మెడికల్ పీజీ పూర్తయినా సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ‘ప్రైవేట్’ నిరాకరణ..!
గతేడాది జూలైలో పీజీ వైద్య కోర్సులు పూర్తి చేసినా ఇప్పటికీ ఆయా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తమ వద్ద ఉంచుకున్న ఎంబీబీఎస్, ఇంటర్, టెన్‌త ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇటు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినా, ఆ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సైతం లేఖలు రాసినా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు బేఖాతరు చేస్తున్నాయి. పెండింగ్ ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని, లేకుంటే ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నాయి. దీంతో యువ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశాలను పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు.
2017లో ఫీజుల పెంపుపై హైకోర్టు ఆదేశాలు
2017-18లో రాష్ట్ర ప్రభుత్వం పీజీ (ఎండీ/ఎంఎస్) కోర్సుల ఫీజులను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ కేటగిరీల ఫీజులను దాదాపు రెట్టింపు చేసింది. 2016-17 వరకు ఏడాదికి కన్వీనర్ కోటాలో రూ.3.2 లక్షలు, మేనేజ్‌మెంట్ కోటాలో రూ.5.8 లక్షల ఫీజులున్నాయి. వాటిని 2017-18లో కన్వీనర్ కోటాలో రూ.6.9 లక్షలు, మేనేజ్‌మెంట్ కోటాలో రూ.24.2 లక్షలు చొప్పున పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. ఎన్‌ఆర్‌ఐ కోటా ఫీజును మేనేజ్‌మెంట్ ఫీజులో మూడింతలు పెంచుకోవచ్చని పేర్కొంది. అంటే రూ.72 లక్షలకు పైగా పెంచుకునే అవకాశం కల్పించింది. భారీగా ఫీజులను పెంచడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేషన్ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) సిఫార్సులతో సంబంధం లేకుండా ఫీజులు పెంచారని, ఏటా ఈ మేరకు ఫీజులు చెల్లించడం సాధ్యం కాదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఫీజుల పెంపు ఉత్తర్వులను హైకోర్టు తాత్కాలికంగా నిలిపేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పెంచిన ఫీజుల్లో సగం మాత్రమే తీసుకోవాలని, మిగిలిన సగం ఫీజుకు అవసరమైన బాండ్ పత్రాలను సమర్పించాలని ప్రైవేటు మెడికల్ కాలేజీలను హైకోర్టు ఆదేశించింది. దీంతో విద్యార్థులంతా ఆ ప్రకారమే పెంచిన ఫీజులో సగమే చెల్లించారు. అయితే 2017లో చేరిన విద్యార్థుల పీజీ వైద్య విద్య గతేడాది జూలైతో ముగిసింది. పీజీ వైద్య విద్య పూర్తయినట్లు సర్టిఫికెట్లను కాళోజీ వర్సిటీ ఇచ్చేసింది. కానీ ఇక్కడే వచ్చిన చిక్కేంటంటే, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పీజీ విద్యార్థుల ఎంబీబీఎస్, ఇంటర్, టెన్‌త ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉండిపోయాయి. ఇవి ఇవ్వకపోతే ఎక్కడైనా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగం చేయాలన్నా, ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలన్నా, పైచదువుకు వెళ్లాలన్నా ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి.. సగమే ఫీజు చెల్లించారని, మిగిలిన ఫీజు కూడా చెల్తిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇప్పుడు యువ డాక్టర్లను వేధిస్తున్నాయి. సూపర్ స్పెషాలిటీ కోర్సులో సీటొచ్చిన వారికి మాత్రం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒత్తిడితో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు సర్టిఫికెట్లు ఇచ్చాయి. కానీ మిగిలిన యువ డాక్టర్లకు ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
కోర్టుకు వెళ్లేందుకు సన్నాహాలు..
2017-18 నుంచి ఇప్పటివరకు ప్రతీ ఏడాది చేరే పీజీ విద్యార్థులంతా సగమే ఫీజు చెల్లిస్తున్నారని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను అనుసరించే ఈ మేరకు చెల్లిస్తున్నారు. గతేడాది జూలైలో పీజీ పూర్తయిన విద్యార్థులు దాదాపు 400 మంది వరకు తమ సర్టిఫికెట్లు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉండిపోయాయని, వాటిని ఇప్పించాలని కోరుతున్నారు. కొందరైతే కోర్టుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. మరికొందరైతే ఎంతో కొంత చెల్లించి రాజీ కుదుర్చుకోవాలని భావిస్తున్నారు. ఇంకొందరు విద్యార్థులైతే మిగిలిన సగం చెల్లించే స్థోమత లేదని, ఇప్పటివరకు చెల్లించిన ఫీజునే అప్పు చేసి చెల్లించామని వాపోతున్నారు. కాబట్టి మానవ హక్కుల కమిషన్ ఆదేశాల ప్రకారం తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు మాత్రం ఇది తమ చేతిలో లేదని చెబుతున్నారు. ఇటు విద్యార్థులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఏ నిర్ణయం తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
బాండ్లున్నాయి కదా సర్టిఫికెట్లు ఇవ్వండి..
పీజీ వైద్య విద్య పూర్తయిన విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే ఫీజులు చెల్లించినందున యువ డాక్టర్లను ఇబ్బంది పెట్టకూడదు.. హైకోర్టు తుది ఉత్తర్వు వచ్చే వరకు ప్రైవేట్ కాలేజీలు వేచి చూడాల్సిన అవసరముంది. పైగా విద్యార్థుల బాండ్లు కూడా కాలేజీల్లో ఉన్నందున మేనేజ్‌మెంట్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. యువ వైద్యుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సర్టిఫికెట్లు ఇవ్వాలి.
- డాక్టర్ పీఎస్ విజయేందర్, కన్వీనర్, తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్