తెలంగాణకు మరో 230 సీట్లు: మొత్తం అఖిల భారత కోటా ఎంబీబీఎస్ సీట్లు 5,040
రాష్ట్రంలో 2020-21 సంవత్సరానికి మెదక్ జిల్లా పటాన్‌చెరులో టీఆర్‌ఆర్ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) తాజాగా అనుమతించింది. దీంతో మరో 150 సీట్లు ఈ ఏడాది నుంచి అదనంగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 5,040కు చేరుకున్నాయి. ఈఎస్‌ఐసీ సహా మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,740 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. 18 ప్రైవేట్ కాలేజీల్లో 2,750 సీట్లు, 4 మైనారిటీ మెడికల్ కాలేజీల్లో 550 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నట్లు కాళోజీ వర్సిటీ తెలిపింది.
ఈనెల చివరి వారంలో నోటిఫికేషన్
అఖిల భారత కోటా అడ్మిషన్ల నోటిఫికేషన్ ఈ నెల చివరి వారంలో వచ్చే అవకాశాలున్నట్లు కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. కరోనా కారణంగా ఈ ఏడాది నీట్ నిర్వహణలో జాప్యం జరిగింది. దీంతో రాష్ట్ర స్థాయి అడ్మిషన్లను త్వరితగతిన నిర్వహించాలని విశ్వవిద్యాలయం భావిస్తోంది. ఈ నెల 16న నీట్ ఫలితాలు వచ్చినా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఇంకా రాష్ట్రానికి ర్యాంకుల సమాచారం పంపలేదు. ఈ నెల చివరి వారంలో రాష్ట్ర ర్యాంకుల సమాచారం అందుతుందని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా రాష్ట్ర ర్యాంకులను ప్రకటించిన వారం, పది రోజుల్లో దరఖాస్తులు ఆహ్వానిస్తారు. దరఖాస్తుల స్వీకరణ తర్వాత రాష్ట్ర స్థాయి తుది ర్యాంకుల జాబితాను వెల్లడిస్తారు. అయితే ఈసారి అంత సమయం లేకపోవడంతో రాష్ట్ర స్థాయి ర్యాంకుల జాబితాతో పాటు దరఖాస్తుల స్వీకరణ నోటిషికేషన్ ఒకేసారి విడుదల చేస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి.
ఆల్‌ఇండియా కోటాకు 230 సీట్లు
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలల్లోని 15 శాతం సీట్లను ఆలిండియా కోటాకు ఇస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు మినహాయించి, రాష్ట్రం నుంచి సుమారు 230 సీట్లు ఆలిండియా కోటాలోకి ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో అన్ని రాష్ట్రాల నుంచి ఎంబీబీఎస్ 6,410 అఖిల భారత కోటాలోకి చేరాయి. అయితే కరోనా కారణంగా ఈసారి మన రాష్ట్ర విద్యార్థులు దేశంలోని సుదూర రాష్ట్రాల్లో అఖిల భారత స్థాయి కోటాలో సీట్లు వచ్చినా చేరకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2,900 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. మహారాష్ట్రలో 4,289, ఉత్తరప్రదేశ్‌లో 8,250, తమిళనాడులో 8,650, గుజరాత్‌లో 3,750, ఏపీలో 2,960 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వీటిల్లోని 15 శాతం అఖిల భారత సీట్లపై మన విద్యార్థులు దృష్టి సారించే అవకాశముందని పేర్కొంటున్నారు. కాగా, రాష్ట్రంలోనూ ఈసారి ఎంబీబీఎస్ సీట్లకు పోటీ తగ్గింది. గతేడాది ఒక్కో సీటుకు ఏడుగురు పోటీ పడితే, ఈసారి ఐదుగురు మాత్రమే పోటీ పడుతున్నారని అధికారులు అంచనా వేశారు. నీట్‌లో తక్కువ మంది అర్హత సాధించడం, సీట్ల సంఖ్య పెరగడంతో జాతీయ స్థాయిలో లక్షల్లో ర్యాంకు వచ్చినా ఇక్కడ సీట్లు దక్కే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి 50,392 మంది నీట్ రాస్తే, 28,093 మందే అర్హత సాధించారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల వివరాలు
కాలేజీ పేరు | సీట్లు |
1) ఉస్మానియా మెడికల్ కాలేజీ, హైదరాబాద్ | 250 |
2) గాంధీ మెడికల్ కాలేజీ, సికింద్రాబాద్ | 250 |
3) కాకతీయ మెడికల్ కాలేజీ, వరంగల్ | 250 |
4) మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ | 175 |
5) నల్లగొండ మెడికల్ కాలేజీ | 150 |
6) నిజామాబాద్ మెడికల్ కాలేజీ | 120 |
7) సిద్దిపేట మెడికల్ కాలేజీ | 175 |
8) సూర్యాపేట మెడికల్ కాలేజీ | 150 |
9) రాజీవ్‌గాంధీ కాలేజీ, ఆదిలాబాద్ | 120 |
10) ఈఎస్‌ఐసీ, హైదరాబాద్ | 100 |
మొత్తం | 1,740 |
ప్రైవేటు, మైనారిటీ మెడికల్ కాలేజీల్లో సీట్ల వివరాలు
కాలేజీ పేరు | సీట్లు |
1) అపోలో, హైదరాబాద్ | 100 |
2) అయాన్, రంగారెడ్డి జిల్లా | 150 |
3) భాస్కర్ మెడికల్ కాలేజీ, రంగారెడ్డి | 150 |
4) చల్మడ ఆనందరావు మెడికల్ కాలేజీ, కరీంనగర్ | 150 |
5) డెక్కన్ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ | 150 |
6) పట్నం మహేందర్‌రెడ్డి మెడికల్ కాలేజీ, చేవెళ్ల | 150 |
7) వీఆర్‌కే ఉమెన్స్ మెడికల్ కాలేజీ, రంగారెడ్డి | 100 |
8) కామినేని అకాడమీ, హైదరాబాద్ | 150 |
9) కామినేని మెడికల్ కాలేజీ, నార్కట్‌పల్లి | 200 |
10) మహవీర్ మెడికల్ కాలేజీ, వికారాబాద్ | 150 |
11) మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, హైదరాబాద్ | 150 |
12) మల్లారెడ్డి ఉమెన్స్ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ | 150 |
13) మమత మెడికల్ కాలేజీ, బాచుపల్లి | 150 |
14) మమత మెడికల్ కాలేజీ, ఖమ్మం | 150 |
15) మెడిసిటీ మెడికల్ కాలేజీ, ఘన్‌పూర్ | 150 |
16) ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీ, మెదక్ | 150 |
17) ప్రతిమ మెడికల్ కాలేజీ, కరీంనగర్ | 200 |
18) ఆర్వీఎం మెడికల్ కాలేజీ, మెదక్ | 150 |
19) షాదన్ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ | 150 |
20) సురభి మెడికల్ కాలేజీ, సిద్దిపేట | 150 |
21) ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ, మహబూబ్‌నగర్ | 150 |
22) టీఆర్‌ఆర్ మెడికల్ కాలేజీ, మెదక్ | 150 |
మొత్తం | 3,300 |