Skip to main content

IIT JAM Notification 2024: జామ్‌తో ప్రయోజనాలు.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

ఐఐటీలంటే దేశంలో ఎంతో క్రేజ్‌. పదో తరగతి పూర్తవుతూనే ఐఐటీల్లో చేరాలని కలలు కనే వారెందరో!! ఇంటర్‌లో చేరి జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ కోసం నిద్రాహారాలు మాని ప్రిపరేషన్‌ సాగిస్తారు.
Admission Alert, IIT JAM Notification 2024 and Exam Pattern and Preparation Tips, IIT and JAM Entrance Exams,

కాని పోటీ లక్షల్లో ఉంటే..సీట్లు వేలల్లోనే!! దీంతో ఐఐటీ కల చెదిరి నిరాశతో నిష్క్రమించే వారి సంఖ్యే ఎక్కువ!! అలాంటి వారు తమ ఐఐటీ కల నెరవేర్చుకునేందుకు మరో మార్గం.. జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌.. సంక్షిప్తంగా జామ్‌!! ఇది జాతీయ స్థాయిలో.. ఐఐటీల్లో ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ పీహెచ్‌డీల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. తాజాగా.. జామ్‌–2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. జామ్‌తో ప్రయోజనాలు, ప్రవేశం కల్పించే ఇన్‌స్టిట్యూట్‌లు–కోర్సులు, ప్రవేశ ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

  • పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు జామ్‌ పరీక్ష
  • 21 ఐఐటీల్లో మూడు వేలకు పైగా సీట్లు
  • సెప్టెంబర్‌ 5 నుంచి దరఖాస్తుకు అవకాశం

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)లు.. ఇంజనీరింగ్, సైన్స్‌ విద్యాబోధనలో ప్రపంచ ప్రఖ్యాతి గడించిన ఇన్‌స్టిట్యూట్స్‌. వీటిలో బ్యాచిల­ర్‌ స్థాయిలో బీటెక్‌ ప్రోగ్రామ్‌లో అడుగుపెట్టాలని లక్షల మంది విద్యార్థులు ఆశిస్తారు.ఇలాంటి ప్రసిద్ధ ఐఐటీల్లో పీజీస్థాయిలో చేరే అవకాశం కల్పిస్తోంది.. జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌(జామ్‌).

ఎమ్మెస్సీ కోర్సులు
జామ్‌ ద్వారా ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో మ్యాథమెటిక్స్, సైన్సెస్‌ విభాగాల్లో ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ+పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను ప్రతి ఏటా ఒక ఐఐటీ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఐఐటీ–చెన్నై నిర్వహిస్తోంది. పరీక్ష తేదీలను సైతం ఖరారు చేసింది.

కోర్సులివే
జామ్‌ స్కోర్‌ ద్వారా ప్రవేశం కల్పించే కోర్సులు.. ఎమ్మెస్సీ(రెండేళ్లు); మాస్టర్స్‌ ఇన్‌ ఎకనామిక్స్‌(రెండేళ్లు); జాయింట్‌ ఎమ్మెస్సీ–పీహెచ్‌డీ; ఎమ్మెస్సీ–పీహెచ్‌డీ డ్యూయల్‌ డిగ్రీ; పోస్ట్‌ బ్యాచిలర్‌ డిగ్రీ ప్రోగ్రామ్స్‌; ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌.

Also Read: JAM Previous Papers

అర్హత
సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా 5.5 సీజీపీఏ సాధించాలి. 2024లో చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

మూడు వేలకు పైగా సీట్లు
ప్రస్తుతం దేశంలోని 21 ఐఐటీల్లో.. ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ–పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ రీసెర్చ్, ఎమ్మెస్సీ–ఎంటెక్‌ వంటి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మూడు వేలకుపైగా సీట్లకు జామ్‌ స్కోర్‌ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర సాంకేతిక విద్యా సంస్థలు సైతం జామ్‌తో ఎమ్మెస్సీలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. వీటిలో దాదాపు రెండు వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా ఐఐఎస్‌ఈఆర్‌–పుణె, భోపాల్‌ క్యాంపస్‌లు, ఐఐఎస్‌సీ–బెంగళూరు, ఐఐపీఈ, జేఎన్‌సీఏఎస్‌ఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా జామ్‌ స్కోర్‌ ఆధారంగా ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ–పీహెచ్‌డీ, ఎంఎస్‌ బై రీసెర్చ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

ఏడు పేపర్లు
జామ్‌–2024ను ఏడు టెస్ట్‌ పేపర్లుగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. అవి.. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్‌. అభ్యర్థులు గరిష్టంగా రెండు పేపర్లలో పరీక్షకు హాజరవ్వొచ్చు. ఈ విషయాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాల్సి ఉంటుంది.

జామ్‌.. ఇలా
జామ్‌ పరీక్ష మొత్తం మూడు విభాగాల్లో జరుగుతుంది. వివరాలు..

  • సెక్షన్‌–ఎ: ఇందులో 30 బహుళైచ్ఛిక ప్రశ్నలు (ఎంసీక్యూ) ఉంటాయి. ఇందులో 10 ఒక మార్కు ప్రశ్నలు, 20 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి.
  • సెక్షన్‌–బి: ఈ విభాగంలో 10 మల్టిపుల్‌ సెలక్ట్‌ కొశ్చన్స్‌(ఎంఎస్‌క్యూ) ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. వీటిలో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉంటాయి. అభ్యర్థులు అడిగిన ప్రశ్నకు సరితూగే సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది.
  • సెక్షన్‌–సి: ఈ విభాగంలో 20 న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌ ప్రశ్నలు అడుగుతారు. వీటిలో 10 ప్రశ్నలకు 1 మార్కు చొప్పున, 10 ప్రశ్నలకు 2 మార్కులు చొప్పున కేటాయిస్తారు. 
  • మొత్తం మూడు గంటల వ్యవధిలో వంద మార్కులకు 60 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. 
  • నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన అమలవుతోంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కు చొప్పున కోత విధిస్తారు.


డిగ్రీ స్థాయి పుస్తకాల అధ్యయనం
జామ్‌లో విజయానికి అభ్యర్థులు తమ అకడమిక్‌ సబ్జెక్ట్‌లకు సంబంధించి బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయి పుస్తకాలను లోతుగా అధ్యయనం చేయడం ఉపకరిస్తుంది. సబ్జెక్ట్‌/పేపర్‌ వారీగా ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు..

బయోటెక్నాలజీ
ఇందులో రాణించేందుకు బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ను ప్రిపేరవ్వాల్సి ఉంటుంది. బయాలజీ విభాగానికి సంబంధించి పదో తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు అకడమిక్స్‌ను అభ్యసనం చేయాలి. జనరల్‌ బయాలజీ, బయోకెమిస్ట్రీ అండ్‌ ఫిజియాలజీ, బేసిక్‌ బయోటెక్నాలజీ, మాలిక్యులర్‌ బయాలజీ, సెల్‌ బయాలజీ, మైక్రోబయాలజీ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. కెమిస్ట్రీకి సంబంధించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ పాఠ్యాంశాలను చదవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్‌లను ఇంటర్‌ స్థాయిలో చదివితే సరిపోతుంది.

కెమిస్ట్రీ
ఫిజికల్‌ కెమిస్ట్రీ: బేసిక్‌ మ్యాథమెటికల్‌ కాన్సెప్టులు, అటామిక్‌ అండ్‌ మాలిక్యులర్‌ స్ట్రక్చర్, థియరీ ఆఫ్‌ గ్యాసెస్, సాలిడ్‌ స్టేట్, కెమికల్‌ థర్మోడైనమిక్స్, కెమికల్‌ అండ్‌ ఫేజ్‌ ఈక్విలిబ్రియా, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్‌ కైనటిక్స్, అబ్సార్ప›్షన్, స్పెక్టోమెట్రి; ఆర్గానిక్‌ కెమిస్ట్రీ అండ్‌ స్పెక్టోమెట్రి బేసిక్‌ కాన్సెప్టులు, ఆర్గానిక్‌ రియాక్షన్‌ మెకానిజం, సింథటిక్‌ అప్లికేషన్స్, క్వాలిటేటివ్‌ ఆర్గానిక్‌ అనాలసిస్, ఆరోమాటిక్‌ అండ్‌ హెటిరో సైక్లిక్‌ కెమిస్ట్రీ. ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో పిరియాడిక్‌ టేబుల్, కెమికల్‌ బాండింగ్, షేప్స్‌ ఆఫ్‌ కాంపౌండ్స్, మెయిన్‌ గ్రూప్‌ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్‌ మెటల్స్, బయో ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ, అనలిటికల్‌ కెమిస్ట్రీ.

ఎకనామిక్స్‌
మైక్రో ఎకనామిక్స్, మాక్రో ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్‌ ఫర్‌ ఎకనామిక్స్, ఇండియన్‌ ఎకానమీ, మ్యాథమెటిక్స్‌ ఫర్‌ ఎకనామిక్స్‌లను అధ్యయనం చేయాలి.

జియాలజీ
ప్లానెట్‌ ఎర్త్, జియో మార్ఫాలజీ, స్ట్రక్చరల్‌ జియాలజీ, పాలియోంటాలజీ, స్టాటిగ్రఫీ, మినరాలజీ, పెట్రోలజీ, ఎకనామిక్‌ జియాలజీ, అప్లయిడ్‌ జియాలజీలపై దృష్టి పెట్టాలి.

మ్యాథమెటిక్స్‌
సీక్వెన్సెస్‌ అండ్‌ సిరీస్‌ ఆఫ్‌ రియల్‌ నంబర్స్, ఫంక్షన్స్‌ ఆఫ్‌ వన్‌/టూ/త్రీ రియల్‌ వేరియబుల్, ఇంటెగ్రల్‌ క్యాల్కులస్, డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్, వెక్టార్‌ క్యాల్కులస్, గ్రూప్‌ థియరీ, లీనియర్‌ ఆల్‌జీబ్రా, రియల్‌ అనాలసిస్‌ పాఠ్యాంశాలను ప్రిపేరవ్వాలి.

మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌
ఈ పేపర్‌లో మ్యాథ్స్‌కు 40 శాతం, స్టాటిస్టిక్స్‌కు 60 శాతం వెయిటేజీ ఉంటుంది. మ్యాథ్స్‌కు సంబంధించి సీక్వెన్సెస్‌ అండ్‌ సిరీస్, డిఫరెన్షియల్‌ క్యాల్కులస్, ఇంటెగ్రల్‌ క్యాల్కులస్, మాట్రిసెస్‌ చాప్టర్లను అధ్యయనం చేయాలి. స్టాటిస్టిక్స్‌లో ప్రాబబిలిటీ, ర్యాండమ్‌ వేరియబుల్స్, స్టాండర్డ్‌ డిస్ట్రిబ్యూషన్, జాయింట్‌ డిస్ట్రిబ్యూషన్, సాంప్లింగ్‌ డిస్ట్రిబ్యూషన్, లిమిట్‌ థీరమ్స్, ఎస్టిమేషన్, టెస్టింగ్‌ ఆఫ్‌ హైపో థీసిస్‌లను అధ్యయనం చేయాలి.

ఫిజిక్స్‌
మ్యాథమెటికల్‌ మెథడ్స్, మెకానిక్స్‌ అండ్‌ జనరల్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ మేటర్, ఆసిలేషన్స్, వేవ్స్‌ అండ్‌ ఆప్టిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్‌ మ్యాగ్నటిజం, కైనటిక్‌ థియరీ, థర్మోడైనమిక్స్, మోడ్రన్‌ ఫిజిక్స్, సాలిడ్‌ స్టేట్‌ ఫిజిక్స్, డివైజెస్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ పాఠ్యాంశాలను అధ్యయనం చేయాలి.

అకడమిక్స్‌ ఆయుధంగా
జామ్‌ అభ్యర్థులు ఆయా పేపర్లలో రాణించడానికి తాము ఎంచుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించిన అకడమిక్‌ పుస్తకాలనే ఆయుధంగా చేసుకోవాలి. బ్యాచిలర్‌ స్థాయి అకడమిక్స్‌ను ఔపోసన పట్టడం మేలు చేస్తుంది. అదే విధంగా జామ్‌ పాత ప్రశ్న పత్రాలు, గేట్‌ సైన్స్‌ సబ్జెక్ట్‌లకు సంబంధించి పాత ప్రశ్న పత్రాలు ప్రాక్టీస్‌ చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. అభ్యర్థులు కాన్సెప్ట్స్, అప్లికేషన్‌ అప్రోచ్‌లపై పట్టు సాధించాలి. అప్పుడే పరీక్ష హాల్లో ప్రశ్నను ఏ రూపంలో అడిగినా.. సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది. ముఖ్యంగా మల్టిపుల్‌ సెలక్ట్‌ కొశ్చన్స్‌ విషయంలో ఈ దృక్పథం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అప్లికేషన్‌ అప్రోచ్‌తో అధ్యయనం చేస్తే సదరు ప్రశ్న భావాన్ని అర్థం చేసుకుని సమాధానం ఇవ్వడం తేలిక అవుతుందని నిపుణులు అంటున్నారు.


ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: సెప్టెంబర్‌ 5 – అక్టోబర్‌ 13, 2023
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: జనవరి 8, 2024
  • జామ్‌ తేదీ: ఫిబ్రవరి 11, 2024
  • ఫలితాల వెల్లడి: మార్చి 22, 2024
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://jam.iitm.ac.in/
Published date : 31 Aug 2023 12:04PM

Photo Stories