Skip to main content

ఐటీఐలలో బోధన సిబ్బంది కొరత: నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పెద్ద ఎత్తున పోస్టులు ఖాళీ..!!

ఈ ఫొటోలో కనిపిస్తున్నది వరంగల్‌లోని ప్రభుత్వ ఐటీఐ. ఇక్కడ తొమ్మిది ట్రేడ్లు ఉండగా, 600 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు.
ఐటీఐలో డిప్యూటీ ట్రైనింగ్‌ ఆఫీసర్లు 20 మందికి గాను 9 మందే విధులు నిర్వర్తిస్తున్నారు. అసిస్టెంట్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్లు 22 మందికి గాను ఒక్కరు కూడా లేరు. టీచింగ్‌ అసిస్టెంట్లు ఐదుగురికి గాను ఇద్దరే ఉన్నారు. మొత్తంగా వరంగల్‌ ప్రభుత్వ ఐటీఐలో 56 మంది సిబ్బందికి గాను 19 మందే పనిచేస్తుండగా, 37 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.

ప్రభుత్వ ఐటీఐ (ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌ స్టిట్యూట్‌)లను సిబ్బంది కొరత వేధిస్తోంది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగుడెం, ఖమ్మం, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్‌ (కుమురం భీం) జిల్లాల్లో 23 ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయి. ఈ అన్ని ఐటీఐలలో కలిపి డిప్యూటీ ట్రైనింగ్‌ ఆఫీసర్‌ (డీటీఓ)లు 112 మందికిగాను 84 పోస్టులు, అసిస్టెంట్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్‌ (ఏటీఓ)లు 195 మందికి గాను 190 పోస్టులు, టీచింగ్‌ అసిస్టెంట్లు 14 పోస్టులు, రెండు ట్రైనింగ్‌ ఆఫీసర్లు, ఒక ప్రిన్సిపాల్‌ పోస్టు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఐటీఐలలో సిబ్బంది కొరత ఉండటంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య, శిక్షణ అందడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. డీటీఓ, ఏటీఓ పోస్టులు ఖాళీగా ఉండడంతో టీఓలపై పని ఒత్తిడి ఎక్కువవుతోంది.

తగ్గుతున్న గ్రేడింగ్‌
కేంద్ర ప్రభుత్వం ఐటీఐలలో గ్రేడింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. అన్ని సౌకర్యాలు ఉంటేనే ఆ ఐటీఐకి గ్రేడింగ్‌ ఇచ్చి, అక్కడ శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లపై గ్రేడింగ్‌ ఇస్తారు. కానీ బోధన సిబ్బంది లేకపోవడం వల్ల కేంద్రప్రభుత్వం గ్రేడింగ్‌ ఇవ్వకపోవడంతో విద్యార్థులు నష్టపోవాల్సి వస్తోంది.

ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం..
సిబ్బంది కొరత విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వ ఐటీఐల్లో సిబ్బంది కొరత ఉంది. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉన్న వారితోనే అదనపు తరగతులు తీసుకుంటున్నాం.
– సీతారాములు, ఆర్‌డీడీ, వరంగల్‌
Published date : 30 Mar 2021 04:47PM

Photo Stories