Skip to main content

అగ్రికల్చరల్ కోర్సులు.. అవకాశాలెన్నో..!!

అగ్రికల్చరల్ కోర్సులు.. మెడికల్ కోర్సుల తర్వాత ఎంసెట్ ఉత్తీర్ణులకు ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్న కోర్సులు. అగ్రికల్చరల్ కోర్సులను ప్రత్యామ్నాయ కోర్సులుగా భావించకుండా.. ప్రధానమైన కోర్సులుగా పరిగణించాలని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.పద్మరాజు సూచిస్తున్నారు. అగ్రికల్చరల్ కోర్సులతో భవిష్యత్‌లో బహుళ ప్రయోజనాలు ఉంటాయని ఆయన స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ, వ్యవసాయ సంబంధ కోర్సులకు కౌన్సెలింగ్ జరుగుతున్న తరుణంలో.. అగ్రికల్చరల్ కోర్సులు, కెరీర్ అవకాశాలపై ఎ.పద్మరాజుతో ప్రత్యేక ఇంటర్వ్యూ...

ప్రధాన కోర్సులుగానే పరిగణించాలి:
ఎంసెట్ (అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్) ఉత్తీర్ణుల్లో అధిక శాతం విద్యార్థులు ముందుగా మెడికల్ కోర్సులను లక్ష్యంగా పెట్టుకుంటారనేది నిస్సందేహం. వాటిలో అవకాశం రాకపోతే అగ్రికల్చర్ సంబంధిత కోర్సుల వైపు దృష్టిసారిస్తారు. కానీ ఇదే సమయంలో గమనించాల్సిన అంశం.. అగ్రికల్చర్ సంబంధిత కోర్సులకు క్రమేణా ప్రాధాన్యం పెరుగుతోంది. మా యూనివర్సిటీ నిర్వహించిన గత కంబైన్డ్ యూజీ కౌన్సెలింగ్‌లో అన్ని కోర్సుల్లోనూ.. మూడు రీజియన్లు(ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ)లోనూ ఓపెన్ కేటగిరీలో నాన్-ఫార్మర్ కోటాలో 15 వేల లోపు ర్యాంకుతోనే సీట్లన్నీ భర్తీ అయ్యాయి. రాష్ట్రంలోని టాప్ ఇంజనీరింగ్ కళాశాలల్లోని లాస్ట్ ర్యాంకులతో పోల్చితే అంతే ప్రాధాన్యం అగ్రికల్చరల్ కోర్సులకు కూడా లభిస్తోందనే విషయం స్పష్టమవుతోంది. అంతేకాకుండా.. కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులోని మొత్తం 30 సీట్లు భర్తీ అయ్యాయి. దీన్నిబట్టిచూస్తే.. అగ్రికల్చర్, సంబంధిత కోర్సులు కేవలం ప్రత్యామ్నాయ కోర్సులు కాదని.. వీటిని ప్రధాన కోర్సులుగానే పరిగణించాలనే విషయం స్పష్టమవుతుంది. ఈ కోర్సులకు లభిస్తున్న ఆదరణను పరిగణనలోకి తీసుకుని బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో ఇప్పటికే ఉన్న సీట్లకు అదనంగా 75 సీట్లను పెంచాం.

బీటెక్ అగ్రికల్చర్ ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా:
ఇంటర్మీడియెట్ ఎంపీసీ అర్హతగా యూనివర్సిటీ అందిస్తున్న బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సులో సీట్లను ఎంసెట్-ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తాం. ఈ కోర్సులో చేరదలచుకున్న విద్యార్థులు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ కోర్సు ప్రధాన ఉద్దేశం.. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను ఇంజనీరింగ్ నైపుణ్యాలతో అనుసంధానం చేసి, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిని మరింత పెంచడం. ఈ నెల పదో తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం. కౌన్సెలింగ్‌తో సంబంధం లేకుండా కొత్త విద్యా సంవత్సరంలో క్లాసుల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశాం.

థియరీతోపాటు ప్రాక్టికల్ అప్రోచ్:
కొత్త విద్యా సంవత్సరంలో అగ్రికల్చరల్ సంబంధిత కోర్సుల్లో చేరే విద్యార్థులు తొలిరోజు నుంచే ప్రాక్టికల్ దృక్పథంతో అడుగులు వేయాలి. కరిక్యులం కూడా అందుకు అనుగుణంగానే ఉంటుంది. కేవలం క్లాస్‌రూం లెర్నింగ్, సెల్ఫ్ స్టడీకి పరిమితం అవుదాం అనే ధోరణితో రాణించలేరు. ప్రాక్టికాలిటీకి పెద్దపీట వేయాలి. తోటి విద్యార్థులతో కలిసి కంబైన్డ్ స్టడీస్ సాగించడం కూడా ఎంతో మేలు చేస్తుంది. కొత్త అంశాలు, అర్థం కాని విషయాలపై కంబైన్డ్ స్టడీతో స్పష్టత లభిస్తుంది. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల విద్యార్థులకు క్షేత్రస్థాయి అంశాలపై అవగాహన కల్పించేందుకు యూనివర్సిటీ చేపట్టిన మరో వినూత్న కార్యక్రమం.. రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అవేర్‌నెస్ ప్రోగ్రాం (RAWEP). ఒక రకంగా ఇది ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం వంటిది. ఇందులో భాగంగా నాలుగేళ్ల వ్యవధిగల కోర్సులో చివరి సెమిస్టర్‌లో ఆరు నెలలపాటు విద్యార్థులు ఆయా గ్రామాల్లో వ్యవసాయదారులు, వ్యవసాయ క్షేత్రాల్లో జరిగే కార్యకలాపాల్లో పాల్పంచుకోవడం.. అప్పటికే తాము తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అనుసంధానం చేయడం.. వ్యవసాయదారులకు తగిన సలహాలు, సూచనలు అందించడం వంటివి చేయాలి. ఫలితంగా విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలోనే వాస్తవ పరిస్థితులపై అవగాహన లభిస్తుంది. దేశంలోనే ఇలాంటి ప్రోగ్రాంను అందిస్తున్న తొలి యూనివర్సిటీ ఆచార్య ఎన్.జి.రంగా యూనివర్సిటీ. కరిక్యులం విషయంలోనూ నిరంతరం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు తెస్తూ విద్యార్థులు అప్‌డేటెడ్‌గా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్యాంపస్ నుంచి పీజీ చదివి గేట్ ర్యాంకుల ద్వారా ఐఐటీల్లో సీట్లు పొందిన పూర్వ విద్యార్థులే ఇక్కడి బోధన ప్రమాణాలకు నిదర్శనం.

వాస్తవాలను ప్రతిబింబించేలా:
యూజీ కోర్సుల విద్యార్థులకు విషయ పరిజ్ఞానం పూర్తి స్థాయిలో అందించే క్రమంలో వాస్తవాలను ప్రతిబింబించేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. నారుమళ్లు వేయడం, నాగలి పట్టి దుక్కిదున్నడం మొదలు నిర్ణీత ఉత్పత్తి చేతికందే వరకూ.. ప్రాక్టికాలిటీ దిశగా ఆయా కాలేజీల క్యాంపస్‌లలోనే పంటలు పండించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇలా ప్రతి దశలోనూ ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యమిస్తూ విద్యార్థులు పరిపూర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నాం.

సీఏబీఎం సిలబస్‌లో మార్పు :
వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు సిలబస్ మార్చాలని ఆలోచిస్తున్నాం. ఈ కోర్సులో అధిక శాతం మేనేజ్‌మెంట్ సబ్జెక్ట్‌లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నాం. ఈ కోర్సంటే పూర్తిగా అగ్రికల్చర్ సంబంధిత కోర్సు అనే అభిప్రాయం తొలగించి అగ్రికల్చర్, బిజినెస్ మేనేజ్‌మెంట్ రెండు అంశాల సమ్మిళితంగా రూపొందించాలన్నదే ఉద్దేశం. దీనివల్ల భవిష్యత్తులో ఉపాధి దిశగా ఆయా వ్యవసాయ ఉత్పత్తుల సంస్థల్లో చేరే విద్యార్థులు సంస్థల్లో ఉత్పత్తి, నిర్వహణ విభాగాల్లో సమర్థంగా రాణించేందుకు వీలవుతుంది.

పరిశోధనలకు ప్రాధాన్యం:
ఆచార్య ఎన్‌జీ రంగా వర్సిటీ చేపడుతున్న కార్యకలాపాల్లో ప్రధానమైంది పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వడం. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వంటి కారణాలతో కాలుష్యం స్థాయి అంతకంతకూ పెరిగి.. అది వ్యవసాయంపై ప్రభావం చూపుతోంది. కాలుష్యాన్ని తట్టుకుని పంటల దిగుబడి పెంచేలా పలు పరిశోధన ప్రాజెక్టులు చేపడుతున్నాం. ఈ క్రమంలో పలు పంటల విషయంలో దేశంలోనే తొలిసారిగా 302 రకాలను ఆవిష్కరించాం. అంతేకాకుండా తక్కువ వ్యయంతో పంటల దిగుబడి సాధించే టెక్నాలజీల ఆవిష్కరణ కూడా చేశాం. అనేక పారిశ్రామిక సంస్థలు పరిశోధనల విషయంలో యూనివర్సిటీతో ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయంటేనే పరిశోధనలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు.

పలు దేశాలతో ఎక్స్చేంజ్ ఒప్పందాలు:
కేవలం మన దేశ వ్యవసాయ పద్ధతుల గురించే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయిక పద్ధతులపై అవగాహన కల్పించేందుకు పలు దేశాలకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌లతో ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ఒప్పందాలు కూడా చేసుకున్నాం. ఒక్క అమెరికాలోనే 20 ఇన్‌స్టిట్యూట్స్‌తో ఇలాంటి ఒప్పందం ఉంది. మన దేశంలోనూ ఐఐటీ-బాంబే, ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదిరాయి.

‘ఐటీ’తో అనుసంధానం దిశగా:
అన్ని రంగాల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో.. అగ్రికల్చరల్ కోర్సులను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో అనుసంధానం చేసేందుకు కృషి చేస్తున్నాం. ఈ క్రమంలో ఆంధ్రా యూనివర్సిటీతో ఎంఓయూ కుదిరింది. దీంతోపాటు భవిష్యత్తులో దూర విద్యా విధానంలో వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్‌లో స్వల్పకాలిక కోర్సును ప్రారంభించాలనే యోచనలో ఉన్నాం. ఇది త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. అదేవిధంగా పీజీ స్థాయిలోనూ పలు కొత్త స్పెషలైజేషన్లు ప్రారంభించే ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే తిరుపతిలో నానోటెక్నాలజీ స్పెషలైజేషన్‌ను ప్రవేశపెట్టాం. ఇదే క్రమంలో ఆధునిక పద్ధతులకు అనుగుణంగా.. పీజీ స్థాయిలో మైక్రోబయాలజీ, బయో టెక్నాలజీ, అగ్రిమార్కెటింగ్ ఇంటెలిజెన్స్, అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్లను ప్రారంభించాం.

అవకాశాలు పుష్కలం:
అగ్రికల్చర్ సంబంధిత కోర్సుల విషయంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినప్పటి నుంచే అపార అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్లేస్‌మెంట్స్ కోణంలో చూసినా.. ఉన్నత విద్య, పరిశోధనల దృష్టితో ఆలోచించినా.. అనేక ప్రయోజనాలు వీరికి సొంతమవుతున్నాయి. బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్‌తోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ద్వారా పలు ఎంఎన్‌సీలు రూ.లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలందిస్తున్నాయి. ఉన్నతవిద్య పరంగా ఎమ్మెస్సీలో చేరితే ఫెలోషిప్ లభిస్తుంది. ఆ తర్వాత పీహెచ్‌డీ చేస్తే అవకాశాలకు ఆకాశమే హద్దు.

ఉన్నత విద్యలో పోటీ తీవ్రం:
పస్తుతం అగ్రికల్చరల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత విద్య వైపు అడుగులు వేయాలా? లేదా ఉద్యోగంలో చేరాలా? అనేది ఆయా విద్యార్థుల ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి తీసుకోవాల్సిన నిర్ణయం. ఆర్థిక పరిస్థితులు అనుకూలించని విద్యార్థులు ఉద్యోగంలో చేరి కూడా దూర విద్య విధానం ద్వారా ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. ఇక.. ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు యూజీలో చేరిన తొలి రోజు నుంనే అదే లక్ష్యంతో కృషి చేయాలి. పీజీ స్థాయిలో అగ్రికల్చర్ కోర్సుల సీట్లు, కాలేజీల సంఖ్య పరిమితం. కాబట్టి వాటికి పోటీ ఎంతో తీవ్రంగా ఉంటుంది. ఆ పోటీని తట్టుకోవడం సాధారణ స్థాయిలో చదివే విద్యార్థులకు సాధ్యం కాదు. కాబట్టి పీజీ లక్ష్యంగా పెట్టుకుంటే దానికి తగిన రీతిలో ముందుగానే ప్రణాళికలు రూపొందించుకుని అడుగులు వేయాలి.

హార్డ్‌వర్క్ ముఖ్యం:
అగ్రికల్చరల్ కోర్సులు ఇతర కోర్సులకంటే భిన్నమైనవి. తప్పనిసరిగా బురదలో, మట్టిలో పనిచేయాల్సిన విధంగా ఈ కోర్సుల స్వరూపం ఉంటుంది. అందువల్ల అగ్రికల్చరల్ కోర్సుల విద్యార్థులకు కష్టించి పనిచేసేతత్వం ఉండాలి. కోర్సు ఆసాంతం క్షేత్ర స్థాయి బోధన సమ్మిళితంగా ఉంటుంది. ముఖ్యంగా.. 30 నుంచి 40 ఏళ్ల భవిష్యత్తుకు ఈ కోర్సులు పునాది. వీటిని దృష్టిలో ఉంచుకుని విషయ పరిజ్ఞానం పెంచుకునే దిశగా నిరంతరం శ్రమించాలి. అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజలతో, ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో పనిచేయగల నేర్పు, ఓర్పు అవసరం. ఈ లక్షణాలు అలవర్చుకుంటే అద్భుతమైన కెరీర్ సొంతమవుతుంది.
Published date : 05 Sep 2013 05:18PM

Photo Stories