Skip to main content

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ట్రాన్స్‌జెండర్లకూ అవకాశం.. ఎక్కడంటే..

భువనేశ్వర్‌: ఒడిశా పోలీసు శాఖ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ట్రాన్స్‌జెండర్ల నుంచి కూడా దరఖాస్తులను ఆహ్వానించింది.
477 ఎస్‌ఐ, 244 కానిస్టేబుల్‌ (కమ్యూనికేషన్‌) పోస్టుల భర్తీకి ఒడిశా పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులతోపాటు ట్రాన్స్‌జెండర్లు సైతం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. అప్లికేషన్‌ పోర్టల్‌ జూన్‌ 22 నుంచి జూలై 15 దాకా తెరిచి ఉంటుందని వెల్లడించింది. పోలీసు శాఖలో ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీకి అవకాశం కల్పిస్తుండడం ఇదే మొదటిసారి అని ఒడిశా డీజీపీ అభయ్‌ చెప్పారు. జైలు వార్డర్లుగా ట్రాన్స్‌జెండర్లను కూడా నియమించాలని ఒడిశా ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. అయితే, సంబంధిత నోటిఫికేషన్‌ ఇంకా విడుదల చేయలేదు. ఒడిశా పోలీసు శాఖ తీసుకున్న తాజా నిర్ణయం పట్ల రాష్ట్ర థర్డ్‌ జెండర్‌ మహాసంఘం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ప్రభుత్వ అవకాశం దక్కితే తమ వర్గంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని వివరించింది. దీనివల్ల ట్రాన్స్‌జెండర్ల పట్ల సమాజం దృష్టికోణం కూడా మారుతుందని మహాసంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రతాప్‌కుమార్‌ సాహూ చెప్పారు. ఫిజికల్‌ టెస్టుల విషయంలో తమ వర్గానికి కొన్ని మినహాయింపులు ఇవ్వాలని పోలీసు శాఖను కోరారు. అన్ని పరీక్షల్లో వారు పురుష, మహిళా అభ్యర్థులతో పోటీ పడలేరని అన్నారు.

చ‌ద‌వండి: ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ భారీగా పెరిగింది 

2014లో సుప్రీంకోర్టు ట్రాన్స్‌జెండర్లను థర్డ్‌ జెండర్‌గా గుర్తించింది. రాజ్యాంగం ప్రకారం అందరితోపాటు వారికీ సమాన హక్కులు ఉంటాయని ఉద్ఘాటించింది. ట్రాన్స్‌జెండర్లకు అందరితోపాటు సమాన అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌(ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్స్‌) యాక్ట్‌–2019’ను తీసుకొచ్చింది.
Published date : 14 Jun 2021 07:19PM

Photo Stories