Skip to main content

ఏపీ అంబేద్కర్ ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్ పథకంలో పలు మార్పులు!

సాక్షి, అమరావతి: అంబేద్కర్ ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్ (విదేశీ విద్య) పథకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమూల మార్పులు తీసుకురానుంది.
ఈ పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం రూ.15 లక్షలు ఇస్తోంది. గతంలో బీసీలకు రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. ఈ ఏడాది నుంచి బీసీలకూ రూ.15 లక్షలు ఇవ్వనుంది. ప్రస్తుతం 15 దేశాల్లో మాత్రమే విదేశీ విద్య పథకం కింద చదువుకునే అవకాశం ఉంది. ఈ విధానాన్ని మార్చి ప్రపంచంలోని 250 టాప్ యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మార్పులెందుకు?
విద్యా ప్రమాణాలు సరిగా లేని విదేశీ వర్సిటీ ల్లో/కళాశాలల్లో చదువుకోవడం వల్ల విదేశీ విద్య ఉపయోగం లేకుండాపోతోందని అధికారులు తేల్చారు. ప్రభుత్వ సాయంతో విదేశీ విద్యను అభ్యసించేవారు టాప్ యూనివర్సి టీల్లో చదివితే వారు మెరుగైన ఉపాధి అవకాశాలు పొందుతారని, తద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అంటున్నారు.

గతంలో ఇలా...
  • విదేశీ విద్య పథకం కింద ప్రపంచంలో 15 దేశాల్లోని యూనివర్సిటీలు, కాలేజీల్లో మాత్రమే చదువుకునేందుకు అనుమతి ఉంది.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు ఒక్కో పేరుతో ఈ పథకం అమలు చేస్తున్నాయి.
  • ఫిలిప్పీన్స్, కజకిస్థాన్, చైనాల్లో మాత్రమే ఎంబీబీఎస్ చదువుకునేందుకు అవకాశం ఉంది.
  • కోర్సులో చేరిన ఏడాదిలోపు పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

కొత్త నిబంధనలు ఇలా..
  • ప్రభుత్వం నిర్దేశించిన టాప్ 250 విదేశీ వర్సిటీల్లో చేరినవారికే పథకం వర్తింపు.
  • ఈ వర్సిటీల్లో సీటు వస్తే పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లభిస్తుంది.
  • ఏ దేశంలోనైనా ఎంబీబీఎస్ చదువు కోవచ్చు.
  • ప్రభుత్వ సాయం పొందిన విద్యార్థులు ఎలా చదువుతున్నారో తెలుసుకునేందుకు అధికారులు ఆయా వర్సిటీలను సందర్శిస్తారు.

విద్యార్థికి తప్పనిసరిగా ఉండాల్సినవి..
  • విద్యార్థి టోఫెల్/ఐఈఎల్‌టీఎస్, జీఆర్‌ఈ/జీమ్యాట్ స్కోర్ కలిగి ఉండాలి.
  • అడ్మిషన్ పొందిన విదేశీ యూనివర్సిటీకి గుర్తింపు తప్పనిసరి.
  • చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు ఉండాలి.
  • ఏడాదిలోపు విదేశీ యూనివర్సిటీలో అడ్మిషన్ పొంది ఉండాలి.
  • విద్యార్థి కోర్సు మార్చుకోవాలనుకుంటే స్టేట్ లెవెల్ కమిటీ అనుమతి తీసుకోవాలి.
  • ఏ కోర్సులో చదువుకునేందుకు ఆయా దేశాలకు వెళుతున్నారో వీసాలో స్పష్టంగా పేర్కొనాలి.
Published date : 05 Mar 2020 04:39PM

Photo Stories