Skip to main content

6 నుంచి 10వ తరగతి వరకు డిజిటల్ తరగతులు ప్రారంభం: పి.సబితా ఇంద్రారెడ్డి

సాక్షి, హైదరాబాద్: రానున్న విద్యా సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజులు పెంచవద్దని, ఎవరైనా పెంచినట్లు తేలితే వెంటనే గుర్తింపు రద్దు చేస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు.
ఏప్రిల్ 19న కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కచ్చితంగా అమలయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 20న తన కార్యాలయంలో కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫీజుల రూపంలో కాకుండా ఇతర రూపంలో వసూలు చేసినా గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. కరోనా కారణంగా తల్లిదండ్రులు ఆదాయాన్ని కోల్పోయారని, ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. ప్రతి నెలా ఫీజులను చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు సూచించారు. ఏడాది ఫీజులను ఒకేసారి చెల్లించాలని ఒత్తిడి చేయవద్దని కోరారు. ఎక్కడైనా తల్లిదండ్రులను, విద్యార్థులను విద్యా సంస్థలు ఇబ్బందులకు గురిచేస్తే విద్యా శాఖకు ఫిర్యాదు చేయాలన్నారు.

ఏప్రిల్ 21 నుంచి డిజిటల్ తరగతులు..:
ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు డిజిటల్ పాఠాలను టీ-శాట్ ద్వారా ప్రసారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యార్థులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. http://www.scert.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలను ఈ-టెక్ట్స్ బుక్ రూపంలో అందుబాటులో ఉంచామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో ప్రైవే టు వర్సిటీల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నియమించిన మంత్రుల సబ్ కమిటీ ఏప్రిల్ 25న భేటీ కానుంది. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్, టీ-శాట్ సీఈవో శైలేష్ రెడ్డి, ఎస్‌సీఈఆర్‌టీ డెరైక్టర్ శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.
Published date : 21 Apr 2020 03:40PM

Photo Stories