది. ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3 లక్షలకు మించకూడదని పేర్కొంది. ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌లో నమోదై ఉండి, ఆసక్తి కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పూర్తిచేసిన తమ దరఖాస్తులను ‘నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ ఫర్ ఎస్సీ/ఎస్టీ, నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్ (గతంలోని ఏటీఐ), విద్యానగర్, హైదరాబాద్-500 007 చిరునామాకు వెంటనే పంపిం చాలని సూచించింది. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు కాపీ, బ్యాంక్ ఖాతా కాపీ, మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను జతచేయాలని తెలిపింది.
Published date : 12 Aug 2020 01:13PM