ప్రతిమ మెడికల్ కళాశాలకుఎంబీబీఎస్ అడ్మిషన్ ఇవ్వండి: హైకోర్టు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల సిబ్బంది నిర్లక్ష్యంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో.. దాన్ని సాకుగా చూపి ఓ విద్యార్థికి ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇవ్వకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
వ్యవసాయ కళాశాల నిర్లక్ష్యానికి ఆ విద్యార్థి భవిష్య త్తును నాశనం చేస్తారా అని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో ఆ విద్యార్థి తప్పేముందని, విక్రమ్‌కు కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్‌లో అడ్మి షన్ ఇవ్వాలని ప్రతిమ మెడికల్ కళాశాలను సోమవారం ఆదేశించింది. ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించి, నిర్దేశిత ఫీజు చెల్లించి మంగళవారం అడ్మిషన్ తీసుకోవాలని విక్రమ్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచందర్‌రావు, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తన ఒరిజినల్ సర్టిఫికెట్లు ప్రభుత్వ అగ్రికల్చర్ కాలేజీలో ఉన్నాయని, ఇది ధ్రువీకరిస్తూ వారు కస్టోడియన్ సర్టిఫికెట్ ఇచ్చినా తనకు ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇవ్వలేదంటూ జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన విక్రమ్ తండ్రి చిన్నరాజు కుమారుడి తరఫున వే సిన పిటిషన్‌ను కోర్టు భోజన విరామ సమయంలో అత్యవసరంగా విచారించింది.
Published date : 29 Dec 2020 01:19PM