Skip to main content

6,099 పశు సంవర్ధక అసిస్టెంట్ల ఖాళీల భర్తీకీ గ్రీన్‌ సిగ్నల్‌

సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మూగ జీవాలైన పశువుల సంరక్షణ, బాగోగులపై కూడా పెద్ద మనసుతో దృష్టి సారించింది.
అనారోగ్యం బారిన పడకుండా పశువులను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్ల (పశువుల వైద్యులు) పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలతో వెటర్నరీ వైద్య సేవలను అనుసంధానించాలని సూచించారు. నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం వెటర్నరీ వైద్యులు తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాల్లో సేవలందించాల్సిందేనని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఒక నిర్దిష్ట విధానం (ఎస్‌వోపీ) రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆర్బీకేల్లో కియోస్క్‌ ద్వారా పశువుల దాణా, మందులు ఇవ్వాలన్నారు. సీడ్, ఫీడ్, మెడికేషన్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, నాసిరకం వాడకూడదని, కచ్చితంగా క్వాలిటీ మెయింటైన్‌ చేయాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న 6,099 పశు సంవర్ధక అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి కూడా ముఖ్యమంత్రి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 108 తరహాలో పశువులకు కూడా అంబులెన్స్‌ల ద్వారా వైద్య సేవలందించాలన్నారు. బయో పెస్టిసైడ్స్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు. పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖలపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఇంటిగ్రేటెడ్‌ వెటర్నరీ లాబ్స్‌..
వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ వెటర్నరీ లాబ్స్‌ ఏర్పాటు వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. భవనాలన్నీ జూన్‌ 1 నాటికి సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. కొత్తగా 21 ల్యాబ్‌ టెక్నీషియన్లు, 21 లాబ్‌ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్‌కు ఒకే కాల్‌సెంటర్, ఒకే నంబర్‌ ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

వెటర్నరీ ఆసుపత్రుల్లో నాడు–నేడు..
నాడు– నేడు కింద వెటర్నరీ ఆసుపత్రుల నిర్మాణ పనులపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మూడు సంవత్సరాల్లో అన్ని పశు వైద్యశాలలు ఆధునీకరణ పూర్తి చేయాలని, నాడు–నేడు (పశు వైద్యశాలలు) కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

గ్రామ ఫిషరీస్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ..
మత్స్య శాఖపై సమీక్ష సందర్భంగా విలేజీ ఫిషరీష్‌ అసిస్టెంట్ల పోస్టుల భర్తీని వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఆక్వాసాగు చేసే చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీలు ఎక్కువగా అందాలని, మందులు కల్తీ కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు యాంటీ బయోటిక్స్‌ వాడకాన్ని తగ్గించాల్సిందిగా సీఎం ఆదేశించారు.
Published date : 23 Mar 2021 02:52PM

Photo Stories